కేరళ మాజీ మంత్రి ఆంటోనీ రాజు ఖతర్నాక్ క్రైమ్ స్టోరీ!
అది 1990వ సంవత్సరం.. తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ సాల్వెటర్ సెర్వెల్లి అనే వ్యక్తి 61.5 గ్రాముల హషీష్ తో పట్టుబడ్డాడు. తన అండర్‌వేర్ లో ప్రత్యేకంగా కుట్టిన రహస్య జేబులో డ్రగ్స్ దాచి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపో యాడు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి.. నిందితుడికి శిక్ష ఖాయమని అంతా భావించారు. కానీ, అక్కడే సినిమా కథకు తీసిపోని మలుపు తిరిగింది.
కోర్టుకే టోకరా..
ఈ కేసులో నిందితుడి తరపున జూనియర్ లాయర్‌గా ఉన్న వ్యక్తి మరెవరో కాదు.. కేరళ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆంటోనీ రాజు. 1991లో హైకోర్టులో అప్పీల్ నడుస్తున్నప్పుడు డిఫెన్స్ లాయర్లు ఒక వింత వాదన తెరపైకి తెచ్చారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న అండర్‌వేర్ నిందితుడిది కాదని వాదించారు. ఆశ్చర్యకరంగా, నిందితుడు కోర్టులోనే ఆ అండర్‌వేర్‌ను వేసుకోవడానికి ప్రయత్నించగా.. అది అతనికి అస్సలు సరిపోలేదు.. అది చాలా చిన్నదిగా ఉంది. దీంతో పోలీసులు తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించారని నమ్మిన కోర్టు, సెర్వెల్లిని నిర్దోషిగా విడుదల చేసింది. ఇంకేముంది.. అతను ఆస్ట్రేలియాకు చెక్కేశాడు.
ఆస్ట్రేలియా జైల్లో లీకైన సీక్రెట్
కేసు ముగిసిపోయిందని అంతా అనుకుంటున్న వేళ.. కొన్నేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఒక హత్య కేసులో సెర్వెల్లి జైలుకు వెళ్లాడు. అక్కడ తోటి ఖైదీ వెస్లీ జాన్‌పాల్‌తో మాట్లాడుతూ.. ‘ఇండియాలో డ్రగ్స్ కేసులో నేను ఎలా తప్పించుకున్నానో తెలుసా? మా కుటుంబం అక్కడి లాయర్లకు లంచం ఇచ్చింది. అసలు అండర్‌వేర్ స్థానంలో చిన్న సైజు అండర్‌వేర్‌ను పెట్టించింది’.. అని మురిసిపో తూ రహస్యం ఊదేశాడు. ఆ ఖైదీ ఈ విష యాన్ని ఆస్ట్రేలియా పోలీసులకు చెప్పడం.. అది ఇంటర్‌పోల్ ద్వారా భారత్‌కు చేరడంతో ఆంటోనీ రాజు పాపం పండింది.
ఫోరెన్సిక్ రిపోర్ట్.. బట్టబయలైన కుట్ర
కేసును పునర్విచారించిన దర్యాప్తు బృందం దిమ్మతిరిగే నిజాలు బయటపెట్టింది. తిరువ నంతపురం కోర్టు క్లర్క్‌ను లాయర్ ఆంటోనీ రాజు బుట్టలో వేసుకున్నారు. సాక్ష్యంగా ఉన్న అండర్‌వేర్‌ను ‘పొరపాటున తీసుకున్నాను’.. అని చెప్పి 4 నెలలు తన వద్దే ఉంచుకున్నారు. ఒక టైలర్ కంటే అద్భుతంగా, మెషీన్ కుట్లు విప్పేసి, చేతి కుట్లు వేసి దాని పరిమాణాన్ని తగ్గించేశారు. కంపెనీ తయారీ లేబుల్‌ను కట్ చేసి మళ్లీ అతికించారు. ఫోరెన్సిక్ నిపుణులు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే తప్ప ఈ తిమ్మినిబమ్మి వ్యవహారం బయటపడలేదు.
పాపం పండింది..
మూడు దశాబ్దాల పాటు ఈ కేసు ఎన్నో మలు పులు తిరిగింది. మధ్యలో ఆంటోనీ రాజు రాజకీయాల్లో ఎదిగారు, మంత్రి అయ్యారు. కానీ సుప్రీంకోర్టు జోక్యంతో విచారణ వేగవంతమైంది. 1990లో కోర్టు వరండాలో రాజు అన్నారట.. ‘మేము ఈ కేసులో ఒక బాంబు పెట్టాం, అది ట్రయల్ అయ్యాక పేలుతుంది’.. అని. సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఆ బాంబు ఆయన పదవినే బలి తీసుకుంది. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఆంటోనీ రాజును దోషిగా తేలుస్తూ కోర్టు జనవరి 3న తీర్పు చెప్పింది. ఆంటోనీ రాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు. ఈ మేరకు జనవరి 5న అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సాక్ష్యాన్ని మార్చడానికి ఒక లాయర్ వేసిన ‘కుట్టు’.. ఆయన రాజకీయ జీవితాన్నే నిలువునా కాటేసింది.


