యుద్ధం వేళ ఇజ్రాయెల్‌ ​కొత్త చట్టం.. వారికి మరణశిక్ష | Israel parliament passes death penalty bill targeting Palestinians | Sakshi
Sakshi News home page

యుద్ధం వేళ ఇజ్రాయెల్‌ ​కొత్త చట్టం.. వారికి మరణశిక్ష

Apr 1 2026 7:10 AM | Updated on Apr 1 2026 9:27 AM

Israel parliament passes death penalty bill targeting Palestinians

జెరూసలేం: గాజాలో ఒకవైపు మారణహోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్‌ సర్కార్‌ మరోవైపు పాలస్తీనా పౌరులపై అణచివేత చర్యలను మరింత తీవ్రతరం చేసే దిశగా కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ ప్రజలను హత్యచేస్తే మరణ దండన విధిస్తామని తేల్చిచెప్పింది. హత్య కేసులో దోషిగా తేలితే చావుకు సిద్ధపడాల్సిందేనని వెల్లడించింది.

ఈ మేరకు ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర వేశారు. బిల్లుకు అనుకూలంగా 62, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అంతకముందు బిల్లుపై దాదాపు 12 గంటలపాటు చర్చించారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే పార్లమెంట్‌లో సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్‌ కొత్త చట్టాన్ని అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ చట్టం వివక్షపూరితమైనదని, అమానుషమైనదని స్పష్టంచేశాయి. ఇజ్రాయెలీయులకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడే పాలస్తీనియన్లకు శిక్షలు పెంచాలని అతివాదాలు చాలాఏళ్లుగా డిమాండ్‌ చేశారు. కొందరు ఉద్యమబాట పట్టారు. వారి ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్లు స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పార్లమెంట్‌లో బిల్లుపై ఓటింగ్‌లో స్వయంగా పాల్గొన్నారు.  

ఇజ్రాయెల్‌ జాతీయులకు మినహాయింపు  
కొత్త చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్‌ పౌరుల హత్య కేసులో దోషులుగా తేలిన వెస్ట్‌ బ్యాంక్‌ పాలస్తీనియన్లకు ఉరిశిక్ష అమలు చేస్తారు. అంతేకాకుండా, ఇలాంటి కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన ఇజ్రాయెల్‌ పౌరులకు కూడా మరణశిక్ష విధించే అధికారం ఇజ్రాయెల్‌ కోర్టులకు ఉంటుంది. అయితే, మరణశిక్షను ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా జాతీయులకే పరిమితం చేసి, యూదు జాతీయులకు మినహాయింపు ఇచ్చేలా ఈ చట్టం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కేవలం పాలస్తీనియన్లే శిక్షకు గురవుతారని స్పష్టమవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement