ఇరాన్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌ కోసం స్పెషల్‌ బంకర్‌! | Trump comments on ballroom bunker in white house | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌ కోసం స్పెషల్‌ బంకర్‌!

Apr 1 2026 7:59 AM | Updated on Apr 1 2026 9:17 AM

Trump comments on ballroom bunker in white house

వాషింగ్టన్‌: ఇరాన్‌పై భీకర యుద్ధంలో తలమునకలై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత భద్రతను పటిష్టం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో ట్రంప్‌ కోసం ప్రైవేట్‌ నిధులతో నిర్మిస్తున్న బాల్‌రూమ్‌ కింద అత్యంత పటిష్టమైన బంకర్‌ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు.

ఆదివారం రాత్రి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో మీడియాతో మాట్లాడుతూ.. బాల్‌రూమ్‌ కింద భూగర్భంలో ఒక భారీ సముదాయం నిర్మాణ దశలో ఉందని తెలియజేశారు. సాక్షాత్తూ అమెరికా సైన్యమే దీన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త బాల్‌రూమ్‌లో బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్, డ్రోన్‌ నిరోధక డిజైన్‌ వంటి అనేక ఆధునిక భద్రతా సదుపాయాలు ఉంటాయని ట్రంప్‌ చెప్పారు. ఈ గది అంతర్జాతీయ ప్రముఖులకు, నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతోపాటు ప్రధాన కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తుంది. వైట్‌హౌస్‌ అండర్‌గ్రౌండ్‌లో ప్రెసిడెన్షియల్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌(పీఈఓసీ) ఉండేది. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే నిర్మించారు. తరచుగా ఆధునీకరించారు. వైట్‌హౌస్‌ ఈస్ట్‌ వింగ్‌ కూల్చివేత సమయంలో ఈ సెంటర్‌ను తొలగించారని, నూతన, ఆధునిక సదుపాయాలతో మరో సముదాయం నిర్మాణంలో ఉందని ఈ ఏడాది జనవరిలో ఓ వార్తా సంస్థ తెలియజేసింది.  

ఎన్‌సీపీసీ నుంచి అనుమతి లేకుండానే..  
ట్రంప్‌ కొత్త బంకర్‌ గురించి ఎక్కువ విషయాలు బయటపెట్టలేనని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ పేర్కొన్నారు. అయితే, సైన్యం వైట్‌హౌస్‌లో కొన్ని ఆధునీకరణ పనులు చేపడుతోందని వివరించారు. అధ్యక్షుడు ట్రంప్‌ తన అభిరుచులకు అనుగుణంగా బాల్‌రూమ్‌ను కట్టించుకుంటున్నారు. దీనికి ప్రైవేట్‌ సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్‌ పర్యవేక్షణ గానీ, ప్రజా పరిశీలన గానీ లేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు నేషనల్‌ క్యాపిటల్‌ ప్లానింగ్‌ కమిషన్‌(ఎన్‌సీపీసీ) నుంచి అనుమతి లేకుండానే బాల్‌రూమ్‌ బంకర్‌ను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ ‘నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ హిస్టోరిక్‌ ప్రజర్వేషన్‌’ఇటీవల కోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలో విచారణ జరుగనుంది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement