ముంబై: ఓ రైతు పంట కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. కానీ ప్రకృతి సహకరించలేదు. పంట దిగుబడి రాలేదు. తీసుకున్న వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఆ సమయంలో ఇద్దరు వైద్యులు రైతుల్ని ఆశ్రయించారు. ‘నీ కిడ్నీ ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాం’ అని నమ్మించారు. అప్పుల భారంతో బాధపడుతున్న రైతు ఒప్పుకుని కిడ్నీ ఇచ్చాడు. అయితే ముందుగా చెప్పిన మొత్తాన్ని కాకుండా, కొంత మాత్రమే ఇచ్చారు. మోసపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ బయటపడింది.
మహారాష్ట్రలోని చంద్రపూర్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం పాన్-ఇండియా స్థాయిలో నడుస్తున్న కిడ్నీ రాకెట్‌ను బట్టబయలు చేసింది. ఈ రాకెట్‌లో భాగస్వాములైన ఇద్దరు వైద్యులు దేశవ్యాప్తంగా దాతల నుంచి కిడ్నీలను సేకరించి, వాటిని కాంబోడియా, చైనా సహా పలు దేశాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీలో పనిచేస్తున్న డాక్టర్ రవీందర్ పాల్ సింగ్, తిరుచిరాపల్లిలోని ఒక ప్రముఖ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజరత్నం గోవిందస్వామి ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణం మింతూర్ గ్రామానికి చెందిన రైతు రోషన్ కూలే. అప్పుల బారిన పడి అతను కాంబోడియాలో తన కిడ్నీని అమ్ముకోవాల్సి వచ్చింది. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నకిలీ డాక్టర్‌గా వ్యవహరించిన రామకృష్ణ సుంచు, మధ్యవర్తి హిమాన్షు భారద్వాజ్ వంటి వ్యక్తులు అరెస్టయ్యారు. వీరి వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు, మొబైల్ డేటా విశ్లేషణల ద్వారా పెద్ద నెట్‌వర్క్ బయటపడింది.
దర్యాప్తులో తిరుచిరాపల్లికి చెందిన ఆస్పత్రిలో అనధికారిక శస్త్రచికిత్సలు జరిగాయని, భారద్వాజ్ మొదట కిడ్నీ దాతగా, తర్వాత మధ్యవర్తిగా మారాడని పోలీసులు గుర్తించారు. అతని కిడ్నీని 2024 జూలై 23న తిరుచ్చిలో తొలగించినట్లు ఆధారాలు లభించాయి. ఈ రాకెట్‌లో ప్రతి కిడ్నీ మార్పిడి ధర 50 లక్షల నుండి 80 లక్షల వరకు ఉండేది. డాక్టర్ సింగ్ ఒక్కో శస్త్రచికిత్సకు 10 లక్షలు, డాక్టర్ గోవిందస్వామి 20 లక్షలు, మధ్యవర్తి సుంచు 20 లక్షలు పొందేవారు. కానీ దాతలకు మాత్రం కేవలం 5–8 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. అన్ని లావాదేవీలు హవాలా మార్గం ద్వారా జరిగేవి.డాక్టర్ సింగ్ ఢిల్లీలో అరెస్టయ్యాడు. డాక్టర్ గోవిందస్వామి మాత్రం పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.


