ఇక ధరల లెక్క కొత్తగా | Retail inflation at 2. 75percent in January as India shifts to new CPI base year 2024 | Sakshi
Sakshi News home page

ఇక ధరల లెక్క కొత్తగా

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

Retail inflation at 2. 75percent in January as India shifts to new CPI base year 2024

వినియోగ ధరల సూచీలో కీలక మార్పులు 

జనవరిలో ద్రవ్యోల్బణం 2.75% 

సీపీఐకి బేస్‌ ఇయర్‌గా 2024 

తెలంగాణలో ధరలు ఎక్కువ

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ సూచీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలను ప్రతిఫలించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి సమాధానంగానా అన్నట్టు.. కేంద్ర ప్రభుత్వం వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ)లో కీలక మార్పులు, చేర్పులు చేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్‌)కు ఇప్పటివరకు 2012 బేస్‌ ఇయర్‌గా ఉండగా దీన్ని 2024కు మార్చింది. గృహ వినియోగ, వ్యయ సర్వే (హెచ్‌సీఈఎస్‌) 2023–24ను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. 

సీపీఐలో కొన్ని వినియోగ వస్తువులను, సేవలను చేరుస్తూ.. అదే సమయంలో కొన్నింటిని తొలగించింది. కొన్నింటి వెయిటేజీ తగ్గిస్తూ.. కొన్నింటికి పెంచింది. కొత్త బేస్‌ సంవత్సరం ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరిలో నిత్యావసర ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.75 శాతానికి ఎగిసింది. 2012 బేస్‌ సంవత్సరం ప్రకారం డిసెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 1.33 శాతమే. 

సీక్వెన్షియల్‌గా (నెలవారీ) పెరగ్గా.. 2025 జనవరిలో ఉన్న 4.26 శాతంతో పోలి్చనప్పుడు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జనవరిలో 2.77 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 2.73 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహారం, మెటల్స్‌ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం ఎగిసేందుకు దారితీసింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ పెరిగినట్టయింది. అయినప్పటికీ ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యం 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది.  

→ కొత్త సిరీస్‌ ప్రకారం దేశంలో అత్యధికంగా 4.92 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడులో అధిక ద్రవ్యోల్బణం కనిపించింది.  
→ జనవరిలో ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 2.13 శాతంగా, హౌసింగ్‌లో 2.05 శాతం చొప్పున నమోదైంది. వ్రస్తాలు, పాదరక్షల విభాగంలో 2.98 శాతంగా ఉంది.  
→ వెల్లుల్లి, ఉల్లి, ఆలుగడ్డలు, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గాయి. 
→ వెండి, బంగారం, వజ్రం, ప్లాటినం ఆభరణాలు, టమాటాలు, కొబ్బరి, కొబ్బరి నూనె ధరలు పెరిగాయి. 
→ కొత్త సిరీస్‌లో వస్తువులు 259 నుంచి 308కి పెరిగాయి. సేవలు సైతం 40 నుంచి 50కు చే రాయి. ధరల ప్రభావం మరింత వాస్తవికంగా ఉండేందుకు ఈ చేరికలు సాయపడనున్నాయి.  
→ సూచీలో ఆహారం, పానీయాలకు ఇప్పటి వరకు 45.86 శాతం వాటా ఉంటే, కొత్త సిరీస్‌లో 36.75 శాతానికి తగ్గింది.  

సీపీఐలో చేరినవి 
→ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు (అద్దెలు, నిర్వహణ వ్యయాలు) 
→ ఆన్‌లైన్‌ మీడియా సర్వీస్‌ ప్రొవైడర్లు/స్ట్రీమింగ్‌ సేవలు 
→ విలువ ఆధారిత పాడి ఉత్పత్తులు 
→ బార్లీ, సంబంధిత ఉత్పత్తులు 
→ పెన్‌ డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ 
→ వ్యాయామ పరికరాలు 
→ అటెండెంట్, బేబీ సిట్టర్‌ (ఇళ్లలో సహాయకులు)

సీపీఐ నుంచి తొలగించినవి 
→ వీసీఆర్‌/వీసీడీ/డీవీడీ ప్లేయర్లు 
→ రేడియో, టేప్‌రికార్డర్‌ 
→ వినియోగించిన వ్రస్తాలు 
→ సీడీ/డీవీడీలు, ఆడియా/వీడియో క్యాసెట్లు 
→ కాయిర్‌/రోప్‌ 
→ హైరింగ్‌ చార్జీలు (బాడుగకు తీసుకున్న వాటికి చెల్లించేవి)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement