ఇస్ఫహాన్‌ అణు కేంద్రంపై బాంబుల వర్షం! | US-Israel launch major attacks as Iranian authorities maintain defiance | Sakshi
Sakshi News home page

ఇస్ఫహాన్‌ అణు కేంద్రంపై బాంబుల వర్షం!

Apr 1 2026 3:35 AM | Updated on Apr 1 2026 3:35 AM

US-Israel launch major attacks as Iranian authorities maintain defiance

అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబుల దాడితో ఇస్ఫహాన్‌ అణుకేంద్రం వద్ద భారీగా చెలరేగిన మంటలు

‘బంకర్‌ బస్టర్లు’ ప్రయోగించిన అమెరికా

అణుకేంద్రం వద్ద భారీగా మంటలు 

పేలుళ్లతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్‌ 

ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు 

కువైట్‌ చమురు నౌకలో భారీగా మంటలు 

దుబాయ్‌లో ఇద్దరు భారతీయులకు గాయాలు 

ఇక అమెరికా టెక్‌ దిగ్గజాలే లక్ష్యం: ఐఆర్‌సీజీ 

నేటి నుంచి వాటిపై పెద్ద ఎత్తున దాడులు! 

జాబితాలో గూగుల్, యాపిల్‌ సహా 18 సంస్థలు

దుబాయ్‌: పశ్చిమాసియాలో పరిస్థితి మరింత విషమిస్తోంది. చర్చలకు ససేమిరా అంటున్న ఇరాన్‌పై అమెరికా కన్నెర్రజేసింది. స్వీయ కాల్పుల విరమణను తుంగలో తొక్కుతూ మంగళవారం ఆ దేశంపై భారీ స్థాయి దాడులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్‌ నగరంలోని కీలక అణు కేంద్రాలపై బంకర్‌ బస్టర్‌ బాంబులతో దాడి చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం విశేషం. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఆ కేంద్రంలోనే ఇరాన్‌ దాచి ఉంచినట్టు చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తాజా దాడిలో అక్కడి అణుకేంద్రానికి నష్టం జరిగిందా అన్నది తెలియరాలేదు.

త్వరగా ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌లోని మౌలిక వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ట్రంప్‌ సోమవారమే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము వేళ ఇజ్రాయెల్‌తో కలిసి టెహ్రాన్‌పైనా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో ఇరాన్‌ రాజధాని దద్దరిల్లిపోయింది. నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయి. లెబనాన్‌పైనా ఇజ్రాయెల్‌ భారీగా దాడులను కొనసాగించింది. వాటిలో ఐరాస శాంతి పరిరక్షక దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది మరణించినట్టు సమాచారం. మొత్తమ్మీద మంగళవారం ఒక్క రోజే 21 మంది మృతి చెందినట్టు లెబనాన్‌ పేర్కొంది.

మొత్తం మృతుల సంఖ్య 1,268 దాటినట్టు వెల్లడించింది. ఉత్తర గాజాలో కూడా ఇజ్రాయెల్‌ దాడుల్లో ఒక వ్యక్తి, అతని ఐదేళ్ల కుమారుడు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్‌ నిస్సిగ్గుగా తమ మౌలిక వ్యవస్థలను లక్ష్యం చేసుకుంటున్నాయంటూ ఇరాన్‌ మండిపడింది. దీనికి తమ సమాధానం భయానకంగా ఉంటుందని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ హెచ్చరించారు. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజ కంపెనీలపై కూడా బుధవారం నుంచి భారీగా దాడులు చేస్తామని రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్‌తో పాటు 18 సంస్థల పేర్లను వెల్లడించింది! తక్షణం కార్యాలయాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆ కంపెనీల సిబ్బందికి సూచించింది. 

మండుతున్న చమురు ధరలు
యుద్ధం దెబ్బకు అంతర్జాతీయంగా చమురు ధరలు నానాటికీ ఎగబాకుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ చమురు ధర 107 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా యుద్ధానికి తెర తీసినప్పటితో పోలిస్తే ఇది ఏకంగా 45 శాతం ఎక్కువ కావడం విశేషం! మరోవైపు అమెరికాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు కూడా పెరిగాయి! మంగళవారం గ్యాలన్‌ (దాదాపు 3.8 లీటర్ల) పెట్రోల్‌ ధర 4.02 డాలర్లకు చేరింది. 2022 తర్వాత అమెరికాలో పెట్రోల్‌ ధర 4 డాలర్లను దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం! ఫిబ్రవరి 28న ఇరాన్‌ యుద్ధం మొదలయ్యే నాటికి అమెరికాలో గ్యాలర్‌ పెట్రోల్‌ ధర 2.98 డాలర్లుగా ఉంది. డీజిల్‌ ధర కూడా గ్యాలన్‌కు 3.75 డాలర్ల నుంచి 5.45 డాలర్లకు పెరిగింది.  

ఇజ్రాయెల్‌లో సైరన్‌ మోతలు 
ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో దుబాయ్‌ సమీపంలో కువైట్‌కు చెందిన ఓ చమురు నౌకపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో నౌకలో మంటలు చెలరేగాయి. సిబ్బంది చాలాసేపు శ్రమించి వాటిని ఆర్పేశారు. ఐదు క్షిపణులు, ఏడు డ్రోన్లను కూల్చేసినట్టు కువైట్‌ పేర్కొంది. దుబాయ్‌లోని అల్‌ బదాలో ఓ ఆవాస ప్రాంతంపై జరిగిన డ్రోన్‌ దాడిలో శకలాలు పడి ఇద్దరు భారతీయులతో పాటు నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ తదితర గల్ఫ్‌ దేశాలు కూడా దాడుల బారిన పడ్డాయి. ఆ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌ నగరాల్లో కూడా రోజంతా సైరన్‌ మోతలు విన్పించాయి. ఇరాక్‌లోని సులేమానియా యూనివర్సిటీపై ఇరాన్‌ డ్రోన్లతో దాడి చేసింది.

హార్మూజ్‌ సుంకం ఖరారు
హార్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి వసూలు చేయాల్సిన సుంకాన్ని ఇరాన్‌ లాంఛనంగా ఖరారు చేసింది. ఒక్కో నౌక నుంచి గరిష్టంగా రూ.19 కోట్ల దాకా వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ దేశ పార్లమెంటు భద్రతా మండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. హార్మూజ్‌పై ఇరాన్‌ సార్వ¿ౌమాధికారానికి నిదర్శనంగా ఈ చర్య తీసుకున్నట్టు ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఐబీ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలకు హార్మూజ్‌ గుండా వెళ్లనివ్వబోమని పేర్కొంది.

ఇటలీ సైతం... గగనతలం మూత
స్పెయిన్‌ బాటలోనే ఇటలీ కూడా అమెరికాకు షాకిచ్చింది. ఇరాన్‌పై పోరులో అమెరికా వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తన గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. సిసిలీలోని తమ వైమానిక స్థావరాన్ని అమెరికా వాడుకునేందుకు కూడా అనుమతి నిరాకరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సోమవారం స్పెయిన్‌ కూడా ఈ మేరకు ప్రకటన చేయడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement