పింక్‌ ఏనుగు ఫోటోషూట్‌, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్‌ | Pink Elephant In Russian Artist Jaipur Photoshoot Died A Month Ago, Triggers Animal Cruelty Debate | Sakshi
Sakshi News home page

పింక్‌ ఏనుగు ఫోటోషూట్‌, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్‌

Mar 31 2026 1:16 PM | Updated on Mar 31 2026 1:49 PM

Pink Elephant In Russian Artist Jaipur Photoshoot Died A Month Ago

రాజస్థాన్‌లోని  జైపూర్‌లో రష్యన్ ఫొటోగ్రాఫర్ జూలియా బురులేవా ఒక ఏనుగుకు ముదురు గులాబీ రంగు (Pink) వేసి చేసిన ఫొటోషూట్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోషూట్‌లో పాల్గొన్న 70 ఏళ్ల చంచల్ అనే ఏనుగు గత నెలలో మరణించింది. అయితే, ఆమె మరణానికి ఈ షూట్‌కు ఎలాంటి సంబంధం లేదని, వయసు పైబడటం వల్ల సహజ కారణాలతోనే చనిపోయిందని అధికారులు ధృవీకరించారు. అయినప్పటికీ నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఏమి జరిగింది?
గత ఏడాది నవంబరులో  రాజస్థాన్‌లోని  జైపూర్‌లోని ఒక పురాతన గణేశుడి ఆలయం వద్ద ఈ షూట్ జరిగింది. 'పింక్ సిటీ' జైపూర్ నేపథ్యం నుండి ప్రేరణ పొంది, మోడల్ యశస్వి, చంచల్ అనే ఏనుగుకు ఒకే రకమైన గులాబీ రంగు వేసి ఫొటోలు తీశారు. బార్సిలోనాకు చెందిన ప్రఖ్యాత కాన్సెప్టువల్ ఫోటోగ్రాఫర్ జూలియా బురులేవా, సంస్కృతిని ప్రతిబింబించేలా  ఈ ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక ఏనుగుకు తల నుండి తోక వరకు పూర్తిగా గులాబీ రంగు పూయడం వివాదాస్పదమైంది.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. 

 

కొంతమంది ఈ షూట్ సౌందర్య ఆకర్షణను  సృజనాత్మకతను ప్రశంసించగా, చాలా ఎక్కువ మంది ఏనుగు పట్ల వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాజెక్టులలో జంతువులను ఉపయోగించడం యొక్క నైతికతను ప్రశ్నించారు. ఇది కచ్చితమైన  జంతు హింసే.. ఇలా లైక్స్ కోసం మూగజీవాలను  కెమికల్‌ రంగులతో ముంచెత్తడం ఆర్ట్‌ అనిపించుకోదు అంటూ పలువురు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఫోటోగ్రాఫర్‌ వాదన

ఏనుగు యజమాని , హతి గావ్ కమిటీ అధ్యక్షుడు బల్లు ఖాన్ , ఫొటోగ్రాఫర్ వాదన ప్రకారం, హోలీ పండుగలో వాడే ఆర్గానిక్ గులాల్ (Gulal) పొడిని మాత్రమే వాడారు. అంతేకాదు రంగును కేవలం 10-30 నిమిషాలు మాత్రమే ఉంచి, వెంటనే కడిగేసినట్లు వారు తెలిపారు.

ఏనుగు మృతితో  మరింత ఆందోళన 
సుమారు 70 ఏళ్ల వయసున్న చంచల్ గత నెలలో మరణించినట్లు  బల్లుఖాన్‌ ధృవీకరించారు. ఏనుగు మరణానికి ఫోటోషూట్‌తో గానీ, దాని చుట్టూ ఉన్న వివాదంతో గానీ సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.దాని మరణం సహజ కారణాల వల్ల సంభవించిందని అధికారులు, స్థానిక సంరక్షకులు స్పష్టం చేశారు.

స్పందించిన అటవీ అధికారులు
అయినప్పటికీ, ఈ వీడియో వైరల్ అవ్వడంతో,కళాత్మక సృజన పేరుతో మూగజీవాలను ఇలా రంగులతో హింసించడం సరికాదని నెటిజన్లు విమర్శల నేపథ్యంలో రాజస్థాన్ అటవీ శాఖ స్పందించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ఉల్లంఘన జరిగిందో లేదో తేల్చనున్నారు.

వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు ఉల్లంఘించారా అనే విషయంపై దర్యాప్తు చేస్తామని రాజస్థాన్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. నిర్లక్ష్యం లేదా వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల ఉల్లంఘన ఏదైనా కనుగొనబడితే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement