సమ్మర్ అనగానే అందరికి గుర్తొచ్చేది పుచ్చకాయ. వేసవి దాహార్తిని చల్లార్చేది పుచ్చకాయ ఒక్కటే. అది తినగానే తక్షణ శక్తి, దాహం తీరుతుంది కూడా. అలాంచి పుచ్చకాయను తినేముందు చిటికెడు ఉప్పు ఎందుకు జల్లుతారో తెలుసా!. అలా తింటేనే మంచిదా అంటే..
సాధారణంగా చాలామంది పుచ్చకాయను అలానే తినేస్తారు. కొందరు మాత్రం తప్పనిసరిగా చిటికెడు ఉప్పు జల్లుకునే తింటుంటారు. ఇలా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!.
సహజమైన తీపి..
చిటికెడు ఉప్పు పుచ్చకాయ రుచిని మరింత తీపిగా చేస్తుంది. రుచి గ్రాహకాలు రుచిని గ్రహించే విధానాన్ని ఉప్పు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇలా మరింత తీపిగా అనిపిస్తుందట. అలాగే ఉప్పులో ఉండే క్లోరైడ్ అయాన్లు తీపి రుచి గ్రాహకాలతో చర్య జరిపి తక్కువ గాఢతలో తీపిని గ్రహించే శక్తినిపెంచి, చేదుని తగ్గిస్తాయి. అంటే ఉప్పు పండులోని సహజ చక్కెరలను ఉత్తేజపరిచి వాటి ప్రభావాన్ని పెంచుతుంది, మరింత రుచికరంగా ఉంటుంది కూడా.
కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. .
పుచకాయలో సహజంగా నీటి శాతం ఎక్కువ. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. చిటికెడు ఉప్పు కలపడంతో శరీరానికి తగిని సోడియం అంది, ద్రవాలను నిలుపుకోవడానికి హైడ్రేషన్‌కు హెల్ప్ అవుతుంది. ఇది ప్లాస్మా పరిమాణాన్ని నిర్వహించడంలో అలాగే శరీరం తీసుకున్న నీటిని త్వరగా బయటకు పంపకుండా నిలుపుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వేడికి గురైన వెంటనే లేదా అధిక శ్రమ తర్వాత నీరు, సోడియం కలియిక నీరు రీహైడ్రేషన్‌కి ప్రభావవంతంగా ఉంటుందట.
రుచి సమతుల్యతను మెరుగుపరుస్తుంది
కొన్నిసార్లు పుచ్చకాయ రుచి చప్పగా లేదా మరీ నీళ్ళగా అనిపించవచ్చు. చిటికెడు ఉప్పు రుచిని సమతుల్యం చేయడం తోపాటు ప్రతి ముక్కను మరింత రుచికరంగా మారుస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది..
తక్కువ పరిమాణంలో జీర్ణరసాలను ప్రేరేపించడంలో ఉప్పు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సాధారణంగా పుచ్చకాయ చాలా సులభంగా జీర్ణమవుతుంది, ఈ చిన్న చేర్పు మొత్తం తినే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా భోజనం తర్వాత లేదా స్నాక్‌గా తీసుకున్నప్పుడు.
శ్రద్ధగా తినేలా చేస్తుంది..
పుచ్చకాయకు ఉప్పు కలపడం వల్ల తినే వేగాన్ని తగ్గిస్తుంది. ఒక గిన్నెను త్వరగా పూర్తి చేయడానికి బదులుగా, ప్రతి ముక్కను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతారు. ఇది పరిమాణ నియంత్రణకు సహాయపడటం తోపాటు సంతృప్తికరంగా అనిపించేలా చేస్తుంది.
కాబట్టి, పుచ్చకాయకు చిటికెడు ఉప్పు కలపడం వల్ల పండు పోషక విలువలు పెద్దగా మారవు, కానీ అది తినే అనుభవాన్ని ఆనందదాయకంగా, సమతుల్యంగా చేస్తుంది. ఇక్కడ చిటికెడు ఉప్పు చాలు. ఎక్కువైతే పండు సహజ రుచిని డామినేట్ చేసి, సోడియం తీసుకోవడం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైతే అదనపు రుచి కోసం నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపునులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..!)


