ఆ ఆస్తిలో వారికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది! | father property rights children divorce indian law explained | Sakshi
Sakshi News home page

ఆ ఆస్తిలో వారికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది!

Jan 28 2026 12:27 PM | Updated on Jan 28 2026 12:48 PM

father property rights children divorce indian law explained

నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లలు నా మాజీ భార్య వద్దనే ఉంటారు. అయితే మా నాన్న గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా?
– కృష్ణమూర్తి, విశాఖపట్నం

మీ తండ్రిగారి దగ్గర నుంచి మీకు సంక్రమించిన ఆస్తి మీ తండ్రి గారి స్వార్జితమైవుండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి వుంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కు ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే అది మీ పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్‌–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది వుంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది. 

అలా కాకుండా ఒకవేళ అది మీ తండ్రి గారికి కూడా వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయివుంటే,  కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేదా విడిపోయిన మీ మాజీ భార్య వద్ద ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం వున్నారో మీరు చెప్పలేదు. ఒకవేళ మీతోపాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ తల్లిగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాన్నమ్మ) ఉంటే వారికి కూడా మీతోపాటు సమానమైన వాటా లభిస్తుంది.

స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటాను వారు అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్‌  పోందే హక్కు వుంటుంది. 

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com
మెయిల్‌ చేయవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement