ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో సెంచరీతో మెరిశాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో (తొలి ఇన్నింగ్స్) ఈ ఫీట్‌ను సాధించాడు. స్టీవ్‌కు టెస్ట్‌ల్లో ఇది 37వ శతకం. ఇంగ్లండ్‌పై 13వది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 49వది.
సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో స్టీవ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 129 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా బ్యూ వెబ్‌స్టర్ (42) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 518 పరుగులుగా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌పై ఆసీస్ 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (163) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మిగతా బ్యాటరల్లో వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, స్టోక్స్ 2, టంగ్, బేతెల్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. జో రూట్ అద్భుత శతకంతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.


