ఇది కదా లక్‌ అంటే : పాత ప్యాంట్‌లో రూ. 57 కోట్ల జాక్‌పాట్‌ | Days Before Expiry US Man Finds Rs 57 Crore Lottery Ticket In Old Pant | Sakshi
Sakshi News home page

ఇది కదా లక్‌ అంటే : పాత ప్యాంట్‌లో రూ. 57 కోట్ల జాక్‌పాట్‌

May 20 2026 10:46 AM | Updated on May 20 2026 11:24 AM

Days Before Expiry US Man Finds Rs 57 Crore Lottery Ticket In Old Pant

మనకు రాసిపెట్టి ఉండాలే గానీ అదృష్టం ఎలాగైనా మన తలుపు తడుతుంది. ఒక అమెరికన్‌ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఒక అమెరికా వ్యక్తి తన పాత ప్యాంట్ జేబులో మర్చిపోయిన లాటరీ టికెట్‌ను జస్ట్‌ దాని గడువు తీరడానికి కొన్నిరోజుల ముందు గుర్తించాడు కట్‌ చేస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా? పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

పీపుల్ మ్యాగజైన్ కథనం ప్రకారం, న్యూజెర్సీకి చెందిన ఆ వ్యక్తి గత ఏడాది మే నెలలో, తాను తరచుగా వెళ్లే ఒక గ్యాస్ స్టేషన్‌ (పెట్రోల్ బంక్)లో పిక్-6 లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే, టిక్కెట్ కొన్న తర్వాత,  దానిని  ఎక్కడ పెట్టాడో  గుర్తులేదు. దాదాపు ఒక  ఏడాది పాటు దాని సంగతే పూర్తిగా మర్చిపోయాడు.  గడువు ముగియ డానికి కొన్ని రోజుల ముందు, 5.9 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57.11 కోట్లు) విలువైన లాటరీ టిక్కెట్‌ను కనుగొన్నాడు. అంతే జాక్‌పాట్ కొట్టాడు.

కథ ఎలా మలుపు తిరిగిందంటే?
గత నెలలో లాటరీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జాక్‌పాట్ గెలుచుకున్న టికెట్ ఇంకా ఎవరూ క్లెయిమ్ చేయలేదని, త్వరలోనే దాని గడువు ముగిసిపోతుంతని వెల్లడించారు. అలాగే ఆ టికెట్ అమ్మిన పెట్రోల్ బంక్ పేరును కూడా పేర్కొన్నారు. దీంతో తాను రెగ్యులర్‌గా వెళ్లే బంక్ పేరు వినడంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి సిబ్బందిని విచారించాడు. ఆ బంక్‌లో 'పిక్-6' గేమ్ ఆడేది కేవలం కొద్దిమంది రెగ్యులర్ కస్టమర్లు మాత్రమేనని సిబ్బంది చెప్పారు.  ఒకసారి బాగా వెతకండి సామీ కోట్ల రూపాయల లాటరీ అంటే  మాటలా? అని  సలహా ఇచ్చారు.

పాత ప్యాంటులో దొరికిన అదృష్టం
ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి తన ఇల్లంతా జల్లెడ పట్టేశాడు. డ్రాయర్లు, అల్మారాలు, స్టోరేజ్ రూమ్‌లు అన్నీ వెతికేశాడు. ఇక చివరగా తన క్లోసెట్ (కబోర్డ్)లో ఉన్న పాత బట్టల్లో వెతకడం మొదలు పెట్టాడు. సరిగ్గా  అపుడే అదృష్ట దేవత పలకరించింది.  ఒక పాత ప్యాంట్ జేబులో నలిగిపోయి ఉన్న లాటరీ టికెట్ అతనికి దొరికింది.

రూ. 57 కోట్లు సొంతం
ఆ టికెట్ నంబర్లను చెక్‌ చేయగానే  రూ. 57 కోట్ల భారీ జాక్‌పాట్ తనదేనని ఎగిరి గంతేశాడు. టికెట్ గడువు ముగియడానికి కేవలం 8 రోజులు మాత్రమే సమయం. క్షణం ఆలస్యం  చేయకుండా వెంటనే  లాటరీ హెడ్‌క్వార్టర్స్‌కు పరుగులు తీసి తన బహుమతిని క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత లాటరీ అధికారులు ప్రజలకు ఒక ముఖ్య సూచన చేశారు. చాలామంది టికెట్లు కొని ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారని, దీంతో ఒక్కోసారి లాటరీ సొమ్మును  ఎవరూ తీసుకోకుండానే ఉండిపోతాయని అందువల్ల పాత టికెట్లను జాగ్రత్తగా దాచుకుంటూ, అప్పుడప్పుడు సరిచూసుకుంటూ ఉండాలని కోరడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement