Anantha Padmanabha Swamy Temple
-
కేరళ అనంతపద్మనాభ ఆలయంలో బంగారం చోరీ!
కేరళలోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయంలో తక్కువ మొత్తంలో సుమారు 100 గ్రాముల మేర బంగారం చోరీకి గురైనట్లు వార్తలు వచ్చాయి. బంగారం పూత నిమిత్తం ఆలయంలో ఉంచిన సుమారు 12 పవనాల (కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో బంగారాన్ని పవనాల్లో కొలుస్తారు. ఒక్కో పవనం 8 గ్రాములకు సమానం) బంగారం కనిపించకుండా పోయిందని ఆయా వార్తా నివేదికల్లో పేర్కొన్నారు.ఆ బంగారాన్ని ఎత్తుకెళ్లారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పినట్లుగా ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక పేర్కొంది. చివరిసారిగా రెండు రోజుల క్రితం గోల్డ్ ప్లేటింగ్ పనులు జరిగాయి. ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని లాకర్లో భద్రపరిచి మళ్లీ పని నిమిత్తం బంగారాన్ని బయటకు తీసుకెళ్లగా సుమారు 12 పవనాల పసిడి మాయమైంది. ఈ మేరకు ఫిర్యాదు నమోదైనట్లు ఫోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల భద్రతా లోపం ఉందని, ఈ చోరీ వెనుక ఆలయంలోని వ్యక్తుల హస్తం ఉండొచ్చని మరికొన్ని వార్తా సంస్థలు నివేదించాయి.గతంలో కూడా ఈ ఆలయంలో బంగారం చోరీకి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. 2015లో సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక ఆడిట్ రిపోర్టులో, ఆలయంలోని నిధుల నుండి 266 కిలోల బంగారం కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఈ బంగారం ఆలయ అలంకరణ కోసం బయటకు తీసినప్పుడు మాయమైనట్లు రిపోర్టు పేర్కొంది. అయితే ఎవరినీ నేరంగా బాధ్యులుగా నిర్ధారించలేదు.2017లో ఆలయంలో రూ. 189 కోట్ల విలువైన బంగారం, ఎనిమిది పురాతన వజ్రాలు కనిపించకుండా పోయినట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. ఈ ఘటనలపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇక 2024 అక్టోబరులో ఆలయంలో ప్రసాదం కోసం ఉపయోగించే ఒక ఇత్తడి పాత్ర మాయమైనట్లు వార్తలు వచ్చాయి.ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ ఆలయ సంపద రూ. 1.5 లక్షల కోట్ల విలువైనదిగా అంచనా. 2011లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నేలమాళిగల్లోని ఆరు గదులలో ఐదింటిని తెరిచారు. వీటిలో అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాలు బయటపడ్డాయి. అయితే, ఒక గదిని మాత్రం ఇప్పటివరకు తెరవలేదు. దీని వెనుక సాంకేతిక, మతపరమైన కారణాలు ఉన్నాయని చెబుతారు. -
Kerala Tour అరేబియా తీరం, హౌస్‌బోట్ విహారం
టెక్నాలజీతో రూపుదిద్దుకున్న రామాయణ ఘట్టం ఉంది.అరేబియా తీరాన కొలువుదీరిన అతిపెద్ద గంగాధరుడున్నాడు.అనంత సంపన్నుడు అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. భారతీయ మూర్తులకు పశ్చిమ రంగులద్దిన రవివర్మ ఉన్నాడు.కేరళ సిగ్నేచర్ హౌస్‌బోట్ విహారం ఉంది... కథకళి...కలరిపయట్టు విన్యాసాలూ ఉన్నాయి.టీ తోటలు... మట్టుపెట్టి డ్యామ్ బ్యాక్ వాటర్స్...ఇవే కాదు... ఇంకా చాలా చూపిస్తోంది ఐఆర్సీటీసీ. మొదటి రోజుత్రివేండ్రమ్ ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్, కొకువెలి రైల్వేస్టేషన్ల నుంచి పికప్ చేసుకుని బస చేయాల్సిన హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్ త్రివేండ్రమ్ లేదా కోవళమ్‌లలో ఉంటుంది. సాయంత్రం కోవళం బీచ్, అళిమల శివుని విగ్రహాన్ని దర్శించుకుని విశ్రాంతి తీసుకోవడమే. రెండో రోజుఉదయం త్రివేండ్రమ్‌లోని పద్మనాభస్వామి ఆలయ దర్శనం. జటాయు ఎర్త్ సెంటర్‌ని చూసిన తర్వాత ప్రయాణం కుమర్‌కోమ్ వైపు సాగుతుంది. ఈ ప్యాకేజ్ పేరుతో ఉన్న హౌస్‌బోట్ విహారం ఇక్కడ మొదలవుతుంది. కుమర్‌కోమ్ లేదా అలెప్పీలో క్రూయిజ్‌లోకి మారాలి. రాత్రి భోజనం, బస, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అన్నీ హౌస్‌బోట్‌లోనే.తెరవని ఆరవ గదిత్రివేండ్రమ్... ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అనంత పద్మనాభ స్వామి వల్ల ఈ పేరు విశ్వవ్యాప్తంగా ప్రచారం సంతరించుకుంది. ఈ నగరానికి ఆ పేరు వచ్చింది కూడా అనంత పద్మనాభ స్వామి వల్లనే. తిరు అనంత పురం... క్రమంగా మలయాళీల వ్యవహారంలో తిరువనంతపురం అయింది. బ్రిటిష్ వారి వ్యవహారంలో త్రివేండ్రమ్‌గా మారింది. ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయంలో తెరవని ఆరో గది ఇప్పటికీ ఆసక్తికరమే. నాగబంధంతో మూసిన ఆ గదిని తెరవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పద్మనాభ స్వామి ఆలయ దర్శనంలో ఈ గదిని తప్పనిసరిగా చూడాలి. ఇక త్రివేండ్రమ్ అనగానే గుర్తొచ్చే మరో పేరు రాజా రవి వర్మ. భారతీయ దేవతల చిత్రాలకు కొత్తరంగులద్దిన ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన రవివర్మ నివాసాన్ని కూడా చూడవచ్చు.జటాయు ఎర్త్ సెంటర్... ఇది ఒక థీమ్ పార్క్. జటాయు పక్షి ఆకారంలో నిర్మించారు. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో రావణుడితో పోరాడి ప్రాణాలు వదిలిన పక్షి జటాయు. ఆ పక్షి రావణుడితో యుద్ధం చేసి నేలకొరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ పార్క్‌ను పశ్చిమ కనుమల్లో ఓ కొండ మీద 65 ఎకరాల్లో నిర్మించారు. ఈ కొండమీదకు వెళ్లడానికి ఎనిమిది వందలకు పైగా మెట్లెక్కాలి. కేబుల్‌కార్ కూడా ఉంది. ఆరోగ్యవంతులు ఎక్కగలిగిన కొండే అయినప్పటికీ బయటి ప్రదేశాల నుంచి పర్యటన కోసం వచ్చిన వాళ్లు టైమ్ వేస్ట్ చేసుకోకుండా పశ్చిమ కనుమల సౌందర్యాన్ని వీక్షిస్తూ కేబుల్ కార్లో వెళ్లడమే మంచిది. వెకేషన్ కోసం వెళ్లి నాలుగైదు రోజులు బస చేసేవాళ్లు ఒక రోజు కొండ ఎక్కడాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్యాస్టిక్‌ని అనుమతించరు.మూడో రోజుఅలెప్పీ నుంచి మునార్‌కు ప్రయాణం. రోడ్డు మార్గాన మునార్‌కు చేరాలి. మధ్యలో పునర్జనిలో కేరళ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించాలి. రాత్రి బస మునార్‌లో.కలరిపయట్టు... కథకళి చూద్దాం!పునర్జని ట్రెడిషనల్ విలేజ్... కేరళ సంప్రదాయ కళల ప్రదర్శన వేదిక. అలాగే ఆయుర్వేద చికిత్సల నిలయం కూడా. మునార్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రోజూ సాయంత్రం ఆరు గంటలకు కథకళి నాట్యం, కలరిపయట్టు యుద్ధకళా విన్యాసాలను ప్రదర్శిస్తారు. రిలాక్సేషన్ థెరపీలు ఐదు నుంచి పదిహేను వేలు చార్జ్ చేస్తారు. అవి ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. నాలుగో రోజురోజంతా మునార్‌లోనే. ఎరవికులమ్ నేషనల్ పార్క్ పర్యటన, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఎఖో పాయింట్, కుందల డ్యామ్ లేక్‌లో విహరించిన తర్వాత రాత్రి బస మునార్‌లోనే.మునార్ టీ తోటల మధ్య విహారం, ఝుమ్మనే వాటర్ ఫాల్స్ ను దూరం నుంచే చూస్తూ ముందుకు సాగిపోవడంతోపాటు టీ మ్యూజియం సందర్శన బాగుంటుంది. మట్టుపెట్టి డ్యామ్, రిజర్వాయర్ చుట్టూ విస్తరించిన టీ తోటల దృశ్యం కనువిందు చేస్తుంది. ఎరవికులమ్ నేషనల్ పార్క్ విజిట్ మరిచిపోలేని అనుభూతి. నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి పూచే నీలకురింజి పువ్వు దట్టంగా పూసేది ఇక్కడే. నీలకురింజి మళ్లీ పూసేది 2030లో. కానీ ఎక్కడో ఓ చోట ఒకటి రెండు గుత్తులు కనిపిస్తాయి. గైడ్లు వాటిని చూపించి కొండ మొత్తం పూసినప్పుడు దృశ్యం ఎలా ఉంటుందో ఫొటోలు చూపిస్తారు. అయిదో రోజుమునార్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కొచ్చి వైపు సాగిపోవాలి. కొచ్చిలో హోటల్ చెక్ ఇన్. మెరైన్ డ్రైవ్‌ను ఎంజాయ్ చేసిన తర్వాత షాపింగ్ తర్వాత నైట్ స్టే.కొచ్చిలో షాపింగ్ చేయడం మొదలు పెడితే మన లగేజ్ పెరిగిపోతుంది. లవంగాలు, యాలకులు, మిరియాల వంటివి చక్కటి ఘాటు వాసనతో స్వచ్ఛంగా ఉంటాయి. టూర్ గుర్తుగా కేరళ చీర ఒక్కటైనా కొనుక్కోవాలి. అవి బాగా మన్నుతాయి కూడా! స్థానిక హస్తకళాకృతులకు కొదవే ఉండదు. కోకోనట్ కాయిర్‌తో చేసిన గృహోపకరణాలు కూడా బాగుంటాయి. కథకళి సావనీర్లు తెచ్చుకోవచ్చు. ఆయుర్వేద తైలాల పేరుతో దొరికేవన్నీ స్వచ్ఛమైనవి కాదు, నకిలీలు కూడా ఉంటాయి. వీటిని గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్టోర్లలో మాత్రమే కొనాలి. షాపింగ్ చేసేటప్పుడు ఫ్లయిట్లో లగేజ్ బరువు పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. వెళ్లేటప్పుడు ఫ్లయిట్, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తే లగేజ్ బరువు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఆరో రోజుకొచ్చిలో హోటల్ చెక్ అవుట్ చేసి, కొచ్చి లోని డచ్ ప్యాలెస్ సందర్శనం. యూదుల సినగోగ్ (ధార్మిక సమావేశ మందిరం), సర్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రాజ్ బాసిలికా పర్యటన తర్వాత కొచ్చి ఎయిర్ పోర్ట్ లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడంతో టూర్ పూర్తవుతుంది. కొచ్చి, ఎర్నాకుళం మన హైదరాబాద్– సికింద్రాబాద్ వంటి జంట నగరాలు. ఎయిర్΄ోర్టు కొచ్చిలో ఉంది, రైల్వే స్టేషన్ ఎర్నాకుళంలో ఉంది.వాస్కోడిగామా రాక ఫలితం!డచ్ ప్యాలెస్... అనగానే పాశ్చాత్య నిర్మాణశైలిని ఊహిస్తాం. కానీ ఇది పూర్తిగా కేరళ సంప్రదాయ నాలుకేట్టు నిర్మాణశైలిలో ఉంటుంది. పోర్చుగీసు వాళ్లు నిర్మించడం వల్ల డచ్ ప్యాలెస్‌గా అనే పేరు వచ్చింది. ఇది కొచ్చి నగరానికి సమీపంలోని మత్తన్ చెర్రి అనే ప్రదేశంలో ఉండడంతో స్థానికులు మత్తన్‌చెర్రి ప్యాలెస్ అనే పిలుస్తారు. వాస్కోడిగామా మనదేశంలో కేరళతీరం, కొచ్చి రాజ్యం, కప్పడ్ దగ్గర ప్రవేశించాడు. కొచ్చి రాజు అతడికి సాదర స్వాగతం పలికాడు. మనదేశం బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లడానికి దారులు వేసిన ఒక కారణం ఇది. ఈ ప్యాలెస్ భవనాల సముదాయం హెరిటేజ్ సైట్ల జాబితా కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ ప్యాలెస్ లోపల నాటి చిత్రరీతుల ప్రదర్శన ఉంది.యూదులు వచ్చారు!మత్తన్‌చెర్రిలో డచ్ ప్యాలెస్ పక్కనే యూదు మతస్థుల ధార్మిక సమావేశ మందిరం సినగోగ్ కూడా ఉంది. ఇది కూడా డచ్ ప్యాలెస్ నాటి 16వ శతాబ్దం నాటి నిర్మాణమే. పశ్చిమం నుంచి మనదేశానికి అరేబియా సముద్రం మీదుగా జలమార్గాన్ని కనుక్కున్న తర్వాత పాశ్చాత్య దేశాలతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. వర్తకులు, నౌకాయాన ఉద్యోగులు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవడం మొదలైంది. అలా స్పెయిన్, పోర్చుగల్ నుంచి వచ్చిన వారిలో కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు. ఆ కాలనీలు క్రమంగా వారి మత విశ్వాసాలను కొనసాగించడానికి మందిరాలు కట్టుకున్నారు. అలాంటిదే ఇది కూడా. ఈ సినగోగ్ క్రిస్టల్ షాండ్లియర్లతో అందంగా ఉంటుంది. తమ మత సంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశంలో భారతీయులుగా మమేకమయ్యారు. ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్‌బోట్’... ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజ్. ఇందులో త్రివేండ్రమ్, అలెప్పీ, మునార్, కొచ్చి ప్రదేశాలు కవర్ అవుతాయి. నీలగిరి తార్కు ప్రసూతి సమయం కావడంతో మునార్‌లోని ఎరవికులమ్ నేషనల్ పార్క్‌ను ఏప్రిల్ 1 వరకు క్లోజ్ చేశారు. ప్రస్తుతం పర్యాటకులను అనుమతిస్తున్నారు. కాబట్టి ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్‌బోట్’ టూర్‌కి ఇది అనువైన సమయం.కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి దాదాపుగా 57 వేల రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 30 వేలవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. పిల్లలకు విడిగా బెడ్ తీసుకుంటే తొమ్మిది వేలు, బెడ్ తీసుకోకపోతే దాదాపుగా ఐదు వేల ఐదు వందలు. టూర్లో ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, మార్గమధ్యంలో టోల్ ఫీజులు, పార్కింగ్ ఫీజులు, ప్యాకేజ్‌లో చెప్పిన ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, హోటల్ గది బస, హౌస్‌బోట్‌లో బస, నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, హౌస్‌బోట్‌లో లంచ్, డిన్నర్ ఈ ప్యాకేజ్‌లో ఉంటాయి.ప్యాకేజ్‌లో మన ప్రదేశం నుంచి త్రివేండ్రమ్‌కు చేరడం, కొచ్చి లేదా ఎర్నాకుళం నుంచి ఇంటికి రావడానికి అయ్యే రైలు లేదా విమాన ఖర్చులు వర్తించవు. త్రివేండ్రమ్‌లో రిసీవ్ చేసుకోవడం నుంచి కొచ్చిలో వీడ్కోలు పలకడం వరకే ఈ ప్యాకేజ్. ఇటీవల పర్యాటకులు యూ ట్యూబ్ వీడియోల కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా హౌస్‌బోట్ ప్రయాణంలో నిర్వహకుల సూచనలను విధిగా పాటించాలి.ఈ టూర్‌లోని పర్యాటక ప్రదేశాల్లో మునార్ టీ మ్యూజియానికి సోమవారం సెలవు, కొచ్చిలోని డచ్ ప్యాలెస్ శుక్రవారం, యూదుల సినగోగ్‌కి శనివారం సెలవు. వీటిలో ఒకటి – రెండు మిస్ కాక తప్పదు. విమానాశ్రయంలో దేవుని ఊరేగింపు!త్రివేండ్రమ్ చేరడానికి విమానంలో వెళ్లడం వల్ల బోనస్ థ్రిల్ ఉంటుంది. పద్మనాభస్వామి ఊరేగింపు కోసం విమానాలు ల్యాండింగ్ ఆపేస్తారు. ఏడాదికి రెండు దఫాలు ఈ విచిత్రం చోటు చేసుకుంటుంది. ఏప్రిల్ నెలలో పైన్కుని పండుగ సందర్భంగా జరిగే పది రోజుల వేడుకలో చివరి రోజు ఆరట్టు (సముద్రస్నానం) కోసం పద్మనాభ స్వామి ఊరేగింపు ఆలయం నుంచి షంగుముగమ్ బీచ్ వరకు ఆరు కిలోమీటర్ల దూరం సాగుతుంది. అలాగే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో అల్పఱి పండుగ వేడుకల సందర్భంగా కూడా రన్‌వేని మూసివేస్తారు. ఎందుకంటే విమానాశ్రయం రన్‌వే ఈ దారిలోనే ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించేటప్పుడే (1932 ) ప్రభుత్వం విధించిన నియమం ఇది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు ఇక్కడ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకోవు. పండుగకు రెండు నెలల ముందే ఆలయ ట్రస్ట్ బోర్డు వేడుకల షెడ్యూల్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీకి తెలియచేస్తుంది. ఆ మేరకు ఏ తేదీన ఏ సమయంలో ఎయిర్΄ోర్ట్ రన్‌వేను మూసివేయనున్నారనే సమాచారం అక్కడ రాకపోకలు సాగించే విమానాల సంస్థలకు అందుతుంది. ఇది ప్రపంచవింత కాదు కానీ విచిత్రం. -వాకా మంజులా రెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అనంతపద్మనాభ స్వామి ఆలయం..! కొండనే ఆలయాలుగా..
ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్తంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిధ ఆకృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోవాలసిందే! గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 –620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలుగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. . మొదటి అంతస్తు: కింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ధ సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గం, విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది. రెండవ అంతస్తు: రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతిగా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి. మూడవ అంతస్తులోకి మెట్లమార్గం...చారిత్రక నేపథ్యం – ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులు కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా విష్ణు బంధమైన గుహాలయం. సాధారణం గా బౌద్ధ, జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా పనిచేసిన మాధవరెడ్డి ఈ అనంత పద్మనాభుని గుహాలయాన్ని నిర్మింపజేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ నుంచి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించే వారని నానుడి. ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం. మహా గణపతి...లంబోదరుని సహస్ర రూ΄ాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను శిల్పంలో దర్శింపజేయడం అనన్య సామాన్యం. ఉగ్రనరసింహుడు: ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితోపాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి. శ్రీ లక్ష్మీదేవితో ఆదివరాహస్వామి...స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు. ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు... నాగబంథం: మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు? రవాణాసౌకర్యాలు...విజయవాడకు దేశంలోని అన్ని ్ర΄ాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు. రోడ్డు మార్గం... ఉండవల్లి గుహలకు చేరుకునే మార్గాలు ఆలయానికి మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 31 కిలోమీటర్ దూరంలో ఉంది. మంగళగిరి నుండి ఉండవల్లి గుహలకు 7 దూరంలో ఉంది. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గుహలను సందర్శించడానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. అదేవిధంగా గుంటూరులో రైల్వే జంక్షన్, విజయవాడలో రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరు నుంచి ఆలయానికి 30 కిలోమీటర్లు, విజయవాడ నుంచి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్లు ఉంది. రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మంగళగిరిలో రైలు జంక్షన్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా ఉండవల్లి గుహకు వెళ్లడానికి సదుపాయాలు ఉన్నాయి.(చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
వినాయక నిమజ్జనం రోజు ఆచరించే వ్రతం! ఎలా చేస్తారంటే..?
భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని 'అనంత చతుర్థి' అంటారు. ఈ రోజే వినాయక నిమజ్జనం చేస్తారు. ఆ రోజు ఆచరించే అనంతపద్మనాభస్వామి వ్రతం అత్యంత మహిమాన్వితమైనది. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణడే పాండవులు సూచించాడని వ్యాసమహర్షి రచించిన మహాభారతంలో ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే దారిద్ర్యం తొలగిపోయి...విజయం, అభయం, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణ వచనం. అనంత వ్రతం అనగా..మాయాజూదంలో ఓడిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాల గురించి శ్రీ కృష్ణుడు తెలుసుకుంటుండేవాడు. అలా ఓసారి పాండవుల దగ్గరకు వెళ్లిన శ్రీ కృష్ణుడితో.. ఏ వ్రతాలను ఆచరిస్తే తమకు కష్టాలు తొలగిపోతాయో వివరించమని అడిగాడు ధర్మరాజు. అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు సూచించినదే అనంత పద్మనాభస్వామి వ్రతం. ఎవరీ అనంతడు...అనంత పద్మనాభుడు ఎవరని అడిగిన ధర్మరాజు ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. అనంతుడు అంటే ఎవరో కాదు స్వయంగా తానే అని వివరించాడు. అనంతుడు అంటే అంతటా వ్యాపించినవాడు, కాల స్వరూపుడు అని అర్థం. అనంత విశ్వంలో అణువణువు నిండి ఉండేది తానే అని వివరించాడు కృష్ణుడు. సృష్టి, స్థితి,లయలకు కారణం అయినా కాలస్వరూపుడి రూపంలో ఉన్నది, దశావతారాలు ఎత్తేది తానే అని చెప్పాడు. అందుకే చతుర్ధశ భువనాలు నిండి ఉన్న అనంతస్వరూపం అయిన అనంతుడిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయన్నాడు. ఏటా భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యోదయానికి తిధి ఉండడం ప్రధానం కాబట్టి చతుర్దశి ఏ రోజైతే సూర్యోదయానికి ఉంటుందో ఆ రోజుని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇవాళ (సెప్టెంబరు 17, 2024) మంగళవారం ఉదయం 11 గంటలవరకూ చతుర్దశి ఉంది...అందుకే ఈ రోజే స్త్రీలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరించి ఆ దైవం అనుగ్రహంతో తమ కష్టాల నుంచి బయటపడతామని విశ్వసిస్తారు. వ్రత విధానం..ఏ పూజ తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలి..అందుకే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆరంభించే ముందు వినాయకుడిని పూజించాలి. అనంతరం నవగ్రహ పూజ ఆచరించి ఆ తర్వాత అనంతపద్మనాభుడికి షోడశోపచార పూజ చేయాలి. 14 దారాలను కలిపి ఎరుపు రంగు తోరాన్ని పూజించి..వ్రతం అనంతరం కట్టుకోవాలి. ఇలా అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని 14 ఏళ్లు ఆచరించాలని శ్రీ కృష్ణుడు వివరించాడు. శ్రీకృష్ణుడి సూచన పాండవులు ఈ వ్రతం చేసి అడగడుగున ఎదురైన కష్టాల నుంచి బయటపడటమే గాక కోల్పోయిన తమ రాజ్యాన్ని సంపదను తిరిగి దక్కించుకోగలిగారు. కలిగే ప్రయోజనాలు..వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు..సంపద పెరుగుతుంది.వృత్తి జీవితంలో వెంటాడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.(చదవండి: ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..) -
అనంతపద్మనాభ ఆలయం గురించి డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలో ఉచితం
శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి 'ఒనవిల్లు: ది డివైన్ బో' పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మార్చి 8 నుంచి మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ పడుతుండటం వల్ల ఈ డాక్యుమెంటరీని ఇతర భాష వారు కూడా చూస్తున్నారు. ఓనవిల్లు అంటే శ్రీ పద్మనాభస్వామి ఆలయ స్వామికి 'ఓనవిల్లు' అంటే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరిని "ఒన్వవిల్లు కుటుంబం" అంటారు. ఈ విల్లును తయారు చేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందు 41 రోజుల తపస్సును పాటిస్తారు. ఆ వంశీయులు ఏడు తరాలుగా ఏటా ఓనవిల్లును తయారు చేస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్టమైన సంప్రదాయ ఆచారం గురించి వచ్చిన ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, యువ నటుడు ఉన్ని ముకుందన్లు వాయిస్‌ని అందించడం విశేషం. సంపదకు రక్షణగా ట్రావెన్కోర్ కొంతకాలం క్రితం అనంతపద్మనాభ ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద ఉంటుందో ఎవరికీ తెలియని రహస్యం. -
అనంతగిరిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పద్మనాభ స్వామి!
శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన, ఆళ్వార్ల రచనల్లో ప్రస్థావించబడిన, లక్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు సంబందించిన దివ్య దేశాలు 108 కాగా ఇందులో భారత్‌లో ఉన్నవి 105 మాత్రమే, ఒకటి నేపాల్ లో ఉండగా మిగతా రెండు ఈ భూలోకంలో కాదు అక్కడెక్కడో, అల వైకుంఠపురంలో ఉన్నాయంటారు. ఇందులో ఎక్కువ కెక్కువ ఉన్నది తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో. ఆంధ్రప్రదేశ్‌లో నున్న రెండు ఆలయాలు తిరుమల, అహోబిలంలు. భారత్‌లోనే అత్యంత సంపన్నవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ పెరుమాళ్ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ లెక్కలోకి రాకున్నా హైదరాబాద్‌కు 75 కిమీ దూరంలో వికారాబాద్ అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణంలో మనకూ ఒక అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి కూర్చున్నట్లుగా ఉన్న ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందంటారు. నిజాం ప్రభుత్వం లో ప్రధాన మంత్రిగా ( 18931901)పనిచేసిన నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా బహదూర్ జాగీర్ కావడం వల్ల దీనికి ’వికారాబాద్’ అన్న పేరు వచ్చిందట. అంతకు పూర్వం ఇది గంగవరంగా పిలువబడిందట. హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది పుట్టింది వికారాబాద్ అడవుల్లోనే. వికారాబాద్ చల్లటి ప్రాంతం కావడం, అక్కడ లోయలు, కొండలతో మంచి అడవి ఉండడం, వర్షా కాలంలో అందమైన జలపాతాలు ప్రత్యక్ష మవడం వల్ల నిజాం నవాబులు ఆ రోజుల్లోనే దీన్ని విశ్రాంతి కేంద్రంగా వాడుకున్నారట. ఇక్కడున్న వనాలు వాటిలోని ఔషద గుణాలు గమనించి 1946లోనే ఇక్కడ క్షయ వ్యాధిగ్రస్తుల కోసం ఒక టీబీ సానెటోరియం పెట్టడం విశేషం. ఓ సారి అడవుల్లోకి వేటకు వచ్చి అలసిసొలసి పడుకున్న నిజాం (మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ) కలలోకి వచ్చిన స్వామి తన ఆలయాన్ని పునరుద్దరించమన్నాడని, ఆ ఆదేశాన్ని రాజు గారు పాటించారని చెబుతారు. -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ! -
కేరళ అనంత పద్మనాభస్వామి : బబియాకు కన్నీటి వీడ్కోలు (ఫొటోలు)
-
శాఖాహార మొసలి బబియా ఇక లేదు
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిని శాఖాహార బబియా అనే మొసలి మరణించింది. ఈ మొసలి కేరళలోని అనంతపుర గ్రామంలోని దేవాలయంలో ప్రధాన ఆకర్షణగా ఉండేది. కేవలం అన్నం మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించేది. ఈ మొసలి అనంత ద్మనాభ స్వామి ఆలయం చెరువు మధ్యలో ఉండేది. ఈ ఆలయా చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు. పైగా దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని ఆ చెరువులో ఉండే చేపలను కూడా తినలేదని ఆ ఆలయ పూజారి చెబుతున్నాడు. ఆ ఆలయ పూజారికి మొసలికి చాలా అవినాభావ సంబంధం ఉంది. రోజు పూజారి ఆ మొసలికి రెండు సార్లు అన్నాన్ని అందిస్తాడని, ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆ మొసలి నోటికి అందిస్తాడని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. పురాతన ఆలయ సాంప్రదాయానికి అనుగుణంగా పూర్తి శాఖాహార మొసలి అని ఆలయ పూజారి చెబుతున్నాడు. పూరాణాల ప్రకారం తిరువనంతపురంలో ఉన్న అనంతపద్మనాభ స్వామి మూలస్థానం ఇదేనని, ఆయని ఇక్కడే స్థిరపడినట్లు భక్తుల విశ్వసిస్తారు. అదీగాక ఈ బబియా అనే మొసలిని ఆలయాన్ని రక్షించడానికి దేవుడు నియమించిన సంరక్షకురాలని భక్తుల ప్రగాఢంగా నమ్ముతారు. (చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్) -
‘అనంత’ సంపద ఎన్నడు తెలిసేను?
న్యూఢిల్లీ: దేశంలోని సంపన్న దేవాలయాల్లో ఒకటైన కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఈ దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్కోర్ రాజ కుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ యాజమాన్య హక్కులపై దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలుకుతూ సోమవారం తుది తీర్పు వెలువరించింది.(పద్మనాభుడి ఆలయం ట్రావెన్కోర్ కుటుంబానిదే) దీంతో పద్మనాభుడి ఆలయం కింద ఉన్న ఆరో నేలమాళిగలోని రహస్యం త్వరలోనే బయటపడుతుందన్న ఊహాగానాలకు తెరపడింది. అనంతపద్మనాభ స్వామి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ సంస్థానాధీశుడు అనంతపద్మనాభ స్వామికి తన రాజ్యం మొత్తాన్ని ధారాదత్తం చేశాడు. చివరకు తనను తానే స్వామికి దాసుడిగా చేసుకున్నాడు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఆలయంలోని ఐదు నేళమాళిగలను తెరిచిన సంగతి తెలిసిందే. వీటిలో దాదాపు లక్ష కోట్ల రూపాయల సంపద ఉన్నట్లు లెక్కల్లో తేలింది. ఆరో నేళమాళిగను తెరిచేందుకు రాజకుటుంబ ఆధ్వరంలోని దేవాలయ పాలకమండలి ఒప్పుకోలేదు. ఆరో నేళమాళిగ శాపానికి గురైందని, అది తెరిస్తే భగవంతుడి ఆగ్రహానికి గురవక తప్పదని పురాణాల్లో ఉందని వెల్లడించింది. ఆలయ చరిత్ర పద్మనాభుడి ఆలయ చరిత్ర, ట్రావెన్కోర్ సంస్థాన చరిత్రతో ముడిపడి ఉంది. అయితే, ఆలయం ఎప్పుడు నిర్మితమైందన్న దానిపై 2011లో కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం భిన్నవాదనలున్నాయి. పురాణాల్లో కూడా ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందన్న దానిపై రకరకాల కథలున్నాయి. స్పష్టంగా తెలిసిన విషయమేంటంటే... 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయ బాధ్యతలను నాటి ట్రావెన్కోర్ పాలకుడు అనిఝామ్ తిరునాళ్ మార్తాండవర్మన్ తన భుజానికి ఎత్తుకున్నాడు. రాజుతో కలిపి మొత్తం ఎనిమిదిన్నర(8+1/2) మందితో కూడిన బృందం ఆలయపాలనను చూసుకునేది. ఇక్కడ ఎనిమిదిన్నరను కేరళ హైకోర్టు తన తీర్పులో రాజు ఓటు విలువ అరగా పేర్కొంది. ఎనిమిది మందిలో ఏడుగురు బ్రహ్మణులు, ఒకరు నాయర్. అయితే, 1720ల్లో బృందంలోని మిగతా ఎనిమిది మందితో రాజు మార్తాండవర్మన్కు ఆలయ పాలనపై వివాదం తలెత్తింది. అర ఓటు హక్కు కలిగిన రాజుకు ఆలయ బాగోగుల్లో చాలా తక్కువ పాత్ర ఉండేదని కేరళ హైకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. ఈ ఎనిమిదిన్నర మందితో కూడిన బృందం ఆలయపాలనను చూసుకుంటే, మరో ఎనిమిది మందితో కూడిన ‘ఎట్టువీట్టిల్ పిల్లామర్స్’ఆలయ ఆస్తులను చూసుకునేది. ఈ బృందంలోని ఎనిమిది మంది నాయర్లు. వీరు ట్రావెన్కోర్ సంస్థానంలోని ఎనిమిది పెద్ద కుటుంబాలకు చెందినవారు. కేరళ హైకోర్టు ప్రకారం.. మార్తాండవర్తన్ను ఎలాగైనా గద్దె దించి, అతని సోదరి కుమారుడిని సంస్థానాదీశుడిని చేయాలని రెండు బృందాల్లోని సభ్యులు భావించారు. కానీ వీరోచిత పోరాటంతో మార్తాండ వర్మన్ తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అప్పటిదాకా ముక్కలుగా ఉన్న ట్రావెన్కోర్ రాజ్యాన్ని ఏకం చేయడానికి అనేక యుద్ధాలు చేసి విజయపతాకం ఎగురవేశాడు. ఈ కేసులో తుది తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు.. రాజకుటుంబానికి చెందిన ఓ యువరాజు రాసిన పుస్తకాన్ని ప్రస్తావించింది. మహాభారతంలోని అర్జునిడిలా, కళింగ యుద్ధం తర్వాత అశోకునిలా.. ప్రాణనష్టాన్ని చూసి మార్తాండవర్మన్ చలించిపోయాడని, ఆ బాధ నుంచి బయటపడేందుకు తన రాజ్యాన్నంతటినీ పద్మనాభస్వామి ఆలయానికి ధారాదత్తం చేశాడని రచయిత రాసుకొచ్చారని చెప్పింది. ఆ తర్వాత దేవాలయ ఆలనాపాలనను మార్తాండవర్మే రాజ కుటుంబమే చూసిందని పేర్కొంది. బ్రిటీష్ పాలన 1758లో 53 ఏళ్ల వయసులో మార్తాండవర్మన్ కాలం చేశారు. 1810 నాటికి ట్రావెన్కోర్ సంస్థానం ఇద్దరు రాణులు గౌరీ లక్ష్మీ భాయ్, గౌరీ పార్వతి భాయ్ పాలనలోకి వచ్చింది. ఈ సమయంలో టిప్పు సుల్తాన్‌పై యుద్ధాలకు బ్రిటీషర్లు, ట్రావెన్కోర్ అధిపతులకు సాయం చేశారు. ఆ తర్వాత రాణులు బ్రిటీషర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఫలితంగా ట్రావెన్కోర్ సంస్థానంలోని ప్రతి ఆలయం బ్రిటీష్ పాలనలోకి వెళ్లిందని కేరళ హైకోర్టు 2011లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావించింది. 1811లో సంస్థాన అవసరాలకు ఆలయం నుంచి డబ్బు తీసుకుని, తిరిగి చెల్లించేలా ట్రావెన్కోర్ ఒప్పందం చేసుకోవడం పద్మనాభుడి సంపదను తెలియజేస్తుంది. బ్రిటిషర్లు చేసిన ఏర్పాట్ల ప్రకారం 1940 వరకూ ఆలయపాలన సాగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి పాలకుడు బలరామవర్మన్తో సంప్రదింపుల అనంతరం ట్రావెన్కోర్ భారత్‌లో విలీనమైంది. సమస్య ఎక్కడంటే? ట్రావెన్కోర్ పాలకుడిగా బాధ్యతలు తీసుకునేప్పుడు బలరామవర్మన్ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇందుకు కారణం ఉంది. ట్రావెన్కోర్ సంస్థానాధీశుడిగా అనంతపద్మనాభ స్వామిని, బలరామవర్మన్ వంశం భావిస్తుంది. దేవుడి తరఫున మాత్రమే రాజ్యం ఆలనాపాలనా చూస్తారు. 1991లో బలరామవర్మన్ కాలం చేశారు. ఆ తర్వాత ఆయన సోదరుడు తిరునాళ్ మార్తాండవర్మన్ రాజ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు. కేరళ ప్రభుత్వం గుడి మేనేజ్మెంట్లో ఆయన్ను సభ్యుడిగా ఉంచింది. కానీ ఆయన ఆలయ భూములు, రాజ కుటుంబానికి చెందినవేనని చేసిన ప్రకటనతో వివాదం రాజుకుంది. చాలా మంది భక్తులు దీనిపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. మార్తాండవర్మన్కు గుడి మేనేజ్మెంట్పై ఎలాంటి హక్కులూ లేవని హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతోపాటు గుడిలోని నేళమాళిగలను తెరవాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఈ విషయం సుప్రీం కోర్టును చేరింది. దాంతో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం నేళమాళిగలను తెరవాలని ఆదేశించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఐదు గదుల్లో బంగారు విగ్రహాలు, వందల కిలోల బంగారు ఆభరణాలు, 60 వేలకు పైచిలుకు వజ్ర, వైఢూర్యాలు, రోమన్ బంగారు నాణెలు తదితరాలు లభ్యమయ్యాయి. దీంతో పద్మనాభస్వామి ఆలయ ఖ్యాతి ప్రపంచమంతటా పాకింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇదేననే భావన అంతటా మొదలైంది. ఇక్కడ దొరికిన వస్తువుల విలువను లెక్కగట్టేందుకు కమిటీ సభ్యులు నేషనల్ జాగ్రఫీ సొసైటీ సాయాన్ని కూడా కోరారు. తుది తీర్పు ‘ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి ఈ ఆలయంపై ఉన్న హక్కులు కొనసాగుతాయి. చివరి పాలకుడు బలరామ వర్మ సోదరుడు మార్తాండవర్మకు, ఆయన వారసులకు ఈ ఆలయంపై సర్వహక్కులు ఉంటాయి’అని స్పష్టం చేసింది.‘మరో కమిటీ ఏర్పాటయ్యే వరకు తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆలయ పాలనా వ్యవహారాలను చూసుకుంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలో సభ్యులంతా హిందువులే అయి ఉండాలి’అని స్పష్టతనిచ్చింది. భవిష్యత్‌లో ఏర్పాటుకానున్న కమిటీయే ఆరో నేళమాళిగను తెరవాలా లేదా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. -
పద్మనాభుడి ఆలయం ట్రావెన్కోర్ కుటుంబానిదే
న్యూఢిల్లీ: దేశంలోని సంపన్న దేవాలయాల్లో ఒకటైన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఈ దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్కోర్ రాజకుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ యాజమాన్య హక్కులపై దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలుకుతూ సోమవారం తుది తీర్పు వెలువరించింది. ‘చివరి పాలకుడు మృతి చెందినందున రాష్ట్ర ప్రభుత్వమే ఆలయ యాజమాన్య కమిటీని నియమించాలనడం చెల్లదు. రాజకుటుంబానికి వారసులు లేనందున ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందుతాయన్న న్యాయపరమైన నిబంధన ఈ కేసుకు వర్తించదు. ట్రావెన్కోర్ పాలకుడి నియంత్రణలో ఆలయ యాజమాన్య కమిటీ కొనసాగుతుంది’అని తెలిపింది. ‘ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ఈ ఆలయంపై ఉన్న హక్కులు కొనసాగుతాయి. చివరి పాలకుడు బలరామ వర్మ సోదరుడు మార్తాండవర్మకు, ఆయన వారసులకు ఈ ఆలయంపై సర్వహక్కులు ఉంటాయి’అని స్పష్టం చేసింది. ‘మరో కమిటీ ఏర్పాటయ్యే వరకు తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆలయ పాలనా వ్యవహారాలను చూసుకుంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలో సభ్యులంతా హిందువులే అయి ఉండాలి’అని స్పష్టతనిచ్చింది. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన చివరి పాలకుడు బలరామ వర్మ 1991లో మరణించారు. దీంతో పద్మనాభస్వామి ఆలయంపై ఆయన వారసులకు హక్కులు లేవనీ, ఆలయాన్ని, అందులోని సంపదను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, ఒక కమిటీ నేతృత్వంలో నిర్వహించాలంటూ 2011 జనవరిలో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ట్రావెన్కోర్ రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఏప్రిల్‌లో స్టే విధించింది. ఇది చారిత్రక తీర్పు.. సుప్రీంకోర్టు తాజా తీర్పు చరిత్రాత్మకమని, సుప్రీంకోర్టు నియమించిన ఆలయ కమిటీ చైర్మన్ సీవీ ఆనంద బోస్ అన్నారు. తీర్పు.. మత విషయాల్లో రాజకీయాలు, రాజకీయాల్లో మతం జోక్యం చేసుకోరాదనే సందేశాన్నిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా ప్రపంచం దృష్టికి.. పూర్వం కేరళలోని దక్షిణ భాగం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను ట్రావెన్కోర్ రాజకుటుంబం పాలించేది. ఈ పాలకుల కుటుంబదైవం అనంతపద్మనాభ స్వామి(విష్ణువు). తిరువనంతపురంలోని పురాతన అనంత పద్మనాభస్వామి ఆలయం స్థానంలో 18వ శతాబ్దంలో అద్భుతమైన నిర్మాణ కౌశలంతో కూడిన విశాలమైన ఆలయాన్ని ఈ పాలకులు నిర్మించారు. ఈ ఆలయ అంతర్భాగంలోని ఆరు నేలమాళిగల్లో వెలకట్టలేని సంపద ఉన్నట్లు ప్రతీతి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా ఈ రాజకుటుంబం నేతృత్వంలోనే ఆలయ నిర్వహణ కొనసాగింది. అయితే, అపార సంపదలున్న ఈ ఆలయ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు రావడంతో వివాదం కోర్టుదాకా వెళ్లింది. దీంతో, ఆలయ నిర్వహణను, ఆస్తులను స్వాధీనం చేసుకుని సంప్రదాయం ప్రకారం నిర్వహణ చేపట్టాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకుటుంబం సవాల్ చేయడంతో కేరళ హైకోర్టు తీర్పుపై 2011లో స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఆలయంలోని నేలమాళిగ(కల్లారం)ల్లో భద్రపరిచిన ఆభరణాలు, సంపదను లెక్కకట్టాలనీ, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలనీ, ఆలయ నిర్వహణపై ఆడిటింగ్ చేపట్టాలని ఆదేశించింది. లాయర్ గోపాల్ సుబ్రమణ్యంను అమికస్ క్యూరీగా నియమించింది. నేలమాళిగ ‘బి’లో అద్భుత శక్తులతో కూడిన అపార సంపద ఉన్నందున తెరవరాదంటూ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనిపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ మేరకు సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘా మధ్య మొదటి నేలమాళిగలోని సంపద లెక్కింపు కూడా చేపట్టారు. అనూహ్యంగా వేల కోట్ల విలువైన సంపద ఉన్నట్లు అంచనాలు వెలువడటంతో ఈ ఆలయం ప్రాభవం ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. -
పద్మనాభుడిని దర్శించుకున్న ఎంపీ కవిత
తిరువనంతపురం : కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ట్రావెన్కోర్ మహారాణి గౌరి లక్ష్మీభాయి, ప్రిన్స్ ఆదిత్యవర్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. కౌడియర్ ప్యాలెస్‌కు వెళ్లిన ఎంపీ కవితను మహారాణి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మనాభస్వామి ప్రతిమతో పాటు మహారాణి రాసిన అనంత పద్మనాభస్వామి ఆలయ చరిత్ర పుస్తకాన్ని కవితకు బహూకరించారు. అదేవిధంగా మహారాణికి ఎంపీ కవిత పోచంపల్లి శాలువాను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్, ఎస్యూటీ మెడికల్ సైన్స్ సీఈఓ గౌరీ కామాక్షి, ప్యాలెస్ ఆడిటర్ గోపాల కృష్ణన్, కాంచీపురం శంకర్ పాల్గొన్నారు. కేరళ అసెంబ్లీలో.. డైమండ్ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ కవిత ప్రసంగించనున్నారు. -
అనంతగిరిలో ప్రధాని సోదరుడు
సాక్షి, అనంతగిరి: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజిక కార్యకర్త, అలిండియా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు, ప్రహ్లాద్ దామోదర్‌దాస్ మోదీ శుక్రవారం వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 7.15 గంటలకు ఆయన ఆలయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, అర్చకులు ఆలయం తరఫున ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు శేషగిరి శర్మ ఆలయ చరిత్ర, విశిష్టత, స్థల పురాణాన్ని, స్వామివారి మహత్యాన్ని తెలియజేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. పట్టణంలో ఆధ్మాత్మిక సేవా మండలి తరఫున రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారని స్థానిక నాయకులు చెప్పడంతో ప్రహ్లాద్ మోదీ.. సాకేత్‌నగర్‌లోని టి.రాజు నివాసంలో జరుగుతున్న రుద్రాభిషేకం కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ భజనలు చేసి, ప్రత్యేక హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ప్రధాని సోదరుడు అనుకోకుండా తమ మధ్యకు రావడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆధ్యాత్మిక భావాలే రప్పించాయి... ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద మోదీ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఇంత పెద్ద సాలగ్రామ రూపంలో ఉన్న భగవంతున్ని దర్శించుకోవడం జీవితంలోనే మొదటిసారి అని.. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దైవ దర్శనం చేసుకునే భాగ్యం కల్పించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆధ్యాత్మిక సేవా మండలి కార్యక్రమంలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తాను అనంతగిరికి వచ్చానని, వికారాబాద్‌లో రుద్రాభిషేకం కొనసాగుతోందని తెలియడంతో ఇక్కడకు వచ్చానన్నారు. భక్తిభావన, ఆధ్మాత్మికతే తనను ఇక్కడికి రప్పించిందన్నారు. అనుకోకుండా భజన మధ్యలో వచ్చి మిమ్మల్ని కాస్తా ఇబ్బంది పెట్టానని అందుకు క్షమించాలని కోరారు. ప్రతిఒక్కరూ దైవచింతన, దేశభక్తి భావాలు కలిగి ఉండాలన్నారు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లాలోని ఆలయాలను సందర్శించడానికి బయలుదేరారు. ఆయన వెంట మిషన్ మోదీ అగేయిన్ పీఎం తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ల రాష్ట్రాల ఇన్చార్జ్ ప్రవీణ్‌కుమార్, వికారాబాద్ బీజేపీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి, సదానంద్‌రెడ్డి, శివరాజు, కేపీ రాజు, వివేకనంద్రెడ్డి, పోకల సతీష్, సాయికృష్ణ, నరోత్తంరెడ్డి, ప్యాట శంకర్, అనిల్, నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
పద్మనాభ స్వామి వజ్రాలు దొరికాయ్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన 26 వజ్రాల్లో 12 తిరిగి దొరికాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం వీటిని ఆలయం పరిసరాలలోనే గుర్తించింది. ఇది దొంగతనం కాదనీ, కొన్ని సంవత్సరాల క్రితం వజ్రాలను స్వామివారికి అలంకరిస్తున్నప్పుడో, మరో సమయంలోనో కనిపించకుండా పోయాయని దర్యాప్తు అధికారులు చెప్పారు. స్వామి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలలో ఈ వజ్రాలు కూడా భాగమే. వజ్రాల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందనీ, ఎంత విలువ అనేది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. 12 వజ్రాలతోపాటు గతంలో పోయిన మరికొన్ని విలువైన వస్తువులను కూడా దర్యాప్తు బృందం గుర్తించింది. మిగిలిన 14 వజ్రాల కోసం కూడా వెతికి త్వరలోనే కనుగొంటామని విచారణాధికారి వెల్లడించారు. ఎంతో విశాలంగా ఉండే ఈ ఆలయంలోని నాలుగు నేలమాళిగల్లో కొన్నేళ్ల క్రితం వందల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, పాత్రలు, ఇతర నగలు, అమూల్యమైన రాళ్లు బయటపడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడం తెలిసిందే. -
అనంత పద్మనాభస్వామి కోనేటిలో కొలువైన గుహాలయం...
ఎక్కడైనా సరే, ఆలయ ప్రాంగణంలో అందమైన కోనేరు, ఆ కోనేటిలో తామరలు తేలుతూ ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే ఈ ఆలయమే కోనేటిలో తేలియాడుతున్నట్లుగా ఉంటుంది. ఆ ఆలయం ఏమైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినదా అంటే, కానే కాదు- కనీసం పన్నెండు వందల ఏళ్ల క్రితం నాటిది. కేరళలోని కాసర్గోడ్లో ఉన్న ఈ ఆలయంలో సపరివారంగా కొలువైన వేలుపు అనంత పద్మనాభస్వామివారు. పాలకడలిలోన.. శేషతల్పముపైన శయనించే ఓ స్వామీ... అన్నట్లుగా.. అనంతుడనే సర్పంపై పద్మనాభుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి కన్నులరమోడ్చి, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉన్న భంగిమను చూస్తుంటే ఆలయంలోకి అడుగు పెట్టగానే చెప్పనలవి కాని ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందాలు మనసులను అలముకుంటాయి. స్వామివారి మూలమూర్తికి అటూ ఇటూ ఉన్న దేవేరులు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు మనస్సుకు నిండుదనాన్ని చేకూరుస్తాయి. కేరళ రాష్ట్రం కాసర్గోడ్లో గల ఈ ఆలయం అనంతమైన సంపదలకు అధినేతగా తిరువనంతపురంలో కొలువైన స్వామి వారి ఆలయానికి మూలస్థానమని ఆలయ అర్చకులు చెబుతారు. రెండెకరాల సువిశాలమైన ఈ కొలనుకు కుడి పక్కన ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక బిలం. ఆ బిలంలో నిత్యం నీరు కూడా ఉంటుంది. స్వామివారు ఈ గుహ నుంచి తిరువనంతపురంలోని ఆలయానికి రాకపోకలు సాగిస్తుంటారని స్థానికుల కథనం. స్థలపురాణం: తుళు బ్రాహ్మణ వంశానికి చెందిన దివాకర ముని వి(బి)ల్వమంగళం అనే యోగి ఇప్పుడున్న ఆలయప్రాంతంలో తపస్సు చేస్తుండేవాడట. ఆయనను పరీక్షించడానికా అన్నట్లు ఓ రోజున స్వామివారు ఒక బాలుడి రూపంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడట. బ్రహ్మాండమైన తేజస్సుతో, చూడముచ్చటగా ఉన్న ఆ బాలుడి ముఖాన్ని చూడగానే ముని సంభ్రమాశ్చర్యాలకు లోనై, ‘‘ఎవరు నాయనా నువ్వు’’ అని అడిగాడట. ఆ బాలుడు తాను ఇల్లూ వాకిలీ, అమ్మానాన్న ఎవరూ లేని అనాథనని చెప్పడంతో జాలిపడి, తన వద్దనే ఉండిపొమ్మని అడిగాడట. అప్పుడా బాలుడు తాను ఏమి చేసినా, తనను ఏమీ అనకూడదని, తనకు కోపమొస్తే క్షణం కూడా ఉండకుండా వెళ్లిపోతానని, అందుకు ఒప్పుకుంటేనే అక్కడ ఉంటానని షరతు పెట్టాడట. ముని అందుకు ఒప్పుకోవడంతో ఆయనకు సపర్యలు చేస్తూ, ఆ బాలుడు అక్కడే ఉండిపోయాడట. ఆ బాలుడు ఎన్ని తుంటరి పనులు చేసినా, ముని మౌనంగా సహించేవాడట. అయితే ఓరోజున ధ్యానంలో మునిగి ఉన్న మునికి బాలుడు తన తుంటరిపనులతో తపోభంగం కలిగించడంతో కోపంతో చేతులతో గెంటేశాడట. దాంతో ఆ బాలుడు ఒక తేజోపుంజంలా మారిపోయి, గుహలోంచి బయటకు దొర్లుకుంటూ వెళ్లిపోయాడట. చేష్టలుడిగి చూస్తుండిపోయిన మునికి ‘‘నీకెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే అనంతపద్మనాభుడు కొలువుండే ఆనంతన్ కోట్ అనే ప్రదేశానికి రావచ్చు అని అశరీరవాణి పలుకులు వినిపించాయట. తనది భ్రమేమోనని భావించిన ముని తిరిగి తపస్సులో లీనమయ్యాడట. అయితే, కన్నుమూసినా, తెరచినా, ఆ బాలుడి నగుమోమే కనుల ముందు కనిపిస్తూ ఉండడంతో ఆ బాలుడు ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ అనంత పద్మనాభస్వామివారేనని అర్థమైంది. దాంతో ముని తన తప్పిదానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ, అడుగుజాడలను బట్టి బాలుని వెతుక్కుంటూ వెళ్లాడట. ఒక కొండగుహ ముందు ఆ బాలుడి అడుగుజాడలు అదృశ్యం కావడంతో గుహలోకి వెళ్లాడట. ఓ చోట గుహ అంతమై, సముద్రానికి దారితీసింది. సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లిన మునిని ఓ పెద్దకెరటం లాక్కుపోయి, ఒడ్డుకు విసిరేసింది. కళ్లు తెరిచి చూసేసరికి అక్కడ ఓ అడవి కనిపించింది. దూరాన ఉన్న ఆ అడవిలో ఆ బాలుడు కనిపించినట్లే క నిపించి, అంతలోనే మాయం అయ్యాడట. అతణ్ణి అనుసరిస్తూ వెళ్లిన మునికి ఆ బాలుడు ఒక పెద్ద విప్పచెట్టు మీదికి ఎక్కడం కనిపించి, చెట్టు వద్దకు చేరాడట. ఇంతలో ఆ వృక్షం పెద్ద శబ్దం చే స్తూ కిందికి ఒరిగిపోయి, చూస్తుండగానే వేయిపడగల అనంతుడి రూపాన్ని సంతరించుకుంది. ఆ సర్పంపై ఆసీనుడైన అనంతపద్మనాభస్వామి చిరునవ్వుతో మునిని ఆశీర్వదించాడట. అక్కడే స్వామి శ్రీదేవి, భూదేవితో కలసి శిలావిగ్రహంగా మారిపోయాడని స్థలపురాణం చెబుతోంది. ఇదే కథ కొద్దిపాటి భేదాలతో కనిపిస్తుంది. శ్రీకోవిల్ అని పిలుచుకునే ఈ ఆలయం నమస్కార మండపం, తిటప్పల్లి, ముఖమండపం అని మూడు భాగాలుగా ఉంటుంది. జలదుర్గామాత విగ్రహం ఆలయంలోనికి స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. నమస్కార మండపం నుంచి ఆలయంలోనికి దారి ఉంటుంది. కోనేటికి మొసలి సంరక్షణ: స్వామి ఆలయం ఉన్న కోనేటినీరు కొబ్బరినీళ్లలా ఎంతో తియ్యగా ఉంటాయి. స్వచ్ఛంగా, తళతళలాడుతూ కనిపించే ఆ కోనేటిలో అతిపెద్ద మొసలి ఒకటి సంచరిస్తూ ఉంటుంది. దాని వయసు కనీసం నాలుగు వందల సంవత్సరాలకు పైనే ఉండి ఉంటుందని అంచనా. పూర్తి శాకాహారి అయిన ఈ మొసలి ఎవరినీ ఏమీ చేయదు. రోజూ కొలనులోంచి వచ్చి స్వామివారిని సేవించుకుంటూ ఉంటుంది. పూజారులు కూడా దీనిని భక్తి ప్రపత్తులతో పూజిస్తుంటారు. స్వామివారిని కుల, మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చు. విశేషం ఏమిటంటే స్వామివారు కానీ, ఆయన దేవేరులు కానీ, ఎటువంటి లోహమూ లేదా రాతితో నిర్మించిన మూర్తులు కాదు... కాడు శర్కర యోగం అనే 108 రకాల ఔషధ వృక్షాల కలబోతతో నిర్మించిన వి. దాదాపు నలభై ఐదు ఏళ్ల క్రితం ఈ దారు (కలప) అంతా శిథిలావస్థకు చేరడంతో, కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ విగ్రహాలను పంచలోహాలతో తాపడం వేయించారట. ఆలయ ప్రాకారం గోడల మీద కలపతో చెక్కిన దశావతారాల దారు శిల్పాలు అత్యద్భుతంగా ఉండి చూపులను కట్టిపడేస్తాయి. ఇక్కడ ఇంకా ఏమేం చూడవచ్చు? పర్యాటక ప్రదేశాలను చూడాలని కోరుకునే యాత్రికులకు కాసర్గోడ్ పర్యటన అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇక్కడకు దగ్గరలోని కుంబాల రాజకోటలో సుప్రసిద్ధమైన గోపాలకృష్ణుని ఆలయం ఉంది. దగ్గరలోనే మల్లికార్జున ఆలయం, ట్రిక్కనాడ్, పాండ్యన్ కల్లు ఆలయం, అజనూర్‌లో భద్రకాళి కొలువైన మాడియన్ కులోం ఆలయం, బేళా చర్చ్, శంకరాచార్యులవారు నెలకొల్పిన ఎడినీర్ మఠం, తులూర్ వనంలోగల కేకుళోమ్ ఆలయం, నెల్లికున్ను మసీదు, మాధుర్‌లోని శ్రీమద్ అనంతేశ్వర వినాయకాలయం, మధువాహినీ నదితోపాటు ఎన్నో బీచ్‌లు, వేసవి విడుదులు రకరకాల పర్యాటక ప్రదేశాలున్నాయి. ఎలా వెళ్లాలంటే..? అనంతపురా కొలనుగుడికి వెళ్లడానికి దగ్గరలోని ప్రధాన రైల్వే స్టేషన్ కాసర్గోడ్ స్టేషన్. ఇక్కడి నుంచి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్టేషన్లో రైలు దిగగానే బస్సులు, ఆటోలు ఉంటాయి. అలాగే కుంబాల స్టేషన్ కూడా ఉంది. మంగుళూరు ఏర్పోర్టుకు వెళ్తే అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి రైలులోనూ, బస్సులోనూ చేరుకోవచ్చు. అలాగే కోజికోడ్, కరిపూర్ ఏర్పోర్ట్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. - డి.వి.ఆర్.భాస్కర్ -
769 బంగారు కుండలు మాయం!
అనంత పద్మనాభ స్వామి ఖజానాపై సుప్రీంకు రాయ్ నివేదిక న్యూఢిల్లీ: కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ ఖజానా నుంచి 769 బంగారు కుండలు మాయమైనట్లు సుప్రీంకోర్టుకు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్‌రాయ్ నివేదిక సమర్పించారు. ఈ మొత్తం బంగారం విలువ రూ. 186 కోట్లని, దాన్ని దొంగిలించి ఉండొచ్చన్నారు. ‘సీ, ఈ నేలమాళిగల్ని తెరచి ఆగస్టు 2007లో 1022 వస్తులతో పాటు 397 బంగారు కుండల్ని ఫొటోలు తీశారు. ఆ కుండలపై వెయ్యి నుంచి సంఖ్యలుండగా... ఒకదానిపై 1988 సంఖ్యను గుర్తించారు. అంటే మొత్తం ఖజానాలో 1988 బంగారు కుండలుండాలి. రాజభవనంలో పనుల కోసం 822 కుండల బంగారాన్ని కరిగిస్తే ఇంకా 1,166 కుండలు ఉండాలి. కానీ 397 మాత్రమే దొరి కాయి. మాయమైన 769 కుండల్లో రూ. 186 కోట్ల విలువైన 776 కిలోల బంగారముండవచ్చు. 35 కిలోలు బరువైన రూ.14 లక్షల వెండి కడ్డీ కూడా మాయమైంది. 1970లో అమ్మి న 2.11 ఎకరాల భూమికి సంబంధించి రికార్డులు లేవు. హుండీలో వేసిన 572.86 గ్రా. బంగారం, 2589 గ్రా. వెండి రిజిస్టర్లో నమోదు చేయలేదు’ అని నివేదికలో పేర్కొన్నారు. -
అనంతుని కష్టాలు
శిథిలావస్థలో అనంత పద్మనాభుని ఆలయం దూప, దీప, నైవేద్యాలకు నోచుకోని వైనం వేలాది ఎకరాల ఆస్తులు... పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో ఒకప్పుడు విజయనగర సంస్థానంలో దివ్యంగా వెలుగొందింది. అనంతపద్మనాభుని ఆలయం. దీనికి అనుబంధంగా ఉన్న కుంతీ మాధవ స్వామి ఆలయం పద్మనాభ యుద్ధ కార్య క్షేత్రానికి సాక్షిభూతంగా నిలుస్తుంది. ఎంతో ఘన చరిత్ర గలిగిన ఈ ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. చివరకు దూప, దీప నైవేద్యాలకు వేరొక ఆలయంపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. - పద్మనాభం ఆస్తిపాస్తులు పద్మనాభస్వామికి పూర్వం విజయనగర సంస్థానాదీశులు 3,514 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూములు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో పూర్వం అనంతపద్మనాభస్వామి ప్రాంగణం నిత్యం ఆధ్యాత్మిక వాతావరణంతో వర్ధిల్లేది. ప్రస్తుత పరిస్థితి ఆ భూములన్నీ రైతుల సాగులో ఉన్నాయి. వీటికి సంబంధించి కనీస శిస్తులు వసూలు కావడం లేదు. 1961 వరకు కాస్తో కూస్తో రైతులు శిస్తులు చెల్లించినప్పటికీ ఆ తర్వాత నుంచి పూర్తిగా వసూలు కావడం లేదు. నలుగుతున్న వివాదం 1961 నుంచి శిస్తు బ కాయిలను చెల్లించాలని దేవాదాయ శాఖ అధికారులు గతంలో ఆదేశాలు జారీ చేశారు. వేలాది రూపాయిలు బకాయిలు ఒకేసారి చెల్లించలేమని రైతులు చేతులేత్తేశారు. ఈ భూములకు సంబంధించి సాగు హక్కులను రైతులకు ఇస్తూ పాస్ పుస్తకాలు జారీ చేశారు. టైటిల్ డీడ్లు మాత్రం అనంతపద్మనాభస్వామి పేరునే ఉన్నాయి. గతంలో దేవాదాయ శాఖ అధికారులు ఈ భూములను వేలం పాట వేయడానికి పూనుకున్నారు. దీనికి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా పాట నిలిచిపోయింది. అభివృద్ధి శూన్యం ఆలయం నిర్మించినప్పటి నుంచి నేటి వరకు క్షేత్ర అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దూప, దీప నైవేద్యాలకు కూడా ఆదాయం లే ని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అనంతపద్మనాభస్వామి ఆల యం నుంచి సింహాచలం నృసింహస్వామి, పొట్నూరు కొదండ రామస్వామి, పుష్పగిరి వేణుగోపాలస్వామి, విజయనగరం పైడితల్లమ్మ, కురపల్లి శివాలయం వంటి 13 ఆలయాలకు దూప, దీప నైవేద్యాలకు పంపించేవారు. ఎటువంటి ఆదాయం లేకపోవడంతో 1982 నుంచి సింహాచలం దేవస్థానం నుంచి అనంత పద్మనాభ స్వామికి అవసరమైన దూప, దీప, నైవేద్యానికి సంబంధించి దినుసులు పంపుతున్నారు. తగ్గిన వైభవం నిధుల కొరత ఏర్పడడంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించలేదు. కార్తీక మాసంలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నా.. అనంతుని జయంతి, కల్యాణాలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. కనుమరుగైన బ్రహ్మోత్సవాలు కార్తీమాసంలో గతంలో బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు నిర్వహించేవారు. అనంతుని పుష్కరణిలో తెప్పోత్సవాన్ని వైభవంగా జరిపారు. సుమారు 45 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలను నిర్వహించడంలేదు. ఉత్సవాలు కనుమరుగవడంతో పుష్కరణి నిరాదరణకు గురైంది. ఆరు ఎకరాల్లోని పూలతోట పూర్తిగా ఆక్రమణకు పాలైంది. ఘన చరిత్ర గిరిపైన ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని 14వ శతాబ్దంలోను, గిరి దిగువన ఉన్న కుంతీ మాధవస్వామి ఆలయాన్ని 18వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర సంస్థాన దీశులు నిర్మించారు. 1723లో దివాన్లు అయిన పెనుమత్స జగన్నాథరాజు, విజయరామరాజు, సాహెబ్ ఆధ్యర్యంలో కుంతీ మాధవస్వామి ఆలయ బేడా నిర్మించినట్టు శిలా శాసనం ఇప్పటికీ ఉంది. 1793 జులై 10న బ్రిటిష్ వారికి, విజయనగరం సంస్థానదీశుడైన రెండో విజయరామరాజుకు జరిగిన పద్మనాభం యుద్ధానికి సంబంధించి ముందస్తు వ్యూహం కుంతీ మాధవస్వామి ఆలయంలోనే జరిగింది. అనందపద్మనాభస్వామి ఆలయాలు దేశంలో రెండు చోట్ల ఉండగా అందులో ఇది ఒక్కటి. నిర్మాణాలు శిథిలం ఆలయ ప్రాంగణంలోని నిర్మాణాలు శిథిలావస్ధకు చేరుకున్నా వీటి మరమ్మతులు గురించి పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. కుంతీ మాధవ స్వామి ఆలయం లోపల భాగం పెచ్చులూడిపోయింది. బోగ మండపం వర్షాలకు కారిపోతుంది. బేడా పై భాగం పెచ్చులూడిపోయి బీటలు వారింది. రథశాల, వంట, వాహన, దినుసుల శాలలు పూర్తిగా శిథిలమయ్యాయి. దీని వల్ల గరుడ వాహనాన్ని కుంతీ మాధవ స్వామి ఆలయంలో ఉంచాల్సి వస్తోంది. గిరిపైన ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ ధ్వజ స్తంభం 15 ఏళ్ల క్రితం, కుంతీ మాధవస్వామి ఆలయ ధ్వజ స్తంభం హుద్‌హుద్ తుపాన్‌కు శిథిలమయ్యాయి. వీటిని ఏప్రిల్ 13న పున ఃప్రతిష్ఠించారు. కానీ ఇత్తడి తొడుగు అమర్చకపోవడంతో వెలవెలబోతున్నాయి. -
మరోసారి 'అనంత పద్మనాభస్వామి' సంపద తనిఖీ!
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సంపద మరోసారి వార్తల్లోకెక్కింది. ఆలయ నేల మాళిగలో లభించిన లక్ష కోట్లకుపైగా విలువైన సంపద లెక్కలను రెండోసారి తనిఖీ చేయాల్సిందిగా మాజీ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వినోద్ రాయ్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తూతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. గతంలో తాను చేసిన ఆడిట్ పై అసంతృప్తి వ్యక్తంచేసిన వినోద్ రాయి.. అవకాశం ఉంటే మరోసారి తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న నేపథ్యంలో కోర్టు ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించింది. కాగా, ఆలయంలో లభించిన లక్ష కోట్లకుపైగా విలువైన సంపదను కొదరు పెద్దలు రహస్యంగా కొల్లగొడుతున్నారనే ఆరోపణలు తరచూ వినవచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన మాజీ సొలిసిటర్ జనరల్, అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం 2014, ఏప్రిల్ 18న కోర్టుకు సమర్పించిన నివేదిక కూడా ఆ అనుమానాలకు బలం చేకూర్చింది. ఆలయ నిర్వహణ, సంపద పరిరక్షణలో తీవ్ర లోపాలను గుర్తించినట్లు సుబ్రమణియన్ నివేదికలో తేటతెల్లమైంది. గతంలో నేలమాళిగలోని సంపద మదింపు సమయంలో కల్లారా-బీ అనే గదిని తెరవనివ్వకుండా ట్రస్టీలు అడ్డుకున్నప్పటికీ దాన్ని కొనేళ్ల కిందట తెరిచినట్లుగా ప్రత్యక్ష సాక్షుల ఆధారాలు ఉన్నాయని నివేదికలో పొందుపర్చారు. నేలమాళిగలోని సంపదను ఉన్నత స్థాయి వ్యక్తులు వ్యవస్థీకృతంగా వెలికితీసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ వ్యవహారంపై చాలా ఉదాహరణలను చూపారు. బంగారు పూతపూసే యంత్రం ఇటీవల ఆలయం ఆవరణలో లభించిందని పేర్కొన్నారు. దీంతో అసలైన బంగారు నగలను దొంగిలించి, వాటి స్థానంలో న కిలీ నగలను ఉంచి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ సంపదపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాజీ డెరైక్టర్ వినోద్ రాయ్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో ఆడిటింగ్ నిర్వహించాలని సిఫార్సు చేశారు. సుబ్రమణియం కమిటీ సిఫార్సుతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాటి కాగ్ వినోద్ రాయ్ సంపద లెక్కలపై ఆడిట్ జరిపారు. ఇది జరిగి ఏడాదిన్నర పూర్తవుతుండగా ఇప్పుడు మరోసారి ఆడిట్ చేయాలంటూ సుప్రీం ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అన్యాక్రాంతం ‘అనంతం’
వికారాబాద్: వికారాబాద్ సమీపంలో..ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన అనంతపద్మనాభ స్వామివారి ఆలయంలో అప్పట్లో ధూప, దీప నైవేద్యాల కోసం పలువురు భక్తులు కానుకల రూపంలో భూములను అందజేసేవారు. అనంతపద్మనాభస్వామి పేరిట దస్తావేజులు రాసి ఆలయ అర్చకులకు అందచేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో స్వామివారికి అందచేసిన భూములు సుమారు 1500 ఎకరాల వరకు ఉండేదని భక్తులు చెబుతున్నారు. అవి ప్రస్తుతం 140 ఎకరాల వరకే ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు మాత్రమే తమ వద్ద ఉన్నాయని అంటున్నారు. 2001లో దే వాదాయ శాఖ పరిధిలోకి.. అనంతపద్మనాభస్వామి ఆలయం 2001లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిందని.. అప్పటి వరకు స్వామి వారికి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయం తమకు తెలియదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భూములకు సంబంధించిన రికార్డులు ఎవరూ ఇవ్వలేదని.. స్వామివారికి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయనే విషయాన్ని కొన్నింటిని ఆలయ అర్చకులు తమకు తెలిపితే.. మరికొన్ని తామే భక్తుల ద్వారా తెలుసుకున్నామని వారు పేర్కొంటున్నారు. 2001 కంటే ముందు ఆయా ప్రాంతాల్లోని స్వామివారి మాన్యాలను సాగు చేసుకుంటున్న రైతులు వారు పండించిన పంటలో కొంత భాగాన్ని ఆలయ అర్చకులకు అప్పగించేవారు. భూముల వివరాలు కొంత వరకే తమకు తెలుసని తమ తాతలు, తండ్రులకు పూర్తి స్థాయిలో తెలిసి ఉండవచ్చు. కానీ తమకు తెలిసినవాటి వివరాలు దేవాదాయ శాఖ అధికారులకు తెలియచేసినట్లు ఆలయ ధర్మకర్త ఫౌండర్ సీతారామాచార్యులు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూములు స్వాధీనం.. స్వామివారికి మహబూబ్‌నగర్ జిల్లా కేశవపూర్‌లో ఆస్తులు ఉన్నట్లు ఆ జిల్లాకు చెందిన ఓ భక్తుడు ఆలయ అధికారులకు అప్పట్లో సమాచారం ఇచ్చారు. ఈ మేరకు స్పందించిన ఆలయ అధికారులు మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు వెళ్లి స్వామివారి ఆస్తులు సదరు గ్రామంలో ఉన్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించి రికార్డులను పరిశీలించారు. ఆ భూములను స్వామివారికి పూర్తి స్థాయిలో కేటాయిస్తూ అనంత పద్మనాభస్వామి పేరిట దస్తావేజులు తయరు చేసి ఆలయ అధికారులకు అందచేశారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం కేశవపూర్లోని సర్వే నంబర్ 105లోని 8.03 ఎకరాల భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్నట్లు దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ చెప్పారు. కొంత కాలంగా కబ్జాలో ఉన్న వారే ఆ భూములను మూడేళ్లపాటు కౌలుకు తీసుకొని డబ్బులు చెల్లించారు. కాగా.. స్వామివారికి చెందిన మరికొన్ని ఆస్తులు ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని షాబాద్, ధారూరు మండలం అల్లీపూర్లో ఉన్నట్లు ఆలయ అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. వీటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అనంతపద్మనాభుడికి జిల్లాలోనే కాకుండా మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు భక్తులు చెబుతుండడం గమనార్హం. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టి సారిస్తే మరిన్ని ఆస్తులు వెలికి వచ్చే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. -
మ్యూజియంలో అనంతుని నిధి నిక్షేపాలు
తిరువనంతపురం : అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో కనుగొన్న నిధినిక్షేపాలను సుప్రీంకోర్టు అనుమతిస్తే మ్యూజియంలో ప్రదర్శించడానికి కేరళ ప్రభుత్వం సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. ఈ తరహా నిధులు ప్రపంచంలో మరెక్కడా లేవని, ట్రావెన్కోర్ మాజీ రాజకుటుంబం ఈ నిధులను ఇప్పటివరకూ కాపాడటం వారి నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసిన రాజకుటుంబాన్ని విమర్శించటం తగదన్నారు. ఆలయ సందపను అక్రమంగా తరలిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రతినిధి సమర్పించిన నివేదిక తమకు అందలేదని, ఈ కేసు ఆగస్టు 6న కోర్టు ముందుకు విచారణకు రానుందని సీఎం తెలిపారు.