కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తనను వేధించిన పురుషుడికి తనదైన శైలిలో బుద్ధి చెప్పింది. ఉత్తరప్రదేశ్‍లోని (Uttar Pradesh) కాన్పూర్‍లో (Kanpur) జరిగిన ఈ ఘటన నెట్టింట సంచలనంగా మారింది. బిల్‌హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన మాజీ ప్రియుడు, వివాహతుడు వేధించడం మొదలు పెట్టాడు. ఒంటరిగా పొలానికి వెళ్లిన ఆమెను వెంటపడి, లైంగికంగా వేధించి, బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ యువతి తనను తాను రక్షించుకునే చర్యలో భాగంగా అతని నాలుకను కొరికింది. దెబ్బకి నిందితుడి నాలుక తెగిపడింది. దీంతో లబోదిబో మంటూ ఆసుపత్రిలో చేరాడు.
స్టోరీ ఏంటీ అంటే
కాన్పూర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిల్‌హోర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దరియాపూర్ గ్రామానికి చెందిన చంపీ (35) అనే వ్యక్తికి ఇప్పటికే వివాహం అయింది. అయినా ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇంతలో ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో ఇతనితో మాట్లాడటం మానేసింది. ఇది అతగాడికి ఆగ్రహం తెప్పించింది. ఆమెను వేధించడం ప్రారంభించాడు. సమయం కోసం వేచి ఉన్న అతగాడు ఒంటరిగా ఉన్న ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీన్ని ఆమె ప్రతిఘటించింది. అక్కడితో ఆగకుండా అతగాడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో,నాలుకను బలంగా కొరికేసింది. నిందితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్ లోని మరో ఆసుపత్రికి తరలించారు.
తనకిష్టంలేదని చెప్పినా వినకుండా చంపీ రోజూ తనను వేధిస్తూనే ఉన్నాడని బాధితురాలు ఆరోపించింది. వద్దని వారించినా వినకుండా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై లైంగిక వేధింపు కేసు నమోదు చేసామని డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


