పద్మనాభం: గిరి పరిసరాలన్నీ చిమ్మ చీకట్లో వెలుగు దివ్వెల కాంతికి నూతన శోభను సంతరించుకున్నాయి. దేవ దేవుడైన అనంత పద్మనాభుని నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి. పోటెత్తిన జనంతో పద్మనాభుని గిరి భక్త జన సాగరంగా మారింది. వేల దీప కాంతులు ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లగా భక్తులు పులకాంకితులయ్యారు.
ఇది పద్మనాభంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన అనంత పద్మనాభుని దీపోత్సవ వైభవం.
కొండపైకి రోడ్డు వేయడంతో అనంత పద్మనాభుని దర్శించుకోవడానికి జనం అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
సాయంత్రం 5.30 గంటలకు గిరిపై జేగంట మోగగానే ఒక్క సారిగా భక్తులు 1,278 మెట్లకు ఇరువైపులా తైల దీపాలు వెలిగించారు. తైల దీపాలంకరణతో అనంత పద్మనాభుని గిరికి సిందూర తోరణాలు అద్దినట్టు సుందర దృశ్యం ఆవిష్కృతమైంది.


