breaking news
Obscene image
-
అసభ్య కంటెంట్‌ను తక్షణమే తొలగించాలి
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ సారథ్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ప్రచురితమవ్వడంపై కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చట్ట వ్యతిరేక, అసభ్యకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశించింది. ముఖ్యంగా ఏఐ యాప్ గ్రోక్తో ఇలాంటి కంటెంట్ జనరేట్ చేయడం, ప్రచురించడం వెంటనే ఆపేయడంతోపాటు తీసివేయాల్సిందేనంది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. భారత్‌లో ఎక్స్ ఆపరేషన్స్ భాధ్యతలు చూసే చీఫ్ కంప్లయెన్స్ అధికారికి శుక్రవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ మేరకు నోటీసు పంపింది. అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించడానికి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించడానికి 72 గంటల గడువిస్తున్నట్లు పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2020, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు– 2021లోని నిబంధనలను పాటించడం లేదని తమ పరిశీలనలో తేలిందని అందులో పేర్కొంది. ‘చట్టాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికే రూపొందించిన, ప్రచురించిన మొత్తం కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశిస్తున్నాం. అదేవిధంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారాలను ధ్వంసం చేయరాదని ఈ నెల 2వ తేదీనాటి ఉత్తర్వులో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే ఎక్స్పైన, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించని పక్షంలో లీగల్ ఇమ్యూనిటీ సైతం రద్దవుతుందని పేర్కొంది. యూజర్లు చేసే తప్పులకు కూడా నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎక్స్‌కు తెలిపింది.సోషల్ మీడియాదే బాధ్యతసామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌కు సంబంధిత వేదికలే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇటువంటి కంటెంట్ ప్రసారమయ్యే సామాజిక వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఇటీవల సిఫారసు చేసిందన్నారు. ఏఐ యాప్ గ్రోక్ అసభ్యకర దృశ్యాలను జనరేట్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఈమేరకు స్పందించారు. -
అశ్లీల ఫొటోలు పంపిస్తే..ఇక అంతే
కఠిన చర్యల దిశగా బెంగళూరు పోలీసులు బెంగళూరు : సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో అవహేళనకరంగా పోస్టు. కావేరి కోసం కర్ణాటక ప్రజలు రోడ్డు పైకి వచ్చి నిరసనలకు దిగుతుంటే కర్ణాటక విరుద్ధంగా ట్విట్టర్లో వ్యంగ్య చిత్రాలు. ఇలా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల భావప్రకటన విపరీతస్థాయికి చేరింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, వుయ్‌చాట్ తదితర సామాజిక మాధ్యమాల్లో అశ్లీల సందేశాలు, ఫొటోలు, వ్యక్తిగత ఇతర మతాలపై అనుచిత సందేశాలు అప్లోడ్ చేస్తుండటంతో సమాజ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీంతో ఇటువంటి అనర్థాలకు బ్రేక్ వేయాలని కర్ణాటక పోలీసులు నిర్ణయించుకున్నారు. అశ్లీల, అవహేళన రీతిలో ఫొటోలు, సందేశాలు పోస్ట్ చేసే వ్యక్తులపై గట్టి చర్యల ద్వారా ఇటువంటివి అరికట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత కొద్ది కాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో పాటు ఇతర మతాలపై కూడా నిందాపూర్వకంగా సందేశాలు పోస్ట్ చేస్తున్న ఘటనలు పెచ్చు మీరడంతో సదరు వ్యక్తులపై సుమోటో కేసును నమోదు చేయడానికి పోలీసులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఇటువంటి అనర్థాలకు కారణమవుతున్న సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచిన పోలీసులు అటువంటి çవ్యక్తులను అరెస్ట్ చేయడానికి చర్యలను ముమ్మరం చేశారు. ఇటువంటి ఘటనల్లో బాధితులు స్టేషన్‌కు రాకుండానే కేవలం మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకోనున్నారు. సైబర్‌క్రైమ్‌కు అడ్డుకట్ట వేయడానికి నిర్ణయించుకున్న పోలీసుశాఖ అందుకు తగ్గట్లుగా పోలీసు సిబ్బందికి కూడా సైబర్‌క్రైమ్‌పై అవగాహన కల్పించడానికి చర్యలను ప్రారంభించింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుండి ఎస్పీ కేడర్ అధికారుల వరకు అందరికీ సైబర్‌క్రైమ్‌పై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో ఫేస్బుక్, యూట్యూబ్‌లో అవహేళనకర పోస్టులు చేసే వ్యక్తుల ఖాతాలను భాధితుల ఫిర్యాదులు మేరకు రద్దు చేసే ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసుశాఖలోని ఇతర ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.


