సాక్షి,హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను గందరగోళంలోకి నెట్టిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలను పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెనుక మరికొందరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకు ఊతం ఇచ్చేలా ఐబొమ్మ వెబ్‌సైట్ ఓ మెసేజ్‌ను విడుదల చేసింది. అందులో..‘మీరు ఇటీవల మా గురించి విని ఉండచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా, మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము’ అని ఉంది.
అరెస్టు అనంతరం, సీసీఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను మూసేయించారు. అయినప్పటికీ ఇవాళ ఆ సైట్ నుంచి తాజా మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.


