పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం వేడెక్కనుంది. ఈ ఏడాదిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల 17న బెంగాల్‌లో పర్యటించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. అక్కడ మోదీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోంది. గతేడాది జరిగిన ప్రతి ఎన్నికల్లో కాషాయపార్టీ నేరుగానో లేక కూటమి ద్వారానో అధికారం సాధించింది. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం అధికారం కాషాయానికి ఇప్పటికీ అందరి ద్రాక్షగానే ఉంది. గత ఎన్నికల్లో అధికారం సాధిస్తామని చెప్పుకున్నప్పటికీ ఆపార్టీ డబుల్ డిజిట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది జరిగే ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోండగా మరోసారి గెలిచి కాషాయ పార్టీకి ఝలక్ ఇవ్వాలని తృణముల్ కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల పశ్చిమ బెంగాల్‌లోని మాల్గాలో బహిరంగ ర్యాలీలో మోదీ పాల్గొననుట్లు బీజేపీ ప్రకటించింది. జనవరి 17న మాల్దాలో 18న హౌరాలో ర్యాలీలలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. ఈ కార్యక్రమంలో మోదీ హౌరా- గుహవతి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దానితో పాటు మరి కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశంలో పొలిటికల్ హీట్ పెరగనుంది.


