మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా: మల్లోజుల | Mallujola Venugopal Sent Message To Maoists | Sakshi
Sakshi News home page

మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా: మల్లోజుల

Nov 19 2025 11:04 AM | Updated on Nov 19 2025 12:11 PM

Mallujola Venugopal Sent Message To Maoists

సాక్షి, హైదరాబాద్‌: ఆపరేషన్‌ కగార్‌ కారణంగా మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఇప్పటికే పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తాజాగా మల్లోజుల వేణుగోపాల్‌ ‍స్పందిస్తూ మావోయిస్టులు ఆయుధాలు వీడాలని వీడియో సందేశం పంపిచారు. ఈ సందర్బంగా మల్లోజుల.. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు చనిపోతున్నారు. ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయి. దేశంలో పరిస్థితులు మారాయి.. మనం కూడా మారాలి. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నాను. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తను ఫోన్‌ చేయాలన్నారు. ఈ సందర్భంగా తన ఫోన్‌ 88560 38533​ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్‌ కగార్‌’తో కకావికలమైన మావోయిస్టు పార్టీకి చివరి ఆశ కూడా ఆవిరైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మా­డ్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు ఉద్య­మం వెన్నెముక విరిగిపోయింది. పార్టీని దశాబ్దాలపాటు నడిపిన గణపతి పక్కకు తప్పుకోవడం.. అనంతరం ఉద్యమాన్ని దూకుడుగా నడిపించిన పార్టీ ప్రధాన కార్యదర్శి, సుప్రీం కమాండర్‌ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఇక మిగిలిన ఒకే ఒక ఆశా కిరణం హిడ్మానే. నంబాల కేశవరావు అనంతరం తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినా, పార్టీని దూకుడుగా నడిపించే క్రియాశీల బాధ్యత హిడ్మాకే అప్పగించారు. మిలటరీ ఆపరేషన్స్‌లో దిట్ట కావడంతోపాటు గిరిజనుడైన అత­నికి దండకారణ్యంపై పూర్తి పట్టుంది. స్థానిక గిరిజనుల్లో విశేష ఆదరణ ఉంది.

బతికుంటే తదుపరి సుప్రీం కమాండరే..  
ఆపరేషన్‌ కగార్‌తో తుడిచి పెట్టుకుపోతున్న మావోయిస్టు పార్టీ హిడ్మాపైనే భవిష్యత్‌ ఆశలు పె­ట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఒడిశా, మహారాష్ట్రల్లో­ని గిరిజన ప్రాంతాలు ఆయనకు కొట్టినపిండి. మిలటరీ ఆపరేషన్స్‌ నిర్వహణపై నిర్ణయం, వ్యూ­హం, కార్యాచరణ అంతా హిడ్మానే చూసు­కుంటా­ర­ని చెబుతున్నారు. అంటే పార్టీ తర్వాత సుప్రీం క­మాండర్‌ హిడ్మానేనని మావోయిస్టు పార్టీ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. మావోయిస్టు పార్టీకి గణపతి, నంబాల కేశవరావు, దేవ్‌ జీ వరుసగా ముగ్గురు తెలు­గు వారు ప్రధాన కార్యదర్శులు అయ్యారు. తర్వాత హిడ్మా పార్టీ సుప్రీం కమాండర్‌ అయ్యుంటే.. తొలి­సారి తెలుగేతర మావోయిస్టు, అందులోనూ గిరిజనుడు మొదటిసారి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యేవాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు హి­డ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ ఇక పూర్తిగా కొడిగట్టడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement