
చిన్నారులకు ఆరోగ్యకరమైన అలవాటు
‘ఒకరికి ఒక మొక్క’తో సత్ఫలితాలు
బాధ్యత, క్రమశిక్షణ అలవడతాయి
ఓపిక, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి
దయ, ఓర్పు, బాధ్యత వంటి సుగుణాలు గాల్లోంచి వీచి పిల్లల్లో ప్రవేశించవు. తల్లి ఒడి నేర్పించాలి. తండ్రి తన భుజాల పైకి ఎక్కించుకుని లోకాన్ని చూపించాలి. గురువు చెప్పే గద్దింపు పాఠాలు నేర్వాలి. అప్పుడే బిడ్డ ఎదుగుతాడు. ఎదిగేకొద్దీ ఒదుగుతాడు. అయితే ఇల్లు, బడి మాత్రమే కాకుండా బిడ్డకు బుద్ధులు నేర్పే పాఠాల్లో మరో ముఖ్యమైనది ఒకటి ఉంది. అదే... తోట పని. తోటను చూస్తూ, తోటలో పని చేస్తూ పెరిగి పెద్దయిన పిల్లలు సాటి మనుషులకు చల్లని నీడ అవుతారని, మానవత్వానికి ఊడలు అవుతారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.
సూర్యుడికి, చెట్లకు, పక్షులకు దూరంగా ఇళ్లలోనే పెరిగి పెద్దయి ఒకేసారి బయటికి అడుగు పెట్టే పిల్లల్లో ప్రకృతి సహజ లక్షణాలైన నెమ్మది, ప్రశాంతత ఉండవు. జీవన నైపుణ్యాలు కనిపించవు. నలుగురిలో కలవటం, కలుపుకొని పోవడం తెలియవు అని సైకాలజిస్టులు చెబుతున్నారు. కెరీర్‌లో దూసుకుపోతుంటారు కానీ, జీవితంలో ఉన్నచోటే ఉండిపోతారు. అందుకే ఈ డిజిటల్ ప్రపంచపు రోబో పిల్లల్ని తోట పనికి పంపాలి. తోటపని పిల్లల్ని మలిచే కుమ్మరి వంటిది. పెద్దయ్యాక బతకటానికి లోకంలో ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఎలా బతకాలో చిన్నతనంలోనే తోట పని నేర్పిస్తుంది.
తోటపనిలోకి ఎలా దింపాలి?
ఆటలా ఉంటే చాలు, పిల్లలు దేనికైనా ‘సై’ అంటారు. కనుక తోటపనిని కూడా వాళ్లకు ఆటలా నేర్పించాలి. ఇందుకు మీరూ వాళ్లతో కలిసి ఆటలోకి దిగాలి. వంటింటి నుంచే మీ ఆటను మొదలుపెట్టండి. టమాటాను కోసి, అందులోంచి కొన్ని విత్తనాలను తీసి, ఎండబెట్టి, ఒక చిన్న కుండీలో నాటండి. ‘ఆహారం ఏదీ నేరుగా ప్యాకెట్‌లలో వచ్చేయదు. గింజ వేయటానికి నేల, మొక్క మొలిచాక సూర్యరశ్మి కోసం సూర్యుడు, మొక్క ఫలించటానికి కొంత సమయం, అప్పటి వరకు వేచి ఉండటానికి మనకు సహనం అవసరం’ అని పిల్లలకు నేర్పించటానికి ఇదొక చక్కని మార్గం.
ఒక మొక్కను అప్పగించండి
పాత టీ కప్పులు, ప్లాస్టిక్ సీసాలు లేదా టిన్ డబ్బాలలో మట్టిని నింపి చిన్న చిన్న మొక్కలను నాటండి. ఆ కప్పులు లేదా డబ్బాలకు మీ పిల్లల చేత వారికి చేతనైనట్లుగా అందమైన పెయింట్స్ వేయించండి. లేదా స్టిక్కర్లతో అలంకరించనివ్వండి. అలా ఒక రీసైకిల్ పాట్ గార్డెన్‌ను తయారవనివ్వండి. అప్పుడు వారు ఆ మొక్కల్ని తమ సొంతమైనవిగా భావిస్తారు. మొక్కకు వారినే ఏదో ఒక పేరు పెట్టమని చెప్పండి. అలా వాటితో అనుబంధం ఏర్పడుతుంది. వాటి ఆలనా, పాలనను వారే ఇష్టంగా తీసుకుంటారు. రోజూ ఉదయం నిద్ర లేవగానే వెళ్లి ఆ మొక్కను పలకరిస్తారు. చిన్నతనంలో మొక్కలతో ఏర్పడిన బాంధవ్యమే, పెద్దయ్యాక సాటి మనుషులతోనూ ఏర్పడుతుంది.
సేంద్రియ ఎరువు తయారీ
వంట గది వ్యర్థాలు, తోటలో రాలిపడిన ఆకులు, మట్టి.. వీటన్నిటినీ ఒక పారదర్శకమైన సీసాలో ఒకదానిపైన ఒకటి పొరలుగా వేసి అవన్నీ కుళ్లిపోయి సహజమైన ఎరువుగా ఎలా మారుతుందో పిల్లలకు చూపించవచ్చు. నిజంగా అదొక అద్భుతమైన ప్రయోగంగా, మారువేషంలో ఉన్న ఒక సైన్స్ పాఠంలా పిల్లలకు అనిపిస్తుంది.
విత్తనం నాటితే ఓర్పు మొలుస్తుంది
⇒ తోటపని అంటే కేవలం మొక్కల పాదుల్ని శుభ్రం చెయ్యటం, మొక్కలకు నీళ్లు పెట్టటం మాత్రమే కాదు.
⇒ మట్టిని తవ్వటం అనేది శ్రమించటాన్ని నేర్పిస్తుంది.
⇒ విత్తనాలను నాటడం అన్నది ఆశగా
⇒ ఎదురుచూడటం అలవరుస్తుంది.
⇒ ఎదురుచూడటం అంటే తొందరపడకపోవటం. ఓపికపట్టడం. జీవితానికి అత్యంత కీలకమైన ఈ లక్షణాలను తోటపని బాల్యంలోనే అలవరుస్తుంది.
⇒ ఇక మొక్కలకు నీళ్లు పెట్టటం బాధ్యత అవుతుంది. నీళ్లు పెట్టడం మర్చిపోయి, మొక్కలు వాడిపోయినప్పుడు బాధ్యతను మరువకూడదని తెలిసివస్తుంది.
ఎదిగే దశలు ఉత్తేజపరుస్తాయి
తోటపని చేసే క్రమంలో మొక్కలు ఎదగటంలోని దశలు పిల్లలను ఉత్తేజపరుస్తాయి. మొక్కలు పెరగటానికి, పవ్వులు పూయటానికి, కాయలు కాయటానికి సమయం పడుతుందని వారు గ్రహిస్తారు. స్వయంగా నాటి, నీళ్లు పోసి, సంరక్షించిన మొక్కలు పుష్పించినప్పుడు, కాయలూ పండ్లూ కాసినప్పుడు తామే ప్రకృతిని పెంచి పెద్ద చేసిన గొప్ప ఆత్మవిశ్వాసపు భావన పిల్లల్లో అంకురిస్తుంది. వారిపై వారికి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. తోటపనిలోని ఈ అనుభవాలన్నీ జీవితంలో మున్ముందు అక్కరకు వస్తాయి.
సృజనాత్మకత, సాత్విక గుణాలు
⇒ తోటపని ప్రకృతితో పిల్లలకు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మొదట్లో భయపెట్టిన వానపాములు తరవాత నేస్తాలు అవుతాయి. వర్షం ఉత్సాహమై కురుస్తుంది.
⇒ తూనీగలు మీదకొచ్చి వాలతాయి. సీతాకోక చిలుకలు తలపై ఎగురుతాయి.
⇒ పక్షులన్నీ రాగాల కోయిలలే అవుతాయి. ఇవన్నీ పిల్లల్లో సృజనాత్మకతను, సాత్విక గుణాలను ప్రేరేపిస్తాయి. మున్ముందు జీవితంలో అలుముకునే నిరాశ, నిస్పృహలకు, అనిశ్చిత పరిస్థితులకు కూడా తోటపనే వైద్యం, చికిత్స నేర్పి పంపుతుంది.
తోటపనితో ఏమేం తెలుస్తాయి?
⇒ సమస్యలను ఎలా పరిష్కరించాలి?
⇒ ప్రణాళికతో పనిచేయడం
⇒ సమయం, వనరుల సద్వినియోగం
⇒ లక్ష్యసాధన
⇒ కష్టం విలువ
ఏమేం పెరుగుతాయి?
⇒ ఆత్మవిశ్వాసం
⇒ ఆత్మగౌరవం
⇒ ఓర్పు, సహనం
⇒ బాధ్యత
⇒ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
⇒ ఎలా చేస్తే పని విజయవంతమవుతుందన్న ఆలోచనా ధోరణి
⇒ పర్యావరణ పరిరక్షణ స్పృహ
ఏమేం తగ్గుతాయి?
⇒ ఒత్తిడి, ఆందోళన
⇒ కోపం, అసహనం
⇒ ఒక పనిని గుడ్డిగా చేయడం
⇒ మొక్కలను నరికేయడం/కొట్టేయడం