క్రాప్‌@రూఫ్‌..! 'ఆరోగ్యం' సేఫ్‌.. | Top Roof Gardening Culture Trend in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటి పైకప్పుపై విదేశీ కూరగాయలు, పండ్లు..

Nov 19 2025 11:50 AM | Updated on Nov 19 2025 12:12 PM

Top Roof Gardening Culture Trend in Hyderabad

బ్రెజిల్‌ జబోటిక్‌ కబో, జపాన్‌ మియాజాకీ, యూఎస్‌ మ్యాంగోస్‌ టీన్‌.. ఇలా వివిధ దేశాల్లో లభించే అరుదైన పూలు, పండ్లు, కూరగాయలు ఇప్పుడు సిటీ రూఫ్‌గార్డెన్‌లో కాస్తున్నాయి. దేశీయ కూరగాయలు, ఆకుకూరలు, పూలు, వివిధ రకాల పండ్ల చెట్లతో పాటు నగరానికి చెందిన రూఫ్‌ గార్డెన్‌ ప్రియులు  పలు రకాల విదేశీ మొక్కలనూ పెంచుతున్నారు. కొద్దిగా ఖరీదు ఎక్కువే అయినా విదేశీ వెరైటీ ఎగ్జోటిక్‌ మొక్కలను ఇంటి పై కప్పులపై పెంచుతూ తమ  అభిరుచిని చాటుతూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అనేక రకాల పండ్లు మార్కెట్లో లభిస్తున్నప్పటికీ సహజసిద్ధమైన వాతావరణంలో పెరిగే ఆర్గానిక్‌ పండ్లపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఓ వైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మరోవైపు సొంత సాగులో కాసిన పండ్లను ఆరగించేందుకు నగరవాసులు ఆసక్తికనబరుస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఈ తరహా రూఫ్‌ గార్డెన్స్‌ భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు. 

జపాన్‌లో లభించే మియాజాకీ మామిడి పండ్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. రూ.లక్షల్లో ఖరీదు చేసే ఈ ప్రత్యేక మామిడిని నగరంలో పెంచుతుండడం విశేషం. అలాగే అత్యంత మధురమైన అమెరికాకు చెందిన మ్యాంగోస్‌టీన్, నేరేడు పండ్ల తరహాలో ఉండే బ్రెజిల్‌ జబోటిక్‌ కబో ఔషధ విలువలు కలిగిన ఫలాలనూ పెంచుతున్నారు.. అంతేకాదు సింధూర్‌ ప్లాంట్, శాఫ్రాన్, వెనీలా, కాఫీ, బాస్మతి, లవంగ, ఇలాచీ, మెక్సికన్‌ కొరియాండర్, షాపూ జింజర్, యాపిల్, కోకో ప్లమ్, లాక్యూట్, యూఎస్‌ బ్లూబెర్రీ, మెజూల్‌ ఖర్జూర వంటి వెరైటీ మొక్కలకు హైదరాబాద్‌ రూఫ్‌గార్డెన్స్‌ కేరాఫ్‌గా మారాయి. తియ్యటి నిమ్మ ఫలాలతో పాటు సుమారు 37 రకాల వెరైటీ మిరపను తమ ఇంటిపై పండిస్తున్నట్లు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మౌనికసమ్‌రెడ్డి చెబుతున్నారు. అలాగే అవకాడో, తేనె కూడా తమ ఇంటిపంటలో భాగమైనట్లు పేర్కొన్నారు.  

మూడేళ్లుగా యాపిల్స్‌ పండిస్తున్నా.. 
జపాన్‌కు చెందిన మియావాకీ మామిడిలో చాలా వెరైటీలున్నాయి. అలాంటి వాటిని మేము ఇంటిపైన పండిస్తున్నాం. మూడేళ్లుగా యాపిల్స్‌ పండుతున్నాయి. ఇవి కొద్దిగా చిన్న సైజులో ఉన్నప్పటికీ రుచిలో అద్భుతం. అవకాడో, నోనీ పండ్ల మొక్కలు కూడా పెంచుతున్నాం. సాధారణ మొక్కల కంటే వీటి ఖరీదు ఎక్కువ. 

కొన్ని మొక్కలు రూ.5000 నుంచి రూ.10,000 వరకూ కూడా ఉంటాయి. నిర్వహణ మాత్రం దేశీయ మొక్కల తరహాలోనే ఉంటుంది. కుండీల్లో మట్టి, సేంద్రీయ ఎరువులు వేసి పండిస్తున్నాం. అలాగే రెండు బాక్సుల తేనె కూడా పండిస్తున్నాం. ప్రతి నెలా పావు కిలో తేనె లభిస్తుంది. ఒక్కో బాక్సు రూ.5వేల చొప్పున కొనుగోలు చేశాం. 
– మౌనికసమ్‌రెడ్డి, దిల్‌సుఖ్‌నగర్‌ 

పదివేల మంది సభ్యులతో గ్రూప్‌.. 
ఉద్యానవన శాఖ అంచనాల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 15 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో రూఫ్, వరండాలు, తదితర స్థలాల్లో ఇంటిపంటలను పండిస్తున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా పోషక పదార్థాలు ఇళ్ల పై కప్పులపైనే లభిస్తున్నాయి. ‘సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌’ వాట్సాప్‌ గ్రూపులోనే సుమారు 10 వేల మందికి పైగా సభ్యులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 

వివిధ ప్రాంతాల్లో పెంచే వెరైటీ మొక్కలపై విస్తృత అవగాహన కార్యక్రమాలను ‘సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్‌’ (సీటీజీ) నిర్వహిస్తోంది. సభ్యుల మధ్య మొక్కల మారి్పడి కూడా కొనసాగుతోంది. దీంతో పలువురు తమ ఆసక్తి, అభిరుచికి అనుగుణమైన వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు సాగు చేస్తున్నారు. 

సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌ స్ఫూర్తితో.. 
సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌ గ్రూపులో ఉండడం వల్ల అనేక కొత్త విషయాలు, కొత్త మొక్కల వివరాలు తెలిశాయి. కరోనా సమయంలో ఈ గ్రూపుతో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి అనేక రకాల వెరైటీలను ఇంటివద్దనే పండిస్తున్నాం. రకరకాల మునగ, వివిధ రకాల పైనాపిల్, బ్లాక్‌ సపోట, రాడిష్‌", బ్రోకలి, బ్లోచార్, జుక్నీ, పర్పుల్‌ క్యాబేజీ, లెట్యూర్స్‌ వంటి కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. ఇంటి అవసరాల కోసం బయట మార్కెట్‌లో కొనుగోలు చేయడం పూర్తిగా మానేశాం. 
– కుసుమ, దిల్‌సుఖ్‌నగర్‌  

జబోటిక్‌ కబో ఖరీదు రూ.10 వేలు.. 
ఈ బ్రెజిల్‌ మొక్కను మూడేళ్లుగా పెంచుతున్నాం. ఇప్పటి వరకూ చాలా పండ్లు పండాయి. ఎగ్జోటిక్‌ ప్లాంట్స్‌ నర్సరీల్లో ఈ మొక్కలు లభిస్తాయి. ఒక్కో మొక్క ధర రూ.10 వేలు. ఖరీదు ఎక్కువే అయినా ఫలాల్లో చక్కటి ఔషధ గుణాలుంటాయని కొనుగోలు చేశాం. అలాగే అమెరికాకు చెందిన వెరైటీ మామిడి యూఎస్‌ మ్యాంగోస్‌టీన్‌ కూడా ఇంటి పై కప్పుపైన పెరుగుతోంది. 

దీంతో పాటు బ్లాక్‌ సపోటా, కేవలం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోనే లభించే పంపరపనస వంటి మొక్కలు కూడా కోతకొచ్చాయి. ఇంటిపైన 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం. రామ, లక్ష్మణ, సీతా ఫలాలతో పాటు హనుమాన్‌ ఫలాల మొక్కలు కూడా వచ్చాయి.     – పాపాయమ్మ, అమీర్‌పేట్‌ (ఎల్లారెడ్డిగూడ)  

(చదవండి: అమ్మాయిలూ... వింటున్నారా..?!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement