అర్ధశతాబ్దం తర్వాత జాబిలి దిశగా.. | NASA Artemis 2 Launch Mission Countdown Begins | Sakshi
Sakshi News home page

అర్ధశతాబ్దం తర్వాత జాబిలి దిశగా..

Apr 1 2026 6:16 AM | Updated on Apr 1 2026 6:16 AM

NASA Artemis 2 Launch Mission Countdown Begins

కెనెడీ స్పేస్‌ సెంటర్లో ఆర్టెమిస్‌–2 రాకెట్‌ వద్ద వ్యోమగాములు (ఎడమ నుంచి) రీడ్‌ వైజ్‌మన్, విక్టర్‌ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెస్‌

నేడే నాసా ఆర్టిమిస్‌2 ప్రయోగం

చందమామను చుట్టేసేందుకు

సిద్ధమైన నలుగురు వ్యోమగాములు

కేవ్‌ కనావరల్‌(ఫ్లోరిడా): అంతరిక్ష యాత్రలకు జాబిలిని మజిలీగా మార్చుకునే లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీమిస్‌–2 ప్రయోగం నేడు ఫ్లోరిడాలోని కేప్‌ కనావరల్‌లోని ‘కెన్నడీ అంతరిక్ష కేంద్రం’వేదికగా జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.24 గంటలకు(భారతకాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 3.54 గంటలకు) నలుగురు వ్యోమగాములతో 32 అంతస్తుల ఎత్తయిన ‘స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ రాకెట్‌’నింగిలోకి దూసుకుపోనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ సోమవారమే ప్రారంభించారు. దాదాపు 53 ఏళ్ల తర్వాత చందమామ సంబంధ ప్రాజెక్ట్‌కు నాసా శ్రీకారంచుట్టి శరవేగంగా ఆచరణలో పెట్టింది.

అంతా సవ్యంగా సాగితే అమెరికా, కెనడా వ్యోమగాములు రెయిడ్‌ వైస్‌మ్యాన్‌(కమాండర్‌), విక్టర్‌ గ్లోవర్‌(పైలట్‌), క్రిస్టినా కూచ్‌(మహిళా మిషన్‌ స్పెషలిస్ట్‌), జెరిమీ హాన్సెన్‌లు చందమామ సమీప కక్ష్యలోకి వెళ్లి వస్తారు. నింగిలోకి దూసుకెళ్లాక తొలిరోజు వీళ్లు భూకక్ష్యలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలెడతారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్‌ పసిఫిక్‌ మహాసముద్రజలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్‌ ఉండబోదు.

కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరిశీలించి తిరిగొస్తారు. ఆర్టీమిస్‌2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్‌ సంస్థ తయారుచేసిన ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్‌లో పయనించనున్నారు. ఇది వ్యోమగాములు తిరుగుప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచి్చనా వాళ్లకు ఎలాంటి హాని కల్గకుండా రక్షణనిస్తుంది. వాస్తవానికి ఆర్టిమిస్‌–2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్‌ నుంచి హైడ్రోజన్‌ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదాపడింది. తర్వాత సమస్యను పరిష్కరించినా హీలియం పీడనవ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదాపడింది. ఎట్టకేలకు బుధవారం ప్రయోగంచేపట్టేందుకు రంగంసిద్ధమైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement