జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పిన సామాన్య రైతు
‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అనే సామెత గురించి మనందరికి తెలుసు. ఆకారాన్ని, ఆహార్యాన్ని చూసి ఎవర్నీ తక్కువ చేసి చూడకూడదు. అవమానించకూడదు.ఇది అక్షర సత్యమని మన జీవితాల్లో చాలాసార్లు రుజువైంది కూడా. అలా తనను అవమానించిన సేల్స్‌మ్యాన్‌కు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పాడో సామాన్య రైతు.
2022లో కర్ణాటకలోని రామన్‌పాల్య గ్రామానికి చెందిన కెంపెగౌడ ఆర్.ఎల్. అనే రైతు కారు కొందామని షోరూంకు కెళ్లాడు. తన స్నేహితులతో తుమకూరులోని మహీంద్రా కార్ షోరూమ్‌కు వెళ్ళాడు. కొత్త బొలెరో పికప్ కొనాలనేది అతని ప్లాన్.
కానీ రైతును చూసి మర్యాదగా, స్నేహపూర్వకంగా పలకరించడానికి బదులుగా సేల్స్‌మేన్ అమర్యాదగా ప్రవర్తించాడు. కెంపెగౌడ సాధారణ దుస్తులను చూసి, పనికొచ్చే కస్టమర్ కాదనుకుని ఊహించేసుకున్నాడు. జేబులో పది రూపాయలు కూడా లేవంటూ అవమానించాడు. దీనిపై కెంపెగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రూపాన్ని బట్టి ఎలా తీర్పు ఇచ్చేస్తావంటూ అతని స్నేహితులు కూడా మండిపడ్డారు. అంతేకాదు కెంపెగౌడ సేల్స్‌మ్యాన్‌కు ఛాలెంజ్ చేశారు. గంటలో డబ్బుతో వస్తాం.. కానీ ఇదే రోజు కారు డెలివరీ చేయాలంటా సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: లోగో గుర్తుపట్టలేదని ఉద్యోగమివ్వలేదు, కట్ చేస్తే రూ. 400 కోట్ల కంపెనీ
కానీ కెంపెగౌడను తక్కువ అంచనా వేసిన సేల్స్‌మ్యాన్, హా.. ఇదంతా ఉత్తిత్తి బెదిరింపు అనుకొని సై అన్నాడు. బ్యాంకు నుండి ఇప్పటికిపుడు అంత డబ్బు తీసుకోవడం అసాధ్యం అనుకున్నాడు. కట్ చేస్తే సరిగ్గా అరగంటకు కెంపెగౌడ , అతని స్నేహితులు సూట్‌కేస్‌తో వచ్చారు. అక్షరాలా రూ. 10 లక్షల నగదును టేబుల్‌పై ఉంచారు. దీంతో సేల్స్‌మ్యాన్‌కి నోట మాటరాలేదు. అప్పుడు తాను సరిదిద్దుకోలేని తప్పు చేశానని అర్థమైంది. కానీ ఏం లాభం. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. వాహనాన్ని డెలివరీ చేయడం షోరూం వల్ల కాలేదు. పైగా ఆ తరువాత రెండు రోజులు సెలవులు. ఏం చేయాలో అర్థంకాక షో రూం సిబ్బందికి చెమటలు పట్టాయి.
మరోవైపు కెంపెగౌడ తనకిపుడు వాహనం కావాలని పట్టుబట్టాడు. వాదన పెరిగింది. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. సేల్స్‌మ్యాన్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే కెంపెగౌడ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక జన్మలో ఆ కారు కొనకూడదని నిర్ణయించుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. కెంపెగౌడ పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు క్షమాపణలు చెబుతూ , అధికారిక ప్రకటన విడుదల చేసింది కంపెనీ. తమ కంపెనీ వాహనాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ వాహనం అందేలా చేసి మహీంద్రా కుటుంబంలోకి అధికారికంగా స్వాగతించారు.


