తొలి ఇన్నింగ్స్‌లో 518/7
హెడ్, స్మిత్ సెంచరీలు
‘యాషెస్’ సిరీస్ చివరి టెస్టు
సిడ్నీ: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. ఫలితంగా ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 3–1తో చేజిక్కించుకున్న కంగరూలు ఆఖరి పోరులో పరుగుల వరద పారిస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 166/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆ్రస్టేలియా జట్టు... మంగళవారం ఆట ముగిసే సమయానికి 124 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది.
ఓపెనర్ ట్రవిస్ హెడ్ (166 బంతుల్లో 163; 24 ఫోర్లు; 1 సిక్స్), కెపె్టన్ స్టీవ్ స్మిత్ (205 బంతుల్లో 129 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో కదం తొక్కారు. కామెరాన్ గ్రీన్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), బ్యూ వెబ్‌స్టర్ (58 బంతుల్లో 42 బ్యాటింగ్; 4 ఫోర్లు) కూడా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టారు. చేతిలో 3 వికెట్లు ఉన్న ఆసీస్ జట్టు... ఇంగ్లండ్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్మిత్‌తో పాటు వెబ్‌స్టర్ క్రీజులో ఉన్నాడు.
స్మిత్ సూపర్ సెంచరీ...
శతకానికి 9 పరుగుల దూరంలో మంగళవారం ఇన్నింగ్స్ కొనసాగించిన హెడ్... 105 బంతుల్లో మూడంకెల మార్క్ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో హెడ్‌కిది మూడో సెంచరీ కావడం విశేషం. నైట్ వాచ్‌మన్ నెసెర్ (90 బంతుల్లో 24; 4 ఫోర్లు) అతడికి చక్కటి సహకారం అందించడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. మూడో వికెట్‌కు నెసెర్‌తో కలిసి హెడ్ 72 పరుగులు జోడించాడు. అతడు అవుటయ్యాక స్మిత్‌తోనూ అదే లయ కొనసాగించాడు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం హెడ్ అవుట్ కాగా... కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అలెక్స్ కేరీ (16) విఫలమయ్యాడు.
అయితే చివర్లో గ్రీన్, వెబ్‌స్టర్ అండతో స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయిన స్మిత్... చివరి మ్యాచ్‌లో తనదైన ఆటతీరుతో చెలరేగాడు. ఈ క్రమంలో 166 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యాషెస్‌లో అతడికిది 13వ సెంచరీ కాగా... సిడ్నీ మైదానంలో ఐదోది. ఈ ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియా ఏడు వికెట్లకు అర్ధ శతక భాగస్వామ్యాలు నమోదు చేసింది. ‘భాగస్వామ్యాలు బాగా కుదిరాయి. అందుకే సాఫీగా పరుగులు రాబట్టగలిగాం. తొలి ఇన్నింగ్స్‌లో రెండొందల పరుగుల ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వికెట్ నెమ్మదిగా మారుతోంది. ఇది నా సొంత మైదానం. ఇక్కడ బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా’ అని స్మిత్ అన్నాడు.
⇒ 13 ‘యాషెస్’లో స్టీవ్ స్మిత్ సెంచరీల సంఖ్య. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో జాక్ హబ్స్ (12)ను అధిగమించి స్మిత్ రెండో స్థానానికి చేరాడు. డాన్ బ్రాడ్‌మన్ 19 శతకాలతో ‘టాప్’లో ఉన్నాడు.
⇒ 37 టెస్టు క్రికెట్‌లో స్మిత్ సెంచరీల సంఖ్య. అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (36)ను అధిగమించి
ఆరో స్థానానికి ఎగబాకాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), జో రూట్ (41), కుమార సంగక్కర (38) ముందున్నారు.
⇒3682 ‘యాషెస్’లో స్మిత్ చేసిన పరుగులు. బ్రాడ్‌మన్ (5028) అగ్ర స్థానంలో ఉండగా... స్మిత్ రెండో స్థానానికి చేరాడు.
⇒ 18 సారథిగా స్మిత్ సాధించిన శతకాలు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్ (25), విరాట్ కోహ్లి (20), రికీ పాంటింగ్ (19) ముందున్నారు.


