అతడు c/o ఆమె | Some celebrities Speech about wifes on International Womens Day | Sakshi
Sakshi News home page

అతడు c/o ఆమె

Mar 8 2026 4:38 AM | Updated on Mar 8 2026 4:38 AM

Some celebrities Speech about wifes on International Womens Day

భర్త సదా బాలకుడు.భార్య అతనికి తల్లి.

భర్త పోరాటయోధుడు.భార్య అతనికి ఆయుధాగారం.

భర్త తుఫానులో సరంగు.భార్య అతని తెరచాప.

భర్త ఓడినపుడు అశ్రువు.భార్య ఊరడించే చూపుడువేలు.

భార్య రావడంతో భర్తకు ఇల్లు వస్తుంది. నీడ వస్తుంది. దిశ వస్తుంది. దశ వస్తుంది. సూర్యచంద్రుల్లా డ్యూటీ దిగిపోని అనుక్షణ దీపం వస్తుంది.

భార్య గెలిపిస్తూ ఉంటుంది. భర్త విజేత అవుతుంటాడు.

కొందరు విజేతలు తమ జీవిత భాగస్వామి గురించి చెప్పిన విశేషాలివి ‘విమెన్స్‌ డే’ సందర్భంగా...

ఆమె నా బాబా భవానీ: డా.గురవారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు
బాగా అరిగిపోయిన ఓ రొటీన్‌ సూక్తితోనే మొదలుపెట్టాలంటే ‘ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ హస్తం తప్పక ఉంటుంద’ంటారు. నా విజయాలూ, ఉత్థానాలూ, జీవితమూ అన్నింటి వెనక నా లైఫ్‌ పార్ట్‌నర్‌ భవానీవి  రెండు హస్తాలూ, పాదాలూ... ఆ మాటకొస్తే మొత్తంగా తానే ఉంటుంది.  జోక్స్‌ అపార్ట్‌... భవానీ నా పట్ల తన ప్రేమను ప్రకటించేనాటికి నేనో మామూలు మెడికల్‌ స్టూడెంట్‌ని. వాళ్లది ఆర్థికంగా, సామాజికంగా చాలా ఎత్తున ఉన్న కుటుంబం. ఆ టైమ్‌లో ఆమె నా గురించి వాళ్ల నాన్నకు ఓ లెటర్‌ రాసింది. ‘ఇవాళ అతడో మామూలు వ్యక్తి కావచ్చు.

కానీ రేపు తన జీవితంలో ఓ సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌ అవుతాడు. చాలా ఎత్తులకు ఎదుగుతాడు. అంతకు మించి మంచివాడు. నా భాగస్వామిగా చాలా కరెక్ట్‌’ అంటూ తన లేఖలో నా గురించి చెప్పింది. నా మీద నాకూ ఆత్మవిశ్వాసం ఉండేది. అయితే భవానీకి మాత్రం నా మీద నాకు ఉన్న దాని కంటే కూడా నా సామర్థ్యాల మీద ఆమెకు ఉన్న నమ్మకం చాలా చాలా ఎక్కువ. 

మామూలుగానైతే ఫలానావాడు నాకు తగినవాడా కాదా అంటూ అమ్మాయిలు ప్రేమపరీక్షలు పెడుతుంటారు. తమ గీటురాయి మీద ఒకటికి నాలుగుసార్లు పరీక్షించి చూస్తూ ఉంటారు. కానీ నా విషయంలో అంతా డిఫరెంట్‌. నేను భవానీకి ప్రేమ పరీక్షలు పెట్టాను. కారుల్లో తిరిగే అమ్మాయిని సిటీబస్సుల్లో ఇరికిస్తే ఎలా తట్టుకుంటుందో తెలుసుకోడానికి గుంటూరు శ్రీనివాసకాలనీ నుంచి నాజ్‌ సెంటర్‌ వరకు సిటీబస్సుల్లో తిప్పేవాణ్ణి. అలా మా సిటీబస్సు టైర్ల జాడల్లో పయనించగలదా లేదా అని ఆమెను

