గ్యాస్‌ కొరత : ఐఐటీ బాంబే అద్భుత ఆవిష్కారం | IIT Bombay Develops Biomass Technology To Cut LPG Use Amid Fuel Crisis, Watch Video Inside | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరత : ఐఐటీ బాంబే అద్భుత ఆవిష్కారం

Mar 31 2026 5:55 PM | Updated on Mar 31 2026 6:44 PM

IIT Bombay technology to combat the rising prices shortages of LPG

ఇరాన్‌ వార్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా  చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశంలో కూడా పెట్రోల్‌, డీజిల్‌,ఎల్‌పీజీ సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. పెరుగుతున్న గ్యాస్ ధరలు,ఎల్‌పిజి (LPG) కొరత ఉన్న నేపధ్యంలో ఐఐటీ బాంబే తన క్యాంపస్‌లోని వంటశాలలను ఎల్‌పిజి కొరత నుంచి బయటపడేలా, ఒక వినూత్న మార్గాన్ని కనుగొంది. 


దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే హామీ ఇస్తున్నప్పటికీ  పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కనిపిస్తోంది. ముంబైలోని 20శాతం హోటళ్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో వీరి ఆవిష్కారం ప్రాధాన్యతను సంతరించుకుంది.  కెమికల్‌ ఇంజనీరింగ్ విభాగంలోని ప్రొఫెసర్ సంజయ్ మహాజని నేతృత్వంలో 2014లో ఈ పరిశోధన ప్రారంభమైంది. క్యాంపస్‌లో కుప్పలుగా పేరుకుపోయే ఎండుటాకులను తొలగించడం, పారవేయడం లాంటివి సవాలుగా మారడంతో వారిలో కొత్త ఆలోచన  మెదిలింది.  దీన్ని శక్తిగా మార్చే ఆలోచన చేశారు.

ఐఐటీ బాంబే 'బయోమాస్ గ్యాసిఫికేషన్'

దశాబ్ద కాలం సుదీర్ఘ పరిశోధన తర్వాత, ఎండుటాకులను సమర్థవంతమైన వంట ఇంధనంగా మార్చే 'బయోమాస్ గ్యాసిఫికేషన్' (Biomass Gasification) సాంకేతికతను వారు రూపొందించారు. ఈ ప్రయోగాల్లో అనేక సవాళ్లు తప్పలేదు వీరికి. మొదట్లో పొగ రావడం, 'క్లింకర్స్' (వ్యర్థాలు పేరుకుపోయి వ్యవస్థ ఆగిపోవడం) వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ 2016 నాటికి ఈ సమస్యలను అధిగమించి పేటెంట్ పొందారు. 2017లో ఎనర్జీ సైన్స్ విభాగం నుండి ప్రొఫెసర్ సందీప్ కుమార్ చేరడంతో బర్నర్ డిజైన్ మరింత మెరుగుపడింది. 2024 నాటికి ఈ వ్యవస్థను స్టాఫ్ క్యాంటీన్‌లో విజయవంతంగా ఏర్పాటు చేశారు.

లాభాలు 
ప్రస్తుతం క్యాంటీన్లలో 30శాతం నుండి 40శాతం వరకు ఎల్‌పిజి వాడకం తగ్గింది. హాస్టల్ మెస్సుల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి రూ.50 లక్షల వరకు ఆదా చేయవచ్చని అంచనా. అంతేకాదు ఇది పర్యావరణ హితం కూడా. ఏటా దాదాపు 8 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఇది తగ్గిస్తుంది. ఈ వ్యవస్థ 60శాతం  థర్మల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.

మరింత విస్తరణ
కేవలం క్యాంపస్‌లకే పరిమితం కాకుండా, పరిశ్రమలు మరియు భారీ వంటశాలలలో కూడా ఈ సాంకేతికతను వాడేలా విస్తరించాలని ఐఐటీ బృందం భావిస్తోంది. అంతేకాకుండా, 2019 నుండి ఐఐటీ బాంబే ప్రతిరోజూ 2 టన్నుల తడి వ్యర్థాలను శక్తిగా మార్చే 'బయోమెథనేషన్' ప్లాంట్‌ను కూడా నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య

ప్రొఫెసర్ సంజయ్ మహాజని ఏమంటారంటే..
తన పరిశోధన గ్యాసిఫికేషన్ , శక్తి మార్పిడిపై కేంద్రీకృతమై ఉందని, ఈనేపథ్యంలోనే  క్యాంపస్‌లోని ఈ వ్యర్థ పదార్థంలోనే సహజంగానే శక్తి ఉన్నప్పుడు, దానిని మన అంతర్గత అవసరాల కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదని ఆలోచించామనీ  ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ సంజయ్ మహాజని చెప్పారు. ఈ వ్యర్థాలను  దహనం చేసినప్పుడు, అది ముఖ్యంగా పార్టిక్యులేట్ మ్యాటర్ రూపంలో గణనీయమైన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని గణనీయంగా తగ్గించే విధంగా తాము గ్యాసిఫైయర్ డిజైన్‌ను రూపొందించామన్నారు.ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువును 'ప్రొడ్యూసర్ గ్యాస్' అంటారు. ఇలా ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్ , హైడ్రోజన్‌లను వెంటనే దహనం చేస్తేఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి.  ఈ వాయువును దహనం చేసినప్పుడు, విడుదలయ్యే శక్తి ద్వారా  ఆవిరి ఉత్పత్తి అవుతుంది. దీన్ని ప్రాథమికంగా,  నీటిని ఆవిరిగా మారుస్తాం, ఇది ఆహార తయారీకి ఉపయోగించే ఆవిరి ఆధారిత వంట పరికరాలను,ఇతర ఉపకరణాలను నడపడానికి శక్తినిస్తుందని వివరించారు.  

ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement