సాక్షి, విశాఖపట్నం: భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. ఈ ప్రభావంతో ఏపీ అంతటా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా వాయుగుండంగా బలపడనుంది. వాయుగుండంగా బలపడిన తరువాత ప్రభావం పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఇప్పటికే రాయలసీమ తేలికపాటి వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుందన్నారు.
పెరిగిన చలి తీవ్రత
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, కిలగడలో 5.8, డుంబ్రిగూడ 7.8, కరిముక్కిపుట్టి 8, పాడేరు 8.1, అరకు, పెదబయలు 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: విస్తరించిన అల్పపీడనం


