breaking news
Kidney agents
-
బాబూ.. అమ్మాయి, పిల్లలు బాగున్నారు?! అలాగే కిడ్నీలు జాగ్రత్త బాబూ..!
-
అప్పనంగా కిడ్నీలు కొట్టేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కిడ్నీ దాతలు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో(ఎస్‌ఓఎస్‌ఐఎంఎస్.కామ్ వంటి సైట్ల ద్వారా) చేసిన పోస్టుకు స్పందించిన దాతలకు కుదుర్చుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ముంబై, ఢిల్లీలో పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ప్రధాన నిందితుడు, భోపాల్ వాసి అమ్రిష్ ప్రతాప్ తప్పించుకుపోవడంతో లుక్అవుట్ నోటీసు జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం అప్పగించారు. అతడికి సహకరించిన ఢిల్లీవాసి రింకీ, నోయిడా వాసి సందీప్ కుమార్‌లను కూడా ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 40 వరకు బలవంతపు కిడ్నీల మార్పిడిలు చేసినట్టుగా అనుమానిస్తున్న ఈ ముఠా వివరాలను నాగోల్‌లోని రాచకొండ పోలీసు కమిçషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ సోమవారం మీడియాకు తెలిపారు. భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ ఫేస్బుక్లో పోస్టును చూసిన నగరవాసి స్పందించి రూ.20లక్షలకు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ ముఠా అతడిని ఈజిప్టు తీసుకెళ్లి బలవంతంగా కిడ్నీ మార్పిడి చేసి డబ్బులు ఇవ్వలేదు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భార్య బాగు కోసం మోసాలబాట... ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడిన భోపాల్‌కు చెందిన అమ్రిష్ ప్రతాప్ అలియాస్ అంబారిష్ చిన్నతనంలోనే అమ్మనాన్నలను కోల్పోవడంతో తాత, నాన్నమ్మల వద్ద పెరిగాడు. 2006లో హిమాంగి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు నాడీ సంబంధిత సమస్యలు రావడంతో ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో చికిత్సకోసం దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆర్థిక సమస్యల్లో పడ్డాడు. వీటని అధిగమించేందుకు తొలుత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేసిన అమ్రిష్ ప్రతాప్ మెడికల్ టూరిజమ్‌కు మారాడు. తొలుత చట్టవ్యతిరేకంగా అద్దెకు తల్లులు(సరోగసీ విధానం) నుంచి మొదలెట్టి ఆ తరవాత మానవ అవయవాల మార్పిడి వ్యాపారంవైపు మళ్లాడు. ఇలా డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసపు దందాకు తెరలేపాడు. డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారి అవయవాలు మార్పిడి చేసి డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ వాసి రింకి, నోయిడా వాసి సందీప్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. టర్కీలో కిడ్నీ ఇచ్చేందుకు వచ్చిన సమయంలో సందీప్ కుమార్ ఈ మోసం గురించి తెలుసుకొని తానుకూడా అమ్రిష్ ప్రతాప్‌తో చేయికలిపి డబ్బు అవసరమున్న వారిని గుర్తించి ఇతడి చేతిలో పెట్టాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి కోటి వరకు రోగుల నుంచి ఈ ముఠా తీసుకునేది.ఇలా ఈ ముఠా రోగులు, దాతలను శ్రీలంకలో కొలంబోలొరి వెస్టర్న్ ఆస్పత్రి, ఈజిప్ట్ కైరోలోని అల్ ఫహద్ హాస్పిటల్, టర్కీ ఇజ్మిర్‌లోని కెంట్ ఆస్పతుల్లో 40 వరకు కిడ్నీ మార్పిడీలు చేశారు. డబ్బులివ్వకపోవడంతో వెలుగులోకి మోసం.. సందీప్ కుమార్ ఫేస్బుక్ ఖాతా రోహన్ మాలిక్ పేరుతో సృష్టించి భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ చేసిన పోస్టు చూసిన రాచకొండ కమిషనరేట్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు వారిని సంప్రదించారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముఠాసభ్యుడొకరు వాట్సాప్‌లో బాధితుడితో సంప్రదింపులు జరిపాడు. రూ.20లక్షలు ఇస్తామంటూ ఆశ చూపాడు. ఢిల్లీకి రావాలంటూ ముఠా సభ్యులు అతనికి రైలు టికెట్ బుక్ చేశారు. గత జులై 20న అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్లో ఉంచారు. ఢిల్లీ మరికొన్నిచోట్ల వైద్య పరీక్షలు జరిపించారు. బాధితుడు రోగి బంధువుగా ధ్రువీకరణపత్రం సృష్టించారు. అనంతరం వైద్య వీసాపై అతణ్ని ఆగస్టులో టర్కీకి తీసుకెళ్లారు. అయితే శస్త్రచికిత్సకు ముందు