72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలి
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌కు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ సారథ్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ప్రచురితమవ్వడంపై కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చట్ట వ్యతిరేక, అసభ్యకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశించింది. ముఖ్యంగా ఏఐ యాప్ గ్రోక్‌తో ఇలాంటి కంటెంట్ జనరేట్ చేయడం, ప్రచురించడం వెంటనే ఆపేయడంతోపాటు తీసివేయాల్సిందేనంది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
భారత్‌లో ఎక్స్ ఆపరేషన్స్ భాధ్యతలు చూసే చీఫ్ కంప్లయెన్స్ అధికారికి శుక్రవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ మేరకు నోటీసు పంపింది. అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించడానికి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించడానికి 72 గంటల గడువిస్తున్నట్లు పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2020, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు– 2021లోని నిబంధనలను పాటించడం లేదని తమ పరిశీలనలో తేలిందని అందులో పేర్కొంది.
‘చట్టాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికే రూపొందించిన, ప్రచురించిన మొత్తం కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశిస్తున్నాం. అదేవిధంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారాలను ధ్వంసం చేయరాదని ఈ నెల 2వ తేదీనాటి ఉత్తర్వులో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే ఎక్స్‌పైన, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించని పక్షంలో లీగల్ ఇమ్యూనిటీ సైతం రద్దవుతుందని పేర్కొంది. యూజర్లు చేసే తప్పులకు కూడా నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎక్స్‌కు తెలిపింది.
సోషల్ మీడియాదే బాధ్యత
సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌కు సంబంధిత వేదికలే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇటువంటి కంటెంట్ ప్రసారమయ్యే సామాజిక వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఇటీవల సిఫారసు చేసిందన్నారు. ఏఐ యాప్ గ్రోక్ అసభ్యకర దృశ్యాలను జనరేట్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఈమేరకు స్పందించారు.


