పశ్చిమలో
రాజ్యం
అక్కడ చట్టం చుట్టమైపోయింది.. నిబంధనలు
నీరుగారిపోయాయి. అక్కడ వినిపించేది ప్రజా
ప్రతినిధి గొంతు కాదు.. ఆయన వెనకాల ఉండే
‘షాడో’ ఎమ్మెల్యేల హుకుం. ఐదుగురు పీఏలు..
ఐదు విభాగాలు.. వెరసి విశాఖ పశ్చిమ నియోజక
వర్గం అక్రమ వసూళ్ల అడ్డాగా మారిపోయింది.
సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ కంటే
ముందు పీఏల ‘పర్మిషన్’ ఉండాల్సిందే. గెడ్డల
ఆక్రమణలకు పచ్చజెండా ఊపే ఈ ‘కలెక్షన్ కిం
గ్స్’.. పేదవాడి సెట్‌బ్యాక్ దగ్గర మాత్రం సింహాల్లా
గర్జిస్తున్నారు. అంతస్తుకో రేటు.. సంతకానికో
నోటు.. ఇదీ ప్రస్తుతం విశాఖ పశ్చిమలో సాగు
తున్న నగ్న సత్యం. అధికారులను పావులుగా
వాడుకుంటూ, నిబంధనలను అస్త్రంగా చేసుకుని సాగుతున్న ఈ ‘వసూళ్ల పర్వం’పై గ్రౌండ్ రిపోర్ట్.
విశాఖ సిటీ: ఆ నియోజకవర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్.. ఇలా ఒక్కో విభాగాన్ని ఒక్కొక్కరుగా పంచేసుకున్నారు. ఆయా విభాగాల్లో ఎవరికి ఎటువంటి పనులు జరగాలన్నా ముందుగా వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. బదిలీల నుంచి పోస్టింగ్‌ల వరకు.. అన్నింటికీ మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. ఇక నియోజకవర్గంలో చిన్న ఇంటి నుంచి భారీ భవనాల నిర్మాణం వరకు వీరి కనుసన్నల్లో జరగాల్సిందే. వారికి ముందుగా తాంబూలం సమర్పించాల్సిందే. లేదంటే నిబంధనల పేరుతో నోటీసులు.. వెనువెంటనే కూల్చివేతలు జరిగిపోతాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యే పేరుతో పీఏలు వసూళ్ల పర్వానికి తెరపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో విభాగంలో ఒక్కొక్కరు పెత్తనం చెలాయిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పీఏల పేరుతో ఐదుగురు షాడో ఎమ్మెల్యేలుగా చలామని అవుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఏ చిన్న పని కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినా ముందుగా వీరిని సంతృప్తి పరచాల్సిందే అన్నది బహిరంగ రహస్యం. చివరకు ఒక సామాన్యుడు తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలన్నా సదరు పీఏల ‘కృపాకటాక్షాలు’ ఉండాల్సిందేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పేరుతో చలామణి అవుతున్న ఈ ‘షాడో’ ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుని అక్రమ వసూళ్లకు తెరలేపారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతస్తుకో రేటు.. అక్రమాలకు పచ్చజెండా
నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అయితే ఇవి కేవలం పీఏల సిఫార్సు ఉంటేనే సాధ్యమవుతున్నాయి. బీపీఎస్ నిబంధనలను తుంగలో తొక్కి, అదనపు అంతస్తులు వేసుకోవడానికి పీఏ వర్గం ఒక ‘రేట్ కార్డు’నే సిద్ధం చేసింది. ఒక్కో అంతస్తుకు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇస్తే అక్రమ నిర్మాణం సక్రమమైపోతుంటే.. ఇవ్వలేని వారి నిర్మాణాలకు మాత్రం నిబంధనల పేరుతో నోటీసులు, వెనువెంటనే కూల్చివేతలు జరిగిపోతుండడం నిత్యకృత్యమైంది. జీవీఎంసీ పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో గెడ్డల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు.. చిన్న చిన్న ఇళ్ల నిర్మాణాలకు సెట్‌బ్యాక్‌ల పేరుతో బెదిరింపులకు దిగుతుండడంపై స్థానికులు మండిపడుతున్నారు.
నిబంధనల అస్త్రం.. నోటీసుల పర్వం
ఎవరైనా ఇల్లు కడుతున్నారని తెలియగానే, సచివాలయ ఉద్యోగులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ప్లాన్‌లో ఏ చిన్నపాటి తేడా ఉన్నా వెంటనే కొలతలు వేసి నోటీసులు జారీ చేస్తున్నారు. చిన్న చిన్న నిర్మాణాల విషయంలోను నిబంధనల పేరుతో వేధింపులకు గురి చేస్తుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘మాకేం సంబంధం లేదు, ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫిర్యాదు వచ్చింది.. వెళ్లి అక్కడ మాట్లాడుకోండి‘ అంటూ ఉచిత సలహాలు ఇస్తుండటం గమనార్హం. వసూళ్ల దందా కోసం అధికారులను సైతం పావులుగా వాడుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్యే పీఏల వసూళ్ల పర్వం? ఒక్కో విభాగానికి ఒక్కో పీఏ సామాన్యుడి సొంతింటి కలపై ‘పీఏ’ల ఉచ్చు నిబంధనల పేరుతో బెదిరింపులు రూ.లక్షల్లో వసూళ్లు.. మాట వినకపోతే కూల్చివేతలు అధికారులను పావులుగా వాడుకుంటూ దర్జాగా అక్రమ దందా
అధికారుల పోస్టింగ్‌లోనూ హస్తం
కేవలం నిర్మాణ రంగమే కాకుండా, నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో కూడా పీఏల జోక్యం మితిమీరిపోయినట్లు తెలుస్తోంది. బదిలీ, పోస్టింగ్, శాఖ, విభాగాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేసి సిఫార్సు లేఖలు తయారు చేసే బాధ్యతలు తీసుకుంటున్నారన్న టాక్ ఉంది. ఉన్నతాధికారులకు సైతం ఫోన్లు చేస్తూ.. వారి పనులు చేయాలంటూ హుకుం జారీ చేస్తూ షాడో ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారన్న వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.


