HYD: భారీగా హైడ్రా కూల్చివేతలు | HYDRA Demolish Illegal Constructions At Rangareddy | Sakshi
Sakshi News home page

HYD: భారీగా హైడ్రా కూల్చివేతలు

Apr 1 2026 7:39 AM | Updated on Apr 1 2026 9:20 AM

HYDRA Demolish Illegal Constructions At Rangareddy

సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజాము నుంచే మైలార్‌దేవుపల్లి సర్కిల్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలుస్తోంది.

వివరాల మేరకు.. మైలార్‌దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి.  ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. దీంతో, బుధవారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్‌ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలిసింది.

అంతకుముందు మంగళవారం కూడా హైడ్రా ఆక్రమణల కూల్చివేత చేపట్టింది. మంచిరేవుల గ్రామంలోని నాగిరెడ్డికుంటలో 7 ఎకరాల స్థలాన్ని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కబ్జాలో ఉంచుకున్నట్లు తేలింది. సర్వే చేయగా.. సదరు సంస్థ కబ్జాచేయగా మిగిలిన భూమిని, స్థానిక నేత విక్రయించినట్లు స్పష్టమైంది. ఆ మేరకు మొత్తం ఆక్రమణలను నేలమట్టం చేశామని హైడ్రా వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.934 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, బౌరంపేట్‌లోని గండిమైసమ్మ-మియాపూర్‌ రహదారికి ఇరువైపులా ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన రేకుల షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. ఘట్కేసర్‌ వద్దనున్న అవుషాపూర్‌లో.. ఇళ్ల స్థలాలుగా మారిన 1,440 గజాల పార్కు భూమికి, జూబ్లిహిల్స్‌లో ఆక్రమణకు గురైన 300గజాల వరద నాలాకు హైడ్రా విముక్తి కల్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement