నాటు నాటు పొగాకు నాటు | Virginia tobacco planting is in progress | Sakshi
Sakshi News home page

నాటు నాటు పొగాకు నాటు

Nov 20 2025 4:58 AM | Updated on Nov 20 2025 4:58 AM

Virginia tobacco planting is in progress

ముమ్మరంగా పొగాకు నాట్లు

8,138 హెక్టార్లలో పూర్తి

అధిక దిగుబడుల వంగడాల సాగు

15,170 హెక్టార్ల భూమి రిజిస్ట్రేషన్‌  

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2025–26 పంట కాలానికి సంబంధించి వర్జీనియా పొగాకు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధిక వర్షాలు, మోంథా తుపాను కారణంగా రైతులు ఈ ఏడాది పొగాకు నాట్లు దాదాపు నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. 

తుపాను అనంతరం వాతావరణం అనుకూలించడంతో భూములను దుక్కి చేసి, డ్రిప్‌ ఏర్పాటు చేసి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం రైతులు అధిక దిగుబడులు వచ్చే ఎల్‌వీ–7, 1353 వంగడాలను సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి వస్తాయి. 

కౌలు, బ్యారన్‌ అద్దెకు రెక్కలు 
రెండేళ్లుగా పొగాకు సాగు లాభసాటిగా ఉండటంతో దీని సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా కౌలు రైతులు అధిక ధరకు భూములను కౌలుకు, బ్యారన్లను అద్దెకు తీసుకుని పొగాకు సాగు చేస్తున్నారు. భూములను బట్టి ఎకరం కౌలు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ పలుకుతోంది. బ్యారన్‌ అద్దె రూ.2.50 లక్షలు పలుకుతున్నప్పటికీ రైతులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 

బ్యారన్‌ ఖరీదైతే ఏకంగా రూ.10 లక్షలు పలుకుతోంది. పొగాకు గరిష్ట ధర 2024–25 సీజన్‌లో కిలోకు ఏకంగా రూ.454 లభించింది. దీంతో భూముల కౌలు, బ్యారన్ల అద్దెకు రెక్కలొచ్చాయి. పెద్ద రైతులంతా సాగు విస్తీర్ణం తగ్గించుకుని, భూములను కౌలుకు, బ్యారన్లను అద్దెకు ఇస్తున్నారు. 

అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది ఉత్తర తేలిక నేలల్లో (ఎన్‌ఎల్‌ఎస్‌) 29,480 హెక్టార్లలో పొగాకు సాగు జరిగింది. వచ్చే ఏడాది ఈ విస్తీర్ణం మరింత పెరుగుతుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 

9,674 బ్యారన్ల రిజిస్ట్రేషన్‌ 
టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో 12,723 బ్యారన్లు, 14,254 మంది రైతులు ఉన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ 8,515 మంది రైతులు 9,674 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు అధికారులు తెలిపారు. 

మొత్తం 15,170 హెక్టార్లకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా, ఇప్పటి వరకూ 8138 హెక్టార్లలో నాట్లు వేశారు. డిసెంబర్‌ మొదటి వారం నాటికి నాట్లు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 61.27 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 84 మిలియన్‌ కిలోల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది 51.8 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి మాత్రమే బోర్డు అనుమతి ఇచ్చింది. 

బిందుసేద్యం 
సాగునీటి ఎద్దడి, కూలీల సమస్యను అధిగమించడానికి రైతులు బిందుసేద్యం (డ్రిప్‌) చేపట్టారు. పొగాకు సాగు చేస్తున్న భూముల్లో ముందుగా డ్రిప్‌ పైపులు ఏర్పాటు చేసి, నాట్లు వేస్తున్నారు. ఎరువులను డ్రిప్‌ ద్వారా ద్రవ రూపంలో మొక్కలకు అందిస్తున్నారు. దీనివల్ల మొక్కకు ఎరువులు సమానంగా అందుతాయని చెబుతున్నారు. 

కొంత మంది రైతులు మల్చింగ్‌ షీట్‌ ఏర్పాటు చేసి పొగాకు నాట్లు వేస్తున్నారు. దీనివల్ల కలుపును నివారించవచ్చని, మొక్క ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాది దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు రైతులకు గోపాలపురం మార్కెట్‌ యార్డులో ఎరువులు అందజేస్తున్నట్టు బోర్డు రీజినల్‌ మేనేజర్‌ జీఎల్‌కే ప్రసాద్‌ తెలిపారు. 

బ్యారన్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేయించుకున్న రైతులు ఎరువులు పొందవచ్చని పేర్కొన్నారు. ఈమేరకు పొగాకు పంటకు అవసరమైన ఎరువులను యార్డులో అధికారులు సిద్ధం చేశారు. డీసీఎంఎస్‌ ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేస్తున్నారు. 

యోగ్యమైన భూముల్లోనే సాగు 
పొగాకు సాగుకు యోగ్యమైన భూముల్లోనే ఈ పంట పండించాలి. బాడవ భూములు, సెలైన్‌ భూముల్లో పొగాకు సాగు చేసి నష్టపోవద్దు. బోర్డు అనుమతించిన మేరకే నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి. ప్రపంచ దేశాల్లో పొగాకు సాగు గణనీయంగా పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సాగు చేస్తే లాభదాయకమైన ఉత్పత్తి వస్తుంది. ఇక నుంచి బ్యారన్‌ రిజి్రస్టేషన్‌ మూడేళ్లకొకసారి జరుగుతుంది. 
– జీల్‌కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్‌ మేనేజర్, రాజమహేంద్రవరం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement