జైల్లో ఉన్న ఉమర్‌కు మమ్దానీ సందేశం
ఉమర్ విడుదల కోరుతూ భారత రాయబారికి అమెరికా ప్రతినిధులు లేఖ
అభ్యంతరం తెలిపిన వీహెచ్‌పీ, బీజేపీ
న్యూయార్క్: ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్‌కు అమెరికాలోని న్యూయార్క్ నూతన మేయర్ జొహ్రాన్ మమ్దానీ మద్దతు తెలపడం తీవ్ర వివాదం రేపుతోంది. ‘డియర్ ఉమర్, విద్వేషం, చేదు అనుభవం గురించి నువ్వు చెప్పిన మాటలను, అది ఒక వ్యక్తిని పూర్తిగా దహించి వేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు వివరించిన తీరును నేను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీ తల్లిదండ్రులను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది.
మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం’అని ఆ నోట్‌లో ఉంది. మమ్దానీ స్వయంగా రాసి సంతకం చేసిన ఆ నోట్‌ను ఆయన భాగస్వామి బనోజ్యోత్స్న లాహరి ఎక్స్‌లో.. ‘జైళ్లు ఒంటరిని చేయడానికి ప్రయతి్నస్తే మాటలు ప్రయాణిస్తాయి. ఉమర్ ఖలీద్‌కు జొహ్రాన్ మమ్దానీ ఇలా రాశారు..’అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. ఢిల్లీలో 2020 లో చెలరేగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది క్షతగాత్రులయ్యారు. ఈ గొడవలకు ఖలీద్, తదితరులు కుట్ర పన్నారనే ఆరోపణలపై అధికారులు కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా)తోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
భారత రాయబారికి ప్రజా ప్రతినిధులు లేఖ
ఉమర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అమెరికా చట్ట సభల ప్రతినిధులు 8 మంది అక్కడి భారత రాయబారి వినయ్ క్వాత్రా ఒక లేఖ రాశారు. ‘2020 నాటి ఢిల్లీ హింసకు సంబంధించి అరెస్టయిన ఉమర్ ఖలీద్ సహా పలువురి సుదీర్ఘ నిర్బంధంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, స్వేచ్ఛ, చట్టబద్ధత, మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్య ఉంది. ఇదే ఉద్దేశంతో ఖలీద్ నిర్బంధం అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. ఉమర్ ఖలీద్ ఐదేళ్లుగా బెయిల్ లేకుండా జైలులో ఉండటం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు’అని వారు అందులో పేర్కొన్నారు.
అప్పుడెందుకు మాట్లాడలేదు?: వీహెచ్‌పీ
ఉమర్ ఖలీద్‌ను విడిచిపెట్టాలంటూ న్యూయార్క్ నూతన మేయర్ మమ్దానీ, అమెరికా ప్రజా ప్రతినిధులు చేసిన వినతిపై బీజేపీ, వీహెచ్‌పీ తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. భారత్ విభజన గురించి మాట్లాడిన నేరగాడికి మద్దతివ్వడం ఖురాన్‌ను అగౌరవపర్చడమే అవుతుందని వీహెచ్‌పీ వ్యాఖ్యానించింది. ఖురాన్‌పై ప్రమాణం చేసిన మమ్దానీ, ఉమర్ ఖలీద్‌కు మద్దతు తెలపడం ద్వారా ఆ ఖురాన్‌ను అవమానించారని పేర్కొంది. బీజేపీ కూడా మమ్దానీ నోట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. మమ్దానీతోపాటు అమెరికా చట్టసభల ప్రతినిధులు భారత్ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది.


