యుద్ధానికి త్వరలో తెర! | Donald Trump criticises Nato allies again over Iran | Sakshi
Sakshi News home page

యుద్ధానికి త్వరలో తెర!

Apr 1 2026 3:41 AM | Updated on Apr 1 2026 5:26 AM

Donald Trump criticises Nato allies again over Iran

సన్నిహితులతో ట్రంప్‌ వ్యాఖ్యలు?

హార్మూజ్‌ నుంచి చమురు తెచ్చుకోండి

నాటో దేశాలపై అధ్యక్షుని ఆగ్రహం 

వాషింగ్టన్‌: ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది.

‘‘యుద్ధాన్ని నాలుగు నుంచి ఆరు వారాలు మాత్రమే సాగించాలని ముందే నిర్ణయించుకున్నాం. హర్మూజ్‌ కోసం పట్టుబడితే పోరు మరిన్ని రోజులు కొనసాగేలా ఉంది. కనుక మన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్‌ నావికా దళాన్ని, దాని క్షిపణి నిల్వలను పూర్తిగా నేలమట్టం చేసి యుద్ధానికి త్వరగా తెర దించేస్తా’’ అని ట్రంప్‌ చెప్పుకొచి్చనట్టు పేర్కొంది. మరోవైపు సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్‌ వంటి గల్ఫ్‌ దేశాలు మాత్రం ఇరాన్‌ పూర్తిగా ఓడేదాకా యుద్ధాన్ని కొనసాగించాల్సిందిగా అమెరికాను కోరుతున్నట్టు అసోసియేటెడ్‌ ప్రెస్‌ పేర్కొంది! 

నాటో దేశాలపై గుర్రు 
ఇరాన్‌పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్‌ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి. మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్‌ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్‌ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement