న్యాయం చేయకుంటే జీవీఎంసీ ముట్టడి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో నైట్ ఫుడ్ కోర్టును తక్షణమే పునరుద్ధరించి, బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. సెంట్రల్ పార్క్ వద్ద నైట్ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. చిరు వ్యాపారులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. విశాఖకు వచ్చే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు, స్థానిక సంప్రదాయ ఆహార సంస్కృతిని ప్రోత్సహించడంలో నైట్ ఫుడ్ కోర్టు కీలకంగా ఉండేదన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన చిరు వ్యాపారులకు ఇది జీవనాధారంగా మారిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా నైట్ ఫుడ్‌కోర్టును ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారులకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఫుడ్ కోర్టులోని దుకాణాలను తొలగించడం దుర్మార్గమని విమర్శించారు. గత ఆరు నెలలుగా వందలాది మంది సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ స్పందన రాకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామ ని కేకేరాజు హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణికుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గారావు, నా యకులు చెన్నా సునీల్, ఎం.సునీల్, బొండా ఉమామహేశ్వరరావు, పీలా ప్రేమ కిరణ్, దేవరకొండ మార్కండేయులు, గోవింద్, చొల్లింగ్ నాగేశ్వర రావు, రమణ్ రెడ్డి, డోప్ప శ్రీను, మువ్వల సంతోష్, హరికృష్ణ, కొట్యాడ సూర్య, పోలిరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