టెస్ట్‌ చేస్తూ ఉండేవాణ్ణి. 
తనకున్న ఆర్థిక సామాజిక నేపథ్యం కారణంగా భవానీకి అన్ని సదుపాయాలూ సమకూరి ఉండేవి. ఓ చిన్నకూతురుగా ఆమె ఆ ఇంటి గారాలపట్టి. నేను అప్పట్లో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాణ్ణి. అలాంటిది తాను తన ప్రివిలేజెస్‌ అన్నింటినీ వదులుకొని ఓ పెద్దకోడలు హోదాలో ఇంటి బాధ్యతలన్నింటినీ తలకెత్తుకుంది. వాటిని ఎంతో బాధ్యతాయుతంగా నిభాయించింది కూడా. ఆ సమయంలో నా ఆర్థికలేమిని ఏమాత్రం లెక్కచేయకుండా నా వెంటనడిచింది. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నానంటే... నా చదువు పూర్తయ్యాక పూణేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా జీతం కేవలం రూ.1,800 మాత్రమే! 

అలాంటి మా ఇంటికి వచ్చిన భవాని ఇంటి పెద్దకోడలుగా నా పెద్ద ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుని మా తమ్ముళ్లకు వదినగా... మా అమ్మనూ, నాన్ననూ చూసుకుంటూ వాళ్ల కూతురిగా ఉండిపోయింది. ఇంగ్లాండ్‌లో నేను ఉద్యోగాల కోసం పరుగెత్తుతూ ఉన్నప్పుడు నా కుటుంబం పర్యవేక్షణ ఆమె కనుసన్నల్లోనే  సాగింది. నేనెక్కడో సుదూరతీరాల్లో ఉన్నప్పుడు ఇంటి పెద్ద్దకొడుకు స్థానాన్నీ ఆమే భర్తీ చేసింది. అలా నా కలలను తరుముతూ వాటిని అందుకునేందుకు వాటి వెంట నేను పరుగెత్తుతున్నప్పుడు నా వెన్నంటే ఉంది. అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ!!

నేను ఆమెను సరదాగా ‘బాబా భవానీ’ అంటూ పిలుస్తుంటా. ఈమాట ఎందుకు చె΄్పాల్సి వస్తుందంటే ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఏరోజూ తనని ఆనందంలో ఎగరడం గానీ... దిగులులో తరగడంగానీ చూడలేదు. ఎప్పుడూ ఒకేలా ఉండటం మహర్షులకే కదా సాధ్యమయ్యేది. అందుకే నాకెప్పుడూ ఆమె మా ‘బాబా భవానీ’యే!    

నేను తీసుకునే నిర్ణయాలను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. నా తప్పులను విమర్శనాత్మకంగా చూస్తుంది. ఎక్కడైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని పెద్దమనసుతో భరిస్తుందీ... సరిచేస్తుంది. నా ఆనందాలూ, నా అభిరుచులూ, నాకు నచ్చే విషయాలూ ఆమెకు నచ్చకపోయినా నా స్పేస్‌లో నన్ను ఉండనిస్తుంది. అలా ఉండనిచ్చినంత సేపూ ఉండనిచ్చి... తాను ముందుకెళ్తూ నన్నూ తీసుకెళ్తుంది.

తీరని రుణం: చంద్రబోస్, ప్రముఖ గీతరచయిత
మన వెనకాల నిశ్శబ్దంగా కొంతమంది శ్రమిస్తూ ఉంటారు. అది ప్రపంచానికి తెలియదు. మనం మన వెలుగులో ఉంటాం. రాణిస్తుంటాం. గుర్తింపునకు నోచుకుంటాం. అందరి అభినందనలూ, సన్మానాలు మనం పొందుతుంటాం కానీ.. మనం ఇంత దూరం రావడానికి వెనకాల నిశ్శబ్దంగా, నిరంతరం పని చేస్తూనే ఉంటారు. శ్రమిస్తుంటారు. వారే ఇంటి ఇల్లాళ్లు. మా ఆవిడ (ప్రముఖ కొరియోగ్రాఫర్‌–డైరెక్టర్‌ సుచిత్ర) నిరంతరం తెర వెనకాల పని చేస్తూ, కష్టపడుతూ నా గురించి ఆలోచిస్తూ నన్ను ఇంకా బాగా రాసే విధంగా ప్రోత్సహిస్తూ ఉండటం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. దీని వెనకాల ఉన్నదంతా ఒక స్త్రీ మూర్తి, స్త్రీ శక్తి. తనను గుర్తు చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందం. 

నిజానికి తను ఎన్నో సాధించింది. ఎన్నో వందల సినిమాల్లో వేల పాటలు కంపోజ్‌ చేసింది. ఎంతో గుర్తింపు పొందింది. తను ఒక పెద్ద టెక్నీషియన్‌ అయినా, తను నా కన్నా సీనియర్‌ అయినా నా జీవితంలోకి వచ్చాక నా జీవితం కోసం, నా భవిష్యత్తు కోసం పాటు పడిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో అనుబంధం కాదు... రుణానుబంధమే అయ్యుంటుంది. ఎందుకంటే ఎక్కడో చెన్నైలో పుట్టిన తను, వరంగల్‌లో పుట్టిన నేను.. మేమిద్దరం కలిసేలాగా చేసింది విధి. ఇదంతా కూడా భగవంతుడి లీలేమో అనుకుంటుంటాను. 

ఈ మహిళా దినోత్సవం రోజు మన జీవితంలోని మహిళలు... వాళ్లెంత గొప్పవాళ్లు, మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారు, మన క్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ఆనందం కోసం, మన విజయం కోసం ఎంత శ్రమిస్తారు, ఎంత చెమటోడుస్తారు, ఎన్ని కన్నీళ్లు కూడా కారుస్తారు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్లకు మనం ఏమిచ్చినా ఆ రుణానుబంధం రుణం తీర్చుకోలేం. 

స్త్రీలు మొత్తం ఉన్నదంతా మనకిచ్చేసి తిరిగి వాయిదాల పద్ధతిలో చిన్నచిన్నగా కొంత కొంత అడుగుతారు. మనం ఇవ్వాల్సింది ప్రేమ, గౌరవం, గుర్తింపు, కాస్త మన సమయం, తనకు కావలసిన సమయం ఇచ్చి, ఎప్పుడు వెనకాల ఉంటూ వాళ్లు మన విజయాలను చూసి ఆనందించేలాగా మనం విజయపథంలో నడవడం వాళ్లకు నిజంగా గొప్ప బహుమతి అని భావిస్తున్నాను.

నాలో మార్పు తీసుకొచ్చింది
చాలా విషయాల్లో నాలో మార్పు తీసుకువచ్చింది మా ఆవిడ సుచిత్ర. చాలా విషయాల్లో అంటే నా అలవాట్లు, నా వ్యసనాలు, తరువాత నా పద్ధతులు ఇవన్నీ మారడానికి ప్రధాన కారణం నా భార్య. నాకు 21 ఏళ్ల క్రితం కొన్ని చెడు అలవాట్లుండేవి. పాట రాసేపుడు ఒక చెడు అలవాటుతో కూర్చొని రాసేవాణ్ణి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది హానికరం అని చాలా విధాలుగా చెప్పినా నేను వినలేదు. కానీ తను ఓపిగ్గా చెబుతూ చెబుతూ ఇంతకాలంగా చెబుతోందని దృష్టి పెట్టేలాగా చేసింది. అపుడు ఆ అలవాటు నుంచి పక్కకొచ్చాను. చాలా చాలా మంచి జీవితానికి అపుడు శ్రీకారం చుట్టాను.  

అట్లాగే ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబాన్ని పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకోవడం. పిల్లలు గానీ, మా కుటుంబ సభ్యులు గానీ, మా వైపువాళ్లు, మా స్నేహితులు, ఇంకా ఇంటికొచ్చేవాళ్ల ఆదరణ అంతా తాను చూసుకోవడం. కుటుంబం కోసం నా సమయాన్ని వెచ్చించనివ్వకుండా పూర్తిగా నా వృత్తి మీద, నా పాటల మీద మాత్రమే పెట్టేలాగా అంత సమయాన్ని నాకిచ్చింది. వేరే ఏమీ ఉండదు పాట.. పాట.. లేదంటే చదవడం చదవడం. ఈ రెండే... అంటే సృజించడం... అధ్యయనం చేయడం ఈ రెండే .. వీటి మీదే మనసు లగ్నం చేసేలాగా నన్ను సిద్ధం చేసిందన్నమాట. 

ఇంకొకటి ఏంటంటే... అసలు ఆస్కార్‌ వస్తుందని ముందు ఊహించిందే నా భార్య. ఆస్కార్‌ కంటే ముందు ఆస్కార్‌ తను నాకిచ్చింది. 2022 డిసెంబర్‌ 22న నాకు ఒక ఉత్తరం రాసిచ్చింది – మీరు ఆస్కార్‌ అవార్డు సాధించబోతున్నారని. అప్పటికి నామినేషన్స్‌కు కూడా ప్రక్రియ మొదలవ్వలేదు. ఊరికే నామినేషన్‌కి పంపించామంతే! అప్పుడు తను నాకు ఉత్తరం రాసిస్తే ఇది ఎలా... అన్నాను. మీరు చూడండని చెప్పి దృఢమైన విశ్వాసంతో దేవుడికి పూజలు చేయడం మొదలు పెట్టింది. నేను అసలు నమ్మలేదు. నామినేషన్‌ 35 నుంచి 15 లోకి; 15 నుంచి 5 లోకి వచ్చింది మనది. అప్పుడు నమ్మడం మొదలెట్టాను. అవును... మా ఆవిడ చెప్పింది ముందే అని. ఏంటంటే నమ్మకం అనేది ఒక పక్షి లాంటిదని. పక్షి సూర్యోదయాన్ని అందరికంటే ముందే, లోకం కంటే ముందే పసిగడుతుంది. అట్లా మా ఆవిడ ఒక నమ్మకంతో ముందుకెళ్లింది. ఆ నమ్మకాన్ని నాలో కూడా నింపింది. నాలో కూడా ఆ నమ్మకం కలిగేలాగ చేసింది.

ఒక కవిగా నేను చెడు అలవాట్లతో చెడు పద్ధతులతో ఉంటూ మంచి మాట చెప్పినా దాంట్లో నిజాయితీ లోపిస్తుందని నా భావన. అందువల్ల మనం మంచి దారిలో ఉండి మంచి మాట చెబితే అది సరైన పద్ధతి. అలా ఆ సరైన పద్ధతిలోకి తీసుకువచ్చింది నా భార్య. నేను రాత్రిపూట రాసేవాణ్ణి. పగటిపూట రాసేలా నన్ను ప్రోత్సహించి నాలో నమ్మకాన్ని నింపింది. ఇప్పుడు హాయిగా రాత్రి పడుకోవడం... పగలు రాయడం.

బెటర్‌ ఫుల్‌: మల్లాది వెంకట కృష్ణమూర్తి, ప్రముఖ రచయిత
నా జీవిత కథలోని ప్రధాన పాత్ర పద్మజ. పద్మజ నా భార్య. మాకు ఎలా పరిచయమైంది? 1982లో ఓ వారపత్రిక సంపాదకుడు ఏదైనా మంచి శీర్షిక సజెస్ట్‌ చేయండి అని అడిగితే ‘మీ భార్యని మీరు ఎలా ఎప్పుడు కలుసుకున్నారు?’ అనే శీర్షికని సూచించాను. ‘పెళ్లిచూపులు లేదా పార్క్‌ అంతేగా?’ అని ఆయన దాన్ని స్వీకరించలేదు. కానీ అందరూ తమ భార్యలని అలాగే కలుసుకుంటారా? 

పద్మజ స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చింతలపూడి. అభిమాన రచయితగా నాకు అక్కడ నుంచి రాసిన ఉత్తరాల ద్వారా మా పరిచయం. నన్ను చూడాలని ఉందంటే, హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఫోన్‌ చేయమని ఆఫీస్‌ నంబర్‌ ఇచ్చాను. అలా 1983లో నిమ్స్‌ హాస్పిటల్‌లో కలిశాను. కొద్దిసేపట్లో ఆమెకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. నేను అమెరికన్‌ హాఫ్‌డాలర్‌ కాయిన్‌ని ప్రెసెంట్‌ చేశాను. లాస్ట్‌ మినిట్లో సర్జన్‌ సర్జరీ అవసరం లేదని చెప్పడంతో అది లక్కీచామ్‌గా పద్మజ భావించింది. ఈ రోజుకి అది తన దగ్గర భద్రంగా ఉంది.

