తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది | High Court verdict on cancellation of caste certification of ST person | Sakshi
Sakshi News home page

తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది

Jan 23 2026 5:54 AM | Updated on Jan 23 2026 5:54 AM

High Court verdict on cancellation of caste certification of ST person

 ఒక వ్యక్తి కులంతో అధికారులు విభేదిస్తే.. వారే నిరూపించాలి  

ఎస్టీ వ్యక్తి కుల ధ్రువీకరణను రద్దు చేయడంపై హైకోర్టు తీర్పు 

జేసీ, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు రద్దు  

సాక్షి, అమరావతి: ఒక వ్యక్తి కులంతో అధికారులు విభేదిస్తున్నప్పుడు, అతడు ఫలానా కులానికి చెందిన వ్యక్తి కాదని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆ అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యక్తి తన కులాన్ని రుజువు చేసే డాక్యుమెంట్లు సమర్పించలేదన్న కారణంతో అతడు ఫలానా కులానికి చెందినవాడుకాదని చెప్పలేరని పేర్కొంది. తండ్రిది ఏ కులమైతే పిల్లలకు అదే కులం వర్తిస్తుందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పాయని గుర్తుచేసింది. 

పిటిషనర్‌ అట్లపాకాల రామకృష్ణ తండ్రి, నాయనమ్మ కొండకాపు కులానికి చెందిన వారనేందుకు ఆధారాలున్నా.. భూ రికార్డులను మాత్రమే ఆధారంగా చేసుకుంటూ రామకృష్ణ కొండకాపు కులానికి చెందినవ్యక్తి కాదంటూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. 

రామకృష్ణ కొండకాపు (ఎస్టీ) కులస్తుడు కాదు, కాపు అంటూ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లాస్థాయి పరిశీలన అధికారి హోదాలో తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు చెప్పారు. 

ఏకపక్షంగా కులధ్రువీకరణ రద్దుపై పిటిషన్‌  
కొండకాపు (ఎస్టీ) కులానికి చెందిన అట్లపాకాల రామకృష్ణ పూర్వీకులు తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో నివశించారు. వారు ఎస్టీగానే చెలామణి అయ్యారు. రామకృష్ణ విద్యాభ్యాసం మొత్తం ఎస్టీగానే సాగింది. రామకృష్ణ బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు చదువుతున్న సమయంలో అధికారులు అతడి కులధ్రువీకరణపై విచారణ జరిపారు. అతడు ఇచి్చన డాక్యుమెంట్లను కాకుండా 1938 సంవత్సరానికి చెందిన భూ రికార్డులను ఆధారంగా చేసుకుని రామకృష్ణ కొండకాపు కులస్తుడు కాదంటూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తెలిపారు.

తరువాత రామకృష్ణకు నోటీసు కూడా ఇవ్వకుండానే అతడి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని 2005లో కలెక్టర్‌ రద్దుచేశారు. దీనిపై రామకృష్ణ అప్పీలు చేయగా.. కలెక్టర్‌ ఉత్తర్వులను సమర్థిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి  2009లో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి తుది విచారణ జరిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ తండ్రి, నాయనమ్మ కొండకాపులంటూ 1966లోనే అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరి­చారని తెలిపారు. గిరిజన సంక్షేమ డిప్యూటీ కలెక్టర్‌ 2004లో జారీచేసిన ఉత్తర్వుల్లో కూడా రామకృష్ణ తండ్రి, నా­య­­నమ్మలను గిరిజనులుగా పేర్కొన్నారని చె­ప్పారు. 

ఈ ఆధారాలన్నీ చూపినా అధికారులు ప­ట్టించుకోకుండా, కేవలం 1938 నాటి రెవెన్యూ రికార్డును ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుబట్టారు. రామకృష్ణ కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ జాయింట్‌ కలెక్టర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement