ఆటో డ్రైవర్‌నుంచి రూ. 400 కోట్ల కంపెనీకి సీఈవోగా
RodBez Founder Dilkhush Success Story: నడి గుండెల్లో నిప్పుంది మండించు దాన్ని ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని అంటాడో సినీ కవి. ఈ సరిగ్గా ఈ మాటలకు అతికినట్టు సరిపోయే సక్సెస్ స్టోరీ బిహార్‌కు చెందిన ఆటో డ్రైవర్ ది. ఎక్కడో ఒక మారు మూల గ్రామంలో పుట్టాడు. చదివింది 12వ తరగతే. సెక్యూరిటీ గార్డు ఉద్యోగానివెళితే.. కాదు పొమ్మన్నారు. కట్ చేస్తే 400 కోట్ల కంపెనీ సీఈవో. ఆసక్తిగా ఉంది కదూ.. పదండి ఈ విజయగాథ ఏంటో తెలుసుకుందాం.
ఇది బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్ (Dilkhush Kumar) కథ. ఇతని సక్సెస్ స్టోరీ IIT గ్రాడ్యుయేట్లను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పట్టుదలగా పనిచేస్తే, దిల్ ఉంటే.. ఆటో డ్రైవర్ కూడా ఒక కార్పొరేట్ కంపెనీ సీఈవోగా సత్తా చాటవచ్చని నిరూపించిన కథ. 12వ తరగతి చదివిన ఒక సాదారణ యువకుడు ఆటో డ్రైవర్‌గా నానా కష్టాలు పడ్డాడు. కానీ వాటినే తలుచుకుంటూ అక్కడే ఆగిపోలేదు దిల్‌ఖుష్. ఈ రోజు రూ.400 కోట్ల వ్యాపార ప్రపంచాన్ని సృష్టించాడు.
తన చదువుకు తగ్గట్టుగా అనుకొని ఒక రోజు సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు దరఖాస్తు చేశాడుదిల్‌ఖుష్ కానీ విద్యార్హతలు సరిపోవంటూ తిరస్కరించారు. దీంతోపాటు అనేక ఇంటర్వ్యూలకు వెళ్లాడు. యాపిల్ లోగోను గుర్తించలేకపోవడంతో ఈ ఉద్యోగం పొందలేకపోయాడు. ఈ తిరస్కరణలు అతన్ని వెనక్కి నెట్టలేదు, మరింత కసి పెంచాయి. ముందుకు నడిపించాయి. తానూ పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని నిర్ణయించు కున్నాడు. ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించాడు. అదే ఎన్నో జీవిత పాఠాల్ని నేర్పించింది. ఎన్నో సమస్యల్ని కళ్లారా చూశాడు. వాటిల్లోంచే ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లాలనుకుంటే సురక్షితమైన మార్గం లేదనీ, సుదూర ప్రాంతాలకు, టాక్సీలు ఖరీదైనవి , నమ్మదగినవి లేవని గమనించాడు. చాలామంది అతని కస్టమర్లు కూడా ఇదే ఫిర్యాదు చేశారు. తానే ఏదో చేయాలని నిర్ణంచుకున్నాడు. పెద్దగా పెట్టుబడిలేదు. ధైర్యమే అతని పెట్టుబడి.
2016లో "రోడ్‌బెజ్"(Roadbez) అనే యాప్ సేవను ప్రారంభించాడు. ఇదిరైడ్-హైలింగ్ యాప్ కాదు, సొంత టాక్సీలూ ఉండవు. విశ్వసనీయ నెట్‌వర్క్. కానీ ప్రజలు, సర్టిఫైడ్ , నమ్మకమైన స్థానిక డ్రైవర్లను కలిపే నమ్మకమైన ప్లాట్‌ఫారమ్. "రోడ్‌వేస్" అనే ఆలోచన సరళమైనది కానీ శక్తివంతమైనది. 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసే వారికి వాహనాలను అందిస్తుంది.
రోడ్‌బెజ్ వన్-వే టాక్సీలను అందించింది, కాబట్టి మీరు రౌండ్ ట్రిప్ కోసం చెల్లించాల్సిన అవసరం లేదు. వారు 50 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి కార్‌పూలింగ్, రైడ్-షేరింగ్‌ను ప్రోత్సహించారు. దీని వలన సామాన్యులకు కూడా సుదూర ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. అలా మొత్తం రాష్ట్ర ప్రయాణ అనుభవాన్ని నెమ్మదిగా మార్చాడు.
తరువాత 2021లో,బిహార్‌లోని ప్రతి నగరాన్ని అనుసంధానించడానికి అతను ఒక యాప్‌ను ప్రారంభించాడు. అతనిని , అతని ఆలోచనను, పెట్టుబడిదారులు నమ్మారు. రూ. 40 లక్షల ప్రారంభ నిధులు వచ్చాయి. అతను అందించిన గ్యారెంటీ గేమ్-ఛేంజింగ్. రోడ్‌బెజ్ డ్రైవర్ పొరబాటు కారణంగా ఒక వేళ విమానాన్ని మిస్ అయితే, కంపెనీ కొత్త టికెట్ బుక్ చేస్తుంది. అంతకు ముందు ఇలాంటి ఆఫర్ మరి ఏ సంస్థ ఇవ్వలేదు. భారీ ఆదరణ లభించింది. కేవలం 7 నెలల్లోనే దిల్‍ఖుష్, అతడి టీమ్ ఏకంగా రూ.4కోట్ల నిధులను సమీకరించింది.
షార్క్ ట్యాంక్ ఇండియా సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు అతని ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యంత తెలివైన వ్యాపారవేత్తల ముందు, IIT ,IIM గ్రాడ్యుయేట్ల ముందు నమ్మకంగా నిలబడి, తన కంపెనీలో 5 శాతం కోసం రూ. 50 లక్షలు అడగడంతో వారంతా షార్క్స్ ముగ్ధులయ్యారు. మార్కెట్‌పై అతని లోతైన అవగాహన, అద్భుతమైన ప్రయాణాన్ని చూసి ఫిదా అయిపోయారు. చివరికి, OYOకి చెందిన రితేష్ అగర్వాల్ , ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన నమితా థాపర్ రూ. 50 లక్షలు పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా చాలా తక్కువ సమయంలోనే వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టించింది కంపెనీ. రూ. 4 వందల కోట్ల వ్యాపారంగా మారింది. ఇప్పుడు తన స్టార్టప్‌లో ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. సక్సెస్ ఫుల్ థాట్స్ కేవలం కార్పొరేట్ బోర్డ్ రూంల నుంచే కాదు.. మామూలు ఆటోడ్రైవర్ ఆలోచనలోంచి కూడా పుడతాయని నిరూపించాడు దిల్‌ఖుష్