పద్మజలో సాహిత్యం మీద చక్కటి అభిరుచి ఉంది.  అందరికి తెలిసిందే... సోక్రటీస్‌ భార్య కోపంగా అతని మీద కడవలో తెచ్చిన నీళ్లు కుమ్మరించింది. ఆయన ప్రశాంతంగా ‘ఈ రోజు వాన, ఉరుములు కలిసి వచ్చాయి’ అని శిష్యులతో చె΄్పాడు. ‘ఆమె ఎందుకు కుమ్మరించింది?’ అనే కోణంలోంచి ఆలోచించి తను రాసిన మొదటి కథ ‘సోక్రటీస్‌ భార్య’ నాకు బాగా నచ్చింది. పద్మజ పురుష ద్వేషి కాకపోయినా ఆ కథలో స్త్రీవాదం స్పష్టంగా ఉంది. ఆమె స్త్రీవాది అనే చె΄్పాలి. పద్మజ చక్కటి ఇల్లాలు. ముందు నేను, తర్వాత పిల్లలు ముఖ్యం. ఆ తర్వాతే మరేదైనా. 

1989లో నేను యూరప్‌ వెళ్తూ తనని కూడా రమ్మంటే ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలి రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆ జాబితాలో మనవరాలు, మనవడు కూడా చేరారు. తనకి నా మీద ఎంత శ్రద్ధ అంటే ఏ రోజు నేను వేసుకోవాల్సిన బట్టలు ఆరోజు తనే ఇస్తుంది. ఏ కారణంగానైనా అన్నం కొంచెం తక్కువ తింటే తను రుచిగా వండలేదని బాధపడుతుంది. అది కాదని చెప్పినా నమ్మదు. మా ముగ్గురు పిల్లలు కావ్య, ఊహ, లిపి తల్లిని స్నేహితురాలుగా భావిస్తారు. అన్ని మనసు విప్పి ఫ్రీగా చర్చిస్తారు. నాతో మాత్రం అలా కాదు.

తమస్విని అనే కలం పేరుతో కౌముది డాట్‌ నెట్‌లో ‘సంసారంలో సరిగమలు’ అనే శీర్షికతో 10 ఏళ్ళుగా 100కి పైగా కథలు  రాసింది. ఇవన్నీ మన మధ్య కనపడే మధ్యతరగతి మనుషులకి చెందిన కథలే. నా మొదటి పాఠకురాలు పద్మజ. నా రచనలను పత్రికకి పంపే ముందు తనే తప్పులను దిద్దుతుంది– ఈ వ్యాసంతో సహా. ప్రూఫ్‌రీడింగ్, పుస్తకాలకి పేజ్‌ మేకప్‌ తనే చేస్తుంది. పద్మజ తండ్రి ఎం.ఎ. సాంస్క్రిట్‌ పండిట్‌గా పని చేసేవారు. ఆయన పిల్లలకి తెలుగుని బాగా నేర్పించారు. ళ ని ల గా, ణ ని న గా పలికితే తను చాలా బాధపడుతుంది.  

అలాగే, నేను సెన్సిటివ్‌ కానీ కవిత్వాలు రాయలేను. తను నా అంత సెన్సిటివ్‌ కాదు కానీ టచింగ్‌గా ఉండే కవిత్వాలు రాయగలదు. 
పద్మజకూ నాకూ వయసులో పదహారేళ్ల తారతమ్యం ఉన్నా పద్మజకి నాతో సమానమైన మెచ్యూరిటీ ఉంది. సమానం అన్నానా? తప్పు. ఇంకాస్త ఎక్కువ మెచ్యూరిటీ ఉంది.

1996లో తను పీజీ చేయాలని అనుకుంది. నేను అందుకు అభ్యంతరం చెప్పలేదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎం.ఏ. పొలిటికల్‌ సైన్స్ లో పీజీ చేసింది. తనకి రాజకీయాల మీద అవగాహన ఉంది. నిత్యం దినపత్రిక చదువుతుంది. కాఫీ తాగే టైంలో దినపత్రిక చదివేప్పుడు ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే చాలా కోపం వస్తుంది. 

2000వ సంవత్సరం నుంచి పద్మజే ఆర్థిక వ్యవహారాలు, ఇంటి విషయాలు చూసుకుంటోంది. ఎప్పుడైనా అనుమానం వచ్చినా, సలహా అవసరమైనా నాతో సంప్రదిస్తుంది. పెద్దయ్యాక పిల్లలు ముగ్గురు విదేశాలకు వెళ్లాక మేము ఇప్పుడు ఇద్దరమే ఒంటరిగా ఇంట్లో. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి వంట చేయడం ఓ సరదా.  
మా అమ్మ చివరి దశలో ఆఖరి పదేళ్లు నా దగ్గర ఉన్నప్పుడు ఓపెన్‌గా పద్మజతో ఆవిడ చెప్తూ ఉండేది ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని. అయినా చివరిదాకా మా అమ్మని పద్మజ ఎంతో సహనంగా శ్రద్ధగా చూసుకుంది. మా అమ్మలో ఆ ద్వేషం పోకుండానే వెళ్ళిపోయింది. కారణం శాఖాభేదం!

పద్మజకి వంట చేసుకుని తినడమే ఇష్టం. బయటి భోజనం ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు రెస్టారెంట్స్‌కి వెళ్లడానికి అవాయిడ్‌ చేస్తుంటుంది ముఖ్యంగా పిల్లల దగ్గరికి విదేశాలకు వెళ్ళినప్పుడు అనేక దేశాలకు చెందిన రెస్టారెంట్స్‌కి వెళ్తూ ఉంటాం పీజా, న్యూడిల్స్‌ లాంటివి తనకి ఇష్టం ఉండదు. అన్నం మాత్రమే ఇష్టం. నేను చాలా తరచూ మా పిల్లలకి చెప్పే జోకు ‘నాకు ఇది వద్దు’ అంటే చిన్నప్పుడు మీ అమ్మ అది తినలేదు కాబట్టి వద్దు అంటుంది. చిన్నప్పడు ఏం తిన్నదో అదే తింటుంది. కొత్తవి ఏమి తినదు. రెస్టారెంట్‌కి వచ్చినప్పుడు ఒక్కోసారి ఇంటికి వెళ్లి అన్నం వండుకొని తినే సందర్భాలు కూడా ఉన్నాయి. 

మల్లాది ముచ్చట్లు అనే టోరీ రేడియో కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:30 నుంచి 11:30 దాకా వస్తుంది. ఆ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని మేమిద్దరం కలిసి నిర్వహిస్తున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, పద్మజని కాక నేను మరొకరిని ఎవరినైనా చేసుకుని ఉంటే బహుశా విడిపోయి, ఈరోజు ఒంటరిగా ఉండేవాడినేమో అని. మేమిద్దరం కలిసి కొనసాగడానికి కారణం పూర్తిగా పద్మజే.

మా ఇద్దరిలో నవ్వని వ్యక్తి నేను. ఎప్పుడూ నవ్వే వ్యక్తి పద్మజ. తను మాటకారి. నేను ముభావిని. తను లగ్జరీలని ఇష్టపడుతుంది. నేను మినిమలిస్ట్‌ని. నేను ఇంగ్లీషు పాత సినిమాలు చూడడానికి ఇష్టపడతాను. తను కొత్తగా వచ్చే సిరీస్‌ని చూడడానికి ఇష్టపడుతుంది. ఇలా మేము చాలా విషయాల్లో ఉత్తర దక్షిణ ధ్రువాలైనా మా మధ్య ఎలాంటి ఇబ్బందీ లేదు. కారణం ఒకరి పట్ల మరొకరికి గల సహనం.

ప్రతి కష్టంలోనూ నాతో...: బాబీ, ప్రముఖ సినీ దర్శకుడు
నా లైఫ్‌లో నా వెనకాలే కాదు ముందు కూడా స్త్రీనే ఉంది. ముందు ఉండే స్త్రీ అమ్మ అయితే, వెనకాల ఉండే స్త్రీ నా భార్య అనూష. ఎక్కడో గుంటూరులో ఉండే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలకి వెళ్ళడానికి డబ్బులిచ్చి ఎంకరేజ్‌ చేసింది మా అమ్మ. అయితే ప్రేమలో ఉన్నప్పుడు నేను సినిమాలలోకి వెళ్ళి దర్శకుడిని అవుతా అంటే నా వెనక ఉండి నా వెన్ను తట్టింది నా భార్య. నాకు ముందు... వెనక వీళ్ళు ఉండటం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను.

