నిధుల కేటాయింపులో ఆటంకం
జీవీఎంసీ కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై చిన్న చూపు తగదు
21న జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తండి
కార్పొరేటర్లతో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
డాబాగార్డెన్స్: చంద్రబాబు ప్రభుత్వం జీవీఎంసీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూస్తోందని, నిధులు కేటాయించకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రంగా విమర్శించారు. ఈ నెల 21న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం కోసం వ్యూహాన్ని రూపొందించడానికి, బుధవారం ఫ్లోర్ లీడర్ ఛాంబర్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో కేకే రాజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని కేకే రాజు కార్పొరేటర్లకు సూచించారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా, నిధులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరుపై గళమెత్తాలన్నారు. అలాగే, ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర రంగాలకు కేటాయించి దారాదత్తం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై స్పందించాలని కోరారు. వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో స్థానిక ఎమ్మెల్యేల జోక్యం ఎక్కువగా ఉంటూ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ‘ఆపరేషన్ లంగ్స్’ పేరిట వేలాది మంది చిరు వ్యాపారులను రోడ్డు పాల్జేసిన అంశాన్ని ప్రస్తావించి, చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా కౌన్సిల్‌లో చర్చించి, పేదల పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, ఎక్స్ అిఫీషియో సభ్యులు పాల్గొన్నారు.


