ఆ బస్సుల్లో మాత్రమే లేడీస్‌కు ఫ్రీ జర్నీ | KSRTC free travel for women No income limit | Sakshi
Sakshi News home page

ఆ బస్సుల్లో మాత్రమే లేడీస్‌కు ఫ్రీ జర్నీ

May 20 2026 10:47 AM | Updated on May 20 2026 11:23 AM

KSRTC free travel for women No income limit

తిరువనంతపురం: కేరళలోని మహిళా ప్రయాణికులకు యూడీఎఫ్ ప్రభుత్వం సరికొత్త కానుకను అందించబోతోంది. @ఇందిరా గ్యారెంటీ* పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎటువంటి ఆదాయ పరిమితులు కానీ, ప్రత్యేక కార్డులు కానీ లేకుండానే మహిళలు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ పథకం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) పరిధిలోని అన్ని బస్సులకు వర్తించదు. కేవలం ఎంపిక చేసిన సర్వీసులలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుంది.

పరిమితులు లేవు.. కార్డులు అవసరం లేదు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాధారణ (ఆర్డినరీ) కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ఈ ఉచిత పథకం వర్తిస్తుంది. కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మహిళా లబ్ధిదారుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు లేదా పాస్‌లను ప్రవేశపెట్టగా, కేరళలో ఎలాంటి ప్రత్యేక కార్డులు లేకుండానే ఉచిత ప్రయాణాన్ని అనుమతించనున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమలువుతున్న నమూనానే కేరళ కూడా అనుసరిస్తోంది. అయితే, ఫాస్ట్ ప్యాసింజర్, సూపర్-క్లాస్ వంటి లగ్జరీ బస్సులలో ఈ సదుపాయం ఉండదు.

ఏయే బస్సులకు వర్తిస్తుందంటే?
ప్రస్తుతం కేరళలో సుమారు 4,700 కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు నడుస్తుండగా, అందులో దాదాపు 3,000 ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ఈ 3,000 సాధారణ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇందులో ఉండే సుమారు 300 సిటీ ఫాస్ట్ బస్సులు, 1,400 సూపర్-క్లాస్ బస్సులు, మరో 300 ఫాస్ట్ ప్యాసింజర్ సర్వీసులకు ఈ పథకం నుండి మినహాయింపు ఇచ్చారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా హై-కేటగిరీ డీజిల్ బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం ఆర్థికంగా సాధ్యం కాదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆర్టీసీపై భారీగా ఆర్థిక భారం
ఈ సరికొత్త ఉచిత ప్రయాణ పథకం వల్ల కేరళ ఆర్టీసీపై నెలకు సుమారు రూ.90 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కేఎస్‌ఆర్‌టీసీ జీతాల కోసం నెలకు రూ.50 కోట్లు, పెన్షన్ల కోసం రూ.80 కోట్లు అందిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల మరో రూ.3 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ ఉచిత పథకం కూడా తోడైతే, ప్రభుత్వ ముందస్తు సహాయం నెలకు దాదాపు రూ.220 కోట్లకు పెరగనుంది. అయినప్పటికీ, మహిళలతో పాటు వచ్చే పురుషుల వల్ల టికెట్ ఆదాయం కొంతవరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement