Anger management జెన్ గురువు వద్దకు ఒక వ్యక్తి వెళ్లి, ‘నేను నా కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నాను గురువుగారూ! దయచేసి నా కోపాన్ని వదిలించు కోవడానికి ఏదైనా మార్గం చెప్పండి’ అని అడిగాడు. చెప్పినదంతా విన్న గురువు ‘ఏదీ నీ కోపాన్ని కొంచెం నా పట్ల చూపించు’ అన్నారు. అయితే శిష్యుడు కోపాన్ని ఎలా చూపించాలో తెలియక అయోమయంలో పడ్డాడు. కోపం నుంచి బయట పడాలని నేననుకుంటుంటే ఈయన ఇలా అంటారేమిటీ అనుకున్నాడు. ప్రస్తుతానికి తాను కోపంగా లేను కనుక ఇప్పటికిప్పుడు కోపాన్ని చూపించలేనన్నాడు.
అయితే గురువు వదల్లేదు. ‘అది నా సమస్య కాదు. నీకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడే వచ్చి నాకు నీ కోపాన్ని చూపించు’ అన్నారు. ఇంతలో శిష్యుడికి నిజంగానే కోపం వచ్చి ‘నేను కోపంగా ఉన్నప్పుడు వెంటనే దానిని చూపించలేను. నాకెప్పుడు కోపం వస్తుందో చెప్పలేను. కొన్ని సమయాల్లో నేను కోపంగా ఉంటాను. అప్పుడు, నేను మీ వద్దకు వచ్చి మీకు వెంటనే చూపించలేను’ అన్నాడు. ()
అంతట గురువు ‘ఓహో అలాగా... అయితే నీ కోపం ఒక స్వభావం కానట్టే...’ అని అన్నారు. ‘కోపం నీ నిజమైన స్వభావమైతే, నువ్వు దానిని నాకు ఎప్పుడైనా చూపించగలవు. నువ్వు పుట్టినప్పుడు నీకు కోపం లేదు. నీ తల్లితండ్రులు దానిని నీకేమీ ఇవ్వలేదు. కాబట్టి కోపం బయటి నుంచే వచ్చి ఉండాలి. నువ్వు దానిని సులభంగా వదిలించుకోవచ్చు’ అని గురువు అన్నారు.
కోపం అనేది ఒక ఆమ్లం లాంటిది. ఆమ్లం ఎవరి మీద పడుతుందో వారికన్నా... దాన్ని నిల్వ చేసిన పాత్రకే ఎక్కువ హాని చేస్తుంది. కోపం మన సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. కోపం అనేది ఒక లోపం. అది బయటకు వచ్చినప్పుడు ఎదుట ఉన్న వ్యక్తి కంటే కోపిష్ఠికే ఎక్కువ హాని చేస్తుంది. కనుక అది మనలో తిష్ఠ వేయకుండా చూసుకోవాలి.
– యామిజాల జగదీశ్


