సాక్షి బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. జనవరి ఆరు రేపటితో అత్యధిక కాలం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రికార్డును ఆయన సమం చేయనున్నారు. ఆ తరువాత రోజుతో అధిక కాలం పనిచేసిన వ్యక్తిగా కొత్త రికార్డు సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి అనుచరులు, శ్రేయోభిలాషులు సంబురాలు చేసుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం కుర్చీ కోసం పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎంట్రీతో ప్రస్తుతానికి ఆ విషయం సద్దుమణిగింది. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. రేపటితో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కాలాన్ని సమం చేసిన ఆయన... ఎల్లుండితో ఆ రికార్డు బద్దలు కొట్టనున్నారు.
ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డి. దేవరాజ్ ఉర్స్ ఇంతకాలం వరకూ అక్కడ అధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన 1972-77, 1978-80 కాలంలో సీఎంగా కర్ణాటకకు సేవలంధించారు. మెుత్తంగా ఆయన 7సంవత్సరాల 239రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే రేపటితో సిద్ధరామయ్య ఆరికార్డును సమం చేస్తారు. 2013-18తో పాటు 2023నుంచి ఆయన సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో జనవరి ఏడుతో అత్యధిక కాలం కర్ణాటకకు సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.
అయితే ఈ రికార్డుపై సిద్ధరామయ్య స్పందించారు... "ప్రజల ప్రేమ ఆశీర్వాదం వల్లే ఇంతకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలంధించా, రాజకీయాల్లోకి ప్రవేశించేటప్పుడు మంత్రి, ముఖ్యమంత్రిగా సేవలంధిస్తానని నేను అనుకోలేదు. కేవలం ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నాను". అని సిద్ధరామయ్య అన్నారు. ఇప్పటివరకూ తాను మెుత్తం 13 ఎన్నికల్లో పోటీచేస్తే ఎనిమిది ఎన్నికల్లో గెలిచానని తెలిపారు.
తొలిసారి తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలే తనకు నిధులు సమకూర్చి గెలిపించారన్నారు. సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలుగొట్టినట్లుగా తాను వాటిని అధిగమించానని సిద్ధరామయ్య సరదాగా అన్నారు.