అనూషతో ప్రేమలో ఉన్నప్పుడు నేను ఇంట్లో చెప్పుకోలేని సీక్రెట్స్‌ అన్నీ తనతో చెప్పుకునే వాడిని. ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నాక నేను మనసులో అనుకునే అబద్ధాన్ని కూడా తను  ముందే గెస్‌ చేసి ‘మీ అమ్మానాన్నకి చెప్పినట్టు నాకు చెప్పలేవు’ అని హెచ్చరిస్తుంది. తనకి నేనొక తెరిచిన పుస్తకం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అంటారు కదా. అలా నేను నా కథలన్ని మొదట తనతోనే చెబుతాను. వంద శాతం నిర్మొహమాటంగా బాగుంటే బాగుంది అని బాలేకపోతే బాలేదని చెబుతుంది. కథలే కాదు... ట్యూన్స్, టీజర్స్, ప్రోమోస్‌ అన్నీ చూపిస్తాను. ఎందుకంటే నా భార్యకి ఏ ఫిల్టర్స్‌ ఉండవు. ఏదైనా నిజాయితీగా చెబుతుంది. నా క్రియేటివిటీని ఫస్ట్‌ జడ్జ్‌ చేసేది తనే. 

చిరంజీవిగారితో ‘వాల్తేరు వీరయ్య’ మూవీ షూటింగ్‌ చేస్తుంటే మా నాన్నగారు కాలం చేశారు. మా నాన్న చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమాని. ఆ టైమ్‌ నాకు మోస్ట్‌ టఫెస్ట్‌ సిచ్యువేషన్‌. మా నాన్న లేని లోటు నా భార్య తీర్చింది. నన్ను ముందుకు నడిపింది. ప్రతి రోజు షూటింగే నా గోల్‌ కింద గుర్తు చేసేది. మీ నాన్నకి చిరంజీవిగారి పై ఉన్న ప్రేమ అందరికీ తెలిసేలా ఒక బ్లాక్‌ బస్టర్‌ సినిమా తియ్యమని నన్ను రోజూ మోటివేట్‌ చేసేది. తన మోటివేషన్‌ వల్లే నేను అంత పెద్ద సినిమా (‘వాల్తేరు వీరయ్య’) తియ్యగలిగాను. నాన్నకి చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ, నాకు నాన్న మీద ఉన్న ప్రేమే ‘వాల్తేరు వీరయ్య’. అది మా నాన్నకి నేను ఇచ్చిన ట్రిబ్యూట్‌ అవ్వాలి అంటూ నన్ను ప్రోత్సహించింది నా వైఫ్‌.  

నేను ఇంట్లో ఎక్కువసేపు ఉంటే ఆఫీస్‌ లేదా? అని గుర్తు చేస్తూ ఉంటుంది. వెళ్ళి పని చేసుకో అని ఇండైరెక్ట్‌ సెటైర్స్‌ వేస్తుంటుంది,. మోస్ట్‌ ఆఫ్‌ ది టైమ్‌ షూటింగ్‌ లేనప్పుడు నేను గడిపేది ఇంట్లోనే. నేను, నా కూతురు వైష్ణవి, నా భార్య ఇదే నా ప్రపంచం.  నా భార్య ఎంటెక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌. ఒక ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో ్రపొఫెసర్‌గా కూడా చేసింది. నా కోసం, మా కూతురి కోసం తన కెరియర్‌ శాక్రిఫైస్‌ చేసి, మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఇల్లు మ్యానేజ్‌ చేయడం అంటే ఈజీ కాదు. మా అమ్మని చూశాను, మా అక్కని చూశాను. మా అత్తగారిని చూశాను, తరువాత అనూషని చూస్తున్నాను. వీళ్లందరిని చూసిన తరువాత ఇల్లు మెయింటెయిన్‌ చేసుకోవటంలో ఆడవాళ్ళ తరువాతే ఎవరయినా అని నాకు అర్థం అయ్యింది.

నా ప్రతి కష్టంలోనూ నా భార్య అనూష నాతో ఉంది. నేను అయిదు వందలు సంపాదిస్తున్న టైమ్‌ నుండి నా సంపాదన ఆమెకు తెలుసు. ఘోస్ట్‌ రైటర్‌గా నా పేరు పడని దగ్గర్నుంచి నా గ్రోత్‌ తెలుసు. నేను డైరెక్టర్‌ అవక ముందే పెళ్లి చేసుకున్నాం. అద్దె ఇళ్ల కోసం ఓనర్ల చుట్టూ తిరగడం, కారు ఈఎంఐ వస్తుంటే భయపడడం, గోల్డ్‌ లోన్లు పెట్టి రెంట్‌లు కట్టడం, ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ రోజూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలి అనే మెంటాలిటీతో ఉంటుంది. నా సక్సెస్‌ వెనకాల ఉండే ప్రశాంతానికి తనే కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement