మంచి మనసు.. విలువలకు చిరునామా | - | Sakshi
Sakshi News home page

మంచి మనసు.. విలువలకు చిరునామా

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

మహారాణిపేట: తన మృదు స్వభావంతో, అద్భుతమైన పనితీరుతో జిల్లా ప్రజల మనసు గెలుచుకున్న కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ విలువలకి, సేవా భావానికి చిరునామా అని అధికారులు కొనియాడారు. జిల్లా కలెక్టర్‌గా దాదాపు 20 నెలల పాటు సేవలందించి, బదిలీపై వెళ్తున్న ఆయనకు మంగళవారం నగరంలోని ఒక హోటల్‌లో అధికారులు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. కలెక్టర్‌ దంపతులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు.

విశాఖతో మరిచిపోలేని బంధం: ఈ సందర్భంగా కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘విశాఖ జిల్లాలో పని చేసిన ఈ 20 నెలల కాలం నా జీవితంలో మరిచిపోలేనిది. ఇక్కడి ప్రజలతో, అధికారులతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. భయపెట్టి పని చేయించడం నా నైజం కాదు.. అందరి మద్దతు, సహకారంతోనే లక్ష్యాలను సాధించవచ్చని నేను నమ్ముతాను. జిల్లాలో చేపట్టిన ప్రతి కార్యక్రమం మీ అందరి కృషి వల్లే విజయవంతమైంది. యోగాంధ్ర నిర్వహణలో అధికారుల సహకారం మరువలేనిది.’అని అన్నారు. పరిపాలనాపరంగా తనకు సహకరించిన ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ.. కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ నుంచి తాము ఎన్నో విషయాలు నేర్చుకున్నామని, ఆయన పరిపాలనా దక్షత తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జి.పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. యోగాంధ్ర వంటి కార్యక్రమాల్లో కలెక్టర్‌ చూపిన చొరవ, నాయకత్వ పటిమ అద్భుతమని కొనియాడారు. కలెక్టర్‌ సతీమణి దివ్య ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఆయన ఎప్పు డూ చిరాకు పడరు. ఎవరిపై కోప్పడరు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓపిగ్గా వింటారు. మీరందరూ ఇచ్చి న మద్దతు వల్లే ఆయన ఇంతటి ఉత్తమ పనితీరును ప్రదర్శించగలిగారు’ అని అన్నారు. అంతకుముందు సింహాచలం దేవస్థానం వేద పండితులు కలెక్టర్‌ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అధికారులు, రెవెన్యూ, ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సభ్యులు కలెక్టర్‌ దంపతులను ఘనంగా సన్మానించారు.

కలెక్టర్‌ వీడ్కోలు సభలో జిల్లా అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement