పద్మనాభుడి సేవలో ప్రధాని సోదరుడు

PM Narendra Modi Brother Prahlad Modi Visit Ananthapadmanabha Temple - Sakshi

సాక్షి, అనంతగిరి: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజిక కార్యకర్త, అలిండియా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు, ప్రహ్లాద్‌ దామోదర్‌దాస్‌ మోదీ శుక్రవారం వికారాబాద్‌ పట్టణానికి సమీపంలోని అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 7.15 గంటలకు ఆయన ఆలయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, అర్చకులు ఆలయం తరఫున ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు శేషగిరి శర్మ ఆలయ చరిత్ర, విశిష్టత, స్థల పురాణాన్ని, స్వామివారి మహత్యాన్ని తెలియజేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. పట్టణంలో ఆధ్మాత్మిక సేవా మండలి తరఫున రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారని స్థానిక నాయకులు చెప్పడంతో ప్రహ్లాద్‌ మోదీ.. సాకేత్‌నగర్‌లోని టి.రాజు నివాసంలో జరుగుతున్న రుద్రాభిషేకం కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ భజనలు చేసి, ప్రత్యేక హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ప్రధాని సోదరుడు అనుకోకుండా తమ మధ్యకు రావడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
 
ఆధ్యాత్మిక భావాలే రప్పించాయి...
ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద మోదీ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఇంత పెద్ద సాలగ్రామ రూపంలో ఉన్న భగవంతున్ని దర్శించుకోవడం జీవితంలోనే మొదటిసారి అని.. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దైవ దర్శనం చేసుకునే భాగ్యం కల్పించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆధ్యాత్మిక సేవా మండలి కార్యక్రమంలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తాను అనంతగిరికి వచ్చానని, వికారాబాద్‌లో రుద్రాభిషేకం కొనసాగుతోందని తెలియడంతో ఇక్కడకు వచ్చానన్నారు.

భక్తిభావన, ఆధ్మాత్మికతే తనను ఇక్కడికి రప్పించిందన్నారు. అనుకోకుండా భజన మధ్యలో వచ్చి మిమ్మల్ని కాస్తా ఇబ్బంది పెట్టానని అందుకు క్షమించాలని కోరారు. ప్రతిఒక్కరూ దైవచింతన, దేశభక్తి భావాలు కలిగి ఉండాలన్నారు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లాలోని ఆలయాలను సందర్శించడానికి బయలుదేరారు. ఆయన వెంట మిషన్‌ మోదీ అగేయిన్‌ పీఎం తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ల రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌కుమార్, వికారాబాద్‌ బీజేపీ సీనియర్‌ నాయకులు మాధవరెడ్డి, సదానంద్‌రెడ్డి, శివరాజు, కేపీ రాజు, వివేకనంద్‌రెడ్డి, పోకల సతీష్, సాయికృష్ణ, నరోత్తంరెడ్డి, ప్యాట శంకర్, అనిల్, నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top