డ్రైవింగ్ సరిగ్గా రాకుండానే స్టీరింగ్ పట్టుకున్న ఒక మైనర్ అత్యుత్సాహం ఒక కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టేసింది. రెండో బిడ్డ రాక కోసం కలలు కంటున్న నిండు గర్భిణి తన కల తీరకుండానే అనంత లోకాలకు చేరింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో 33 ఏళ్ల గర్భిణి భారతీయ మహిళ కన్నుమూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా అదుపు తప్పిన లగ్జరీ BMW కారు ఢీకొట్టింది. గత వారం ఈ విషాదం చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హార్న్స్‌బైలోని జార్జ్ సెయింట్ వెంబడి ఉన్న ఫుట్‌పాత్‌పై వాకింగ్ చేస్తోంది ధరేశ్వర్. వేగంగా వస్తున్న BMW కారు, ముందున్న కియా కార్నివాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కియా కారు ధరేశ్వర్‌ను బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ధరేశ్వర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే వెస్ట్ మీడ్ ఆసుపత్రికి తరలించినా, వారిని కాపాడలేక పోయామన్నారు. ఈ ఘటనలో రెండు కార్ల డ్రైవర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ధరేశ్వర్ భర్త, ఆమె మూడేళ్ల బిడ్డ ఎలా ఉన్నారనే దానిపై సమాచారం లేదు.
ఇదీ చదవండి: మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు, నాలుక కొరికేసిన యువతి
నిందితుడు 19 ఏళ్ల P-ప్లేటర్ (తాత్కాలిక లేదా ప్రొబేషనరీ లైసెన్స్ ఉన్న డ్రైవర్) ఆరోన్ పాపాజోగ్లుగా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్ నిరాకరించారు. కాగా మృతురాలు ధరేశ్వర్ IT సిస్టమ్స్ ఎనలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చదవండి: అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్‌మేన్‌కు దిమ్మ తిరిగింది