డబ్బు ఇవ్వాలని బాధితుడు పట్టుబట్టడంతో అతని పాస్‌పోర్టు లాక్కొని బెదిరింపులకు దిగారు. అతడు భయపడటంతో శస్త్రచికిత్స చేయించి కిడ్నీ తీసేశారు. ఆ ముఠా బారి నుంచి బయటపడి హైదరాబాద్‌కు చేరుకున్న బాధితుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇది అంతర్జాతీయ ముఠా పనిగా గుర్తించారు. అమ్రిష్ ప్రతాప్‌ను పట్టుకోవడానికి ఢిల్లీ, ముంబైకి వెళ్లగా తప్పించుకొనిపోయాడు. అయితే లుక్ అవుట్ నోటీసు జారీతో ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సింగపూర్ నుంచి వచ్చిన అమ్రిష్ ప్రతాప్‌ను పట్టుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అతడిచ్చిన సమాచారంతో వారిని ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. వీరిని పోలీసు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ మహేష్ భగవత్ అన్నారు.అమ్రిష్ ప్రతాప్‌పై 2016లో నల్గొండలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాయిగూడెం పోలీసు స్టేషన్లలో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు. దుబాయ్, వియత్నాం, చైనా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్, ఇండోనేసియా, మెక్సికోకు కూడా వెళ్లొచ్చని, అక్కడ కూడా కిడ్నీ మార్పిళ్లు ఏమైనా చేశాడా అనే విషయాలు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తెలుస్తాయని సీపీ అన్నారు. -
నలుగురు కాదు వంద
రాష్ట్రంలోని కిడ్నీ ఏజెంట్ల సంఖ్య ఇది దేశవ్యాప్తంగా వెయ్యికిపైగానే ప్రధాన సూత్రధారి ప్రశాంత్‌సేఠ్, ఆలం కోసం వేట సాక్షి, హైదరాబాద్ : దినేష్ మృతితో కిడ్నీ రాకెట్ గుట్టు విప్పిన సీసీఎస్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న విజయవాడ, పశ్చిమగోదావరి, నల్లగొండ, హైదరాబాద్‌కు చెందిన కిడ్నీ ఏజెంట్లు శ్రీనివాస్, కిరణ్, వెంకటేశ్వర్లు, సురేష్లను విచారించగా పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు వెలుగు చూశాయి. మన రాష్ట్రంలోనే వందకుపైగా కిడ్నీ క్రయవిక్రయాలు జరిపే ఏజెంట్లు ఉన్నారని వెంకటేశ్వర్లు వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లో తేలింది. వీరంతా శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి కిడ్నీ ఇచ్చి వచ్చిన వారే కావడం గమనార్హం. మరింత ఆదాయం గడించేందుకు ఏజెంట్లుగా మారిన వీరు తెలిసిన వారికి గాలం వేసి ప్రధాన సూత్రధారి ద్వారా శ్రీలంకకు పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కలిపితే వెయ్యికిపైగా ఏజెంట్లు ఉంటారని తెలిసింది. ప్రధాన సూత్రధారులు మాత్రం ఒడిశా, చెన్నైకి చెందినవారని పోలీసుల విచారణలో తేలింది. దినేష్ మృతిపై విచారణ కోసం తమ దేశం వస్తే పూర్తి సహకారం అందిస్తామని సీసీఎస్ పోలీసులకు శ్రీలంక పోలీసులు తెలిపారు. కిడ్నీ అమ్మేవారిని బ్రోకర్లు వారి పాస్‌పోర్టుపై విజిటింగ్ వీసా కింద స్టాంపింగ్ వేయించి శ్రీలంక తీసుకెళ్తున్నారు. విజిటింగ్ వీసాపై వెళ్లిన వ్యక్తి అనారోగ్యానికి గురైతే అక్కడి డాక్టర్లు ఆకస్మిక వైద్యం అందించవచ్చు. అంతేగాని ఆరోగ్యంగా ఉన్న అతని నుంచి కిడ్నీ తీయడం నేరం. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఇలా వెళ్లి కిడ్నీ అమ్ముకున్న వారందరి పాస్‌పోర్టులపై విజిటింగ్ వీసా అని స్టాంపింగ్ వేసి ఉంది. ప్రశాంత్‌సేఠ్ ఆఫర్ లెటర్.... ‘హలో.. నేను ప్రశాంత్ సేఠ్‌ని.. కిడ్నీ అమ్మాలనుకున్నారా.. నేను అన్ని విధాల సహాయపడతా. ఆపరేషన్ మాత్రం ఇరాన్, సింగపూర్, శ్రీలంక దేశాలలో మాత్రమే చేయిస్తా. పాస్‌పోర్టు, ట్రావెల్స్ ఖర్చులు, భోజనం, వసతితో పాటు సకల సౌకర్యాలు నేనే కల్పిస్తా. అడిగినంత డబ్బు కూడా ఇస్తా. నా గురించి నచ్చిన వారు నా మెయిల్ లేదా సెల్ నంబర్‌ను సంప్రదించండి’ అని దినేష్ మెయిల్‌కు ప్రశాంత్‌సేఠ్ మార్చి 9న ఆఫర్ లెటర్ పంపాడు. ప్రశాంత్ కోసం వేట... రాష్ట్రంలో ఉన్న కిడ్నీ ఏజెంట్లకు ప్రశాంత్సేఠ్తో పాటు చెన్నైకి చెందిన ఆలం ప్రధాన సూత్రధారులని తేలింది. దీంతో వారి కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆలం కాశ్మీర్‌కు పారిపోయాడని నిర్ధారించుకున్న పోలీసులు ప్రశాంత్‌సేఠ్ కోసం ప్రత్యేక పోలీసు బృందంతో గాలిస్తున్నారు.