
కేరళలోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయంలో తక్కువ మొత్తంలో సుమారు 100 గ్రాముల మేర బంగారం చోరీకి గురైనట్లు వార్తలు వచ్చాయి. బంగారం పూత నిమిత్తం ఆలయంలో ఉంచిన సుమారు 12 పవనాల (కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో బంగారాన్ని పవనాల్లో కొలుస్తారు. ఒక్కో పవనం 8 గ్రాములకు సమానం) బంగారం కనిపించకుండా పోయిందని ఆయా వార్తా నివేదికల్లో పేర్కొన్నారు.
ఆ బంగారాన్ని ఎత్తుకెళ్లారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పినట్లుగా ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక పేర్కొంది. చివరిసారిగా రెండు రోజుల క్రితం గోల్డ్ ప్లేటింగ్ పనులు జరిగాయి. ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని లాకర్లో భద్రపరిచి మళ్లీ పని నిమిత్తం బంగారాన్ని బయటకు తీసుకెళ్లగా సుమారు 12 పవనాల పసిడి మాయమైంది. ఈ మేరకు ఫిర్యాదు నమోదైనట్లు ఫోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల భద్రతా లోపం ఉందని, ఈ చోరీ వెనుక ఆలయంలోని వ్యక్తుల హస్తం ఉండొచ్చని మరికొన్ని వార్తా సంస్థలు నివేదించాయి.
గతంలో కూడా ఈ ఆలయంలో బంగారం చోరీకి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. 2015లో సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక ఆడిట్ రిపోర్టులో, ఆలయంలోని నిధుల నుండి 266 కిలోల బంగారం కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఈ బంగారం ఆలయ అలంకరణ కోసం బయటకు తీసినప్పుడు మాయమైనట్లు రిపోర్టు పేర్కొంది. అయితే ఎవరినీ నేరంగా బాధ్యులుగా నిర్ధారించలేదు.
2017లో ఆలయంలో రూ. 189 కోట్ల విలువైన బంగారం, ఎనిమిది పురాతన వజ్రాలు కనిపించకుండా పోయినట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. ఈ ఘటనలపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇక 2024 అక్టోబరులో ఆలయంలో ప్రసాదం కోసం ఉపయోగించే ఒక ఇత్తడి పాత్ర మాయమైనట్లు వార్తలు వచ్చాయి.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ ఆలయ సంపద రూ. 1.5 లక్షల కోట్ల విలువైనదిగా అంచనా. 2011లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నేలమాళిగల్లోని ఆరు గదులలో ఐదింటిని తెరిచారు. వీటిలో అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాలు బయటపడ్డాయి. అయితే, ఒక గదిని మాత్రం ఇప్పటివరకు తెరవలేదు. దీని వెనుక సాంకేతిక, మతపరమైన కారణాలు ఉన్నాయని చెబుతారు.