కాలం కలిసిరాకపోతే తాడే పామవుతుందట. పాపం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిప్పుడు ఈ సామెతను పదే పదే తలచుకుంటూ ఉండి ఉంటారు. ఎందుకంటే... పోతిరెడ్డిపాడు వద్ద గత ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన కోరిక మీద చంద్రబాబు నిలిపివేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఆ రాష్ట్ర శాసనసభలోనే ప్రకటించారు. కావాలని చెప్పారో, క్రెడిట్ కోసం చెప్పారో, అనుకోకుండా చెప్పేశారో తెలియదు కాని... ఈ నిజం కాస్తా చంద్రబాబు ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసేసింది. తెలంగాణ ప్రజల మెప్పు కోసం లేదంటే బీఆర్‌ఎస్‌పై పైచేయి కోసం రేవంత్ అసలు వాస్తవాన్ని ఒప్పుకోవడంతో చంద్రబాబు కాస్తా రాయలసీమ ద్రోహిగా ముద్రపడిపోయారు.
రాయలసీమ కరువు శాశ్వత నివారణకు వృథా అవుతున్న కృష్ణా జలాల సద్వినియోగమే మేలైన మార్గమని నమ్మిన గత ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వరద వచ్చినప్పుడు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. దీనిపై తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు అప్పట్లోనే విమర్శలు చేసినా జగన్ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. తమకు కేటాయించిన నీటిలోనే తీసుకుంటామని, పైగా వరద నీరు సముద్రంలో కలిసే బదులు వాడుకుంటే మంచిది కదా అని వాదించేవారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తీసుకుంటున్నట్లే తాము కూడా అదే 800 అడుగుల నీటి మట్టం వద్ద నీటిని తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించేవారు.నిజానికి పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టమేమీ ఉండదన్నది నిపుణుల అభిప్రాయం.
కాకపోతే నదీ జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ఏర్పడినట్లు ఈ స్కీమ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుందన్నది తెలంగాణ అభ్యంతరం. అయినా ఏ రాష్ట్రం అయినా తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అదే రీతిలో జగన్ రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఆ తరుణంలో రేవంత్ రెడ్డే అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమందితో ఎన్‌జీటీకి ఫిర్యాదు చేయించారని అనేవారు. టీడీపీ అనుకూలంగా ఉన్నవారే ఈ స్కీమ్‌పై ఫిర్యాదు చేసినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ వచ్చేది. ఏడువేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును శరవేగంగా చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది.
అయినా తాగు నీటి అవసరాల పేరుతో ఈ స్కీమును కొనసాగించారు. దాదాపు 85 శాతం పనులు పూర్తి చేయించారు. అంతలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి, టీడీసీ. జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్ కు గ్రహణం పట్టినట్లయింది. కేంద్రంలో కూడా ఇదే కూటమి పాలిస్తున్న నేపథ్యంలో స్కీమ్‌ను కొనసాగించి ఉంటే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. కాని ఆ పని చేయకపోగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. పర్యావరణానికి సంబందించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించలేదని ఫలితంగా అనుమతులు రాలేదని, దానివల్ల రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లోక్‌సభలోనే చెప్పారు. ఎందుకు ఏపీ ప్రభుత్వం అలా చేసిందన్నదానికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది.
రేవంత్, చంద్రబాబులు ఏకాంతంగా భేటీ అయి తీసుకున్న నిర్ణయమట. తనమీద గౌరవంతో చంద్రబాబు ఈ పని చేశారని రేవంత్ చెప్పారు. ఇది రేవంత్ మీద గౌరవంగా చూడాలా? లేక రాయలసీమ ప్రజల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది కొరవడడంగా చూడాలా? అందరూ వీరిద్దరి సంబంధంగా చూస్తారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో టీడీపీ తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. రేవంత్‌ను కాంగ్రెస్ లోకి పంపడం మొదలు, ఆయన ముఖ్యమంత్రి అవడం వరకు చంద్రబాబు పాత్ర ఉందని చాలామంది చెబుతుంటారు. తాజాగా జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో సైతం తెలుగుదేశం పార్టీ మాత్రం తన మిత్రపక్షమైన బీజేపీకి కాకుండా కాంగ్రెస్‌కే అనుకూలంగా పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. రాజకీయంగా ఇంతగా కలిసిపోయిన చంద్రబాబు, రేవంత్‌లు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తే ఫర్వాలేదు. ఇప్పటి వరకు తెలంగాణలో చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ప్రభుత్వం నడుస్తోందని అనుకునేవారు. తాజాగా ఈ రేవంత్ ఈ సమాచారం వెల్లడించడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ చెప్పినట్లు ఏపీలో చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్న భావన కలుగుతుంది. అందులో ఇది ఒకటి. కాకపోతే ఈ రహస్యం రేవంత్ చెప్పేస్తారని చంద్రబాబు ఊహించి ఉండరు. దీనివల్ల ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా రేవంత్ ఈ గుట్టు విప్పడం విశేషం.
ఏపీ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపేయడం వెనుక కారణాలేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుందని ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు ఈ అంశంలో చంద్రబాబు తీరును ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. కొందరైతే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, రేవంత్‌కు 2009 నుంచి సంబంద బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లవలసి వచ్చింది.అయినా చంద్రబాబు ఆ కేసులో ఇబ్బంది పడకుండా రేవంత్ సహకరించారని చెబుతారు. అప్పటి నుంచి వీరి మధ్య దోస్తి బాగా కుదిరిందని రాజకీయవర్గాలు నమ్ముతాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార ప్రయోజనాలు కూడా తెలంగాణలో అధికంగా ఉన్నాయి. కారణం ఏమైనా చంద్రబాబు ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడానికి కూడా సిద్దపడడంం దారుణమనిపిస్తుంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు జవాబు ఇవ్వకపోవడం గమనార్హం.
జగన్ ఒక విజన్‌తో రాయలసీమ అభివృద్దికి, నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం ఎంతసేపు రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంటారన్న విషయం మరోసారి తేటతెల్లమవుతుంది. పైకి మాత్రం రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెబుతుంటారు. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క ఇరిగేషన్ స్కీమ్ తీసుకురాలేదు. ఉన్నవాటిని పూర్తి చేయలేదు. ఎన్నికల సమయాలలో మాత్రం శంకుస్థాపనల హడావుడి చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు ఇలాగే పలు స్కీమ్‌లకు శంకుస్థాపనలు చేసి పట్టించుకోకపోతే అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2002 ప్రాంతంలో శిలాఫలకాల వద్ద పూలు పెట్టి వచ్చి నిరసన తెలిపారు. తదుపరి తాను సీఎం అయ్యాక ఆయన చేపట్టిన తొలి కార్యక్రమం జలయజ్ఞం. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలలో వివిద ప్రాజెక్టులు చేపట్టారు.
పోలవరం ప్రాజెక్టు ఈ దశకు రావడానికి, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు వద్ద నీటి తరలింపు సామర్ధ్యం 44వేల క్యూసెక్కులకు పెంచడానికి పనులు ఆరంభిస్తే తెలుగుదేశం పార్టీ ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన తెలిపింది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారు. చంద్రబాబు వారినెవరిని వారించ లేదు. తదుపరి జగన్ ముఖ్యమంత్రి అయి తీసుకువచ్చిన రాయలసీమ లిఫ్ట్‌కు చంద్రబాబే నిలిపివేశారంటే ఏమనుకోవాలి. ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు నీటిని మసర్ధంగా వాడుకోవాలని అంటూంటారే ఎందుకు చెబుతున్నారా అన్న సందేహం వచ్చింది. ఇప్పుడు అసలు విషయం బోధపడినట్లయింది.
తెలంగాణ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ఒక సంగతి అయితే, ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు మంగళం పలకడం మరో ఎత్తు. గోదావరి-బనకచర్ల స్కీమ్ అని కొన్నాళ్లు హడావుడి చేశారు. దాంతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని భ్రమలు పెట్టడానికి యత్నించారు.తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించగానే, దానిని మానుకుని ఇప్పుడు గోదావరి నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టు అంటూ కొత్త గాత్రం అందుకున్నారు. ఇది కూడా సుమారు అరవైవేల కోట్ల ప్రాజెక్టు అట. ఇది ఎప్పుడు ఆరంభం అవుతుందో, ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరం తెలిపింది.నిజానికి ఈ భారీ స్కీమ్ లపై చంద్రబాబుకు నమ్మకం ఉండి చేపడుతున్నారని చెప్పజాలం.కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఇతరత్రా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుంటారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఒక్కటి మాత్రం నిజం.
చంద్రబాబుకు గతంలో అసలు భారీ నీటి ప్రాజెక్టులంటే పెద్దగా నమ్మకం లేదు. ఎన్నికలలో అవి ఫలితాలు ఇవ్వవన్నది ఆయన భావన. టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న దివంగత నేతలు ఎర్రా నారాయణస్వామి, వడ్డి వీరభద్రరావు వంటి వారు ఆ రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకోసం ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు మాత్రం కిమ్మనే వారు కారు. వైఎస్ అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు సాకారం అవడం ఆరంభం అయింది. ఏది ఏమైనా రాయలసీమ ప్రజలకు రేవంత్ చెప్పిన విషయం పిడుగుపాటు వంటిది.అదే టైమ్ లో టిడిపి,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందన్న సంగతి నిర్దారణ అవుతుంది.ఈ కూటమిని రాయలసీమ ప్రజలు ఇంకా క్షమిస్తారా?

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


