ప్రస్తుత రోజుల్లో ఏది కావాలన్నా ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు, గ్యాడ్జెట్ల కొనుగోలు ఎక్కువగా ఆన్‌లైన్ వేదికగానే జరుగుతోంది. ఇలా కొంటున్నప్పుడు ఒక్కొక్కసారి వస్తువుల ధర లిస్టింగ్ విషయంలో పొరపాట్లు జరుగుతుంటాయి. వీటిని చూసి దొరికిందిలే ఛాన్స్ అంటూ వెంటనే కొనేస్తుంటారు. ఆ తప్పిదాలను గ్రహించి వాటిని రాబట్టుకునేందుకు విక్రేతలు నానా పాట్లు పడుతుంటారు.
అచ్చం ఇలాగే జరిగింది ఇటలీలో. ఇటాలియన్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ మీడియా వరల్డ్ ఇటీవల తన లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులకు 13-అంగుళాల యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ను పొరపాటున 15 యూరోలకే (సుమారు రూ .1,500) విక్రయించింది. ఈ డివైజ్ అసలు ధర సుమారు రూ .79,990. వార్తా సంస్థ వైర్డ్ కథనం ప్రకారం.. రిటైలర్ 11 రోజుల తరువాత పొరపాటును గ్రహించారు. అయితే అప్పటికే ఆన్ లైన్ ఆర్డర్ లు పంపిణీ అయిపోయాయి. చాలా మంది కస్టమర్లు తమ ఐప్యాడ్ లను స్టోర్లో తీసుకున్నారు.
ధర లిస్టింగ్ విషయంలో జరిగిన పొరపాటును గ్రహించిన మీడియా వరల్డ్ వాటిని తిరిగి రాబట్టుకునే పనిలో పడింది. పొరపాటు ధరకు ఐపాడ్లను కొనుక్కున్న కస్టమర్లందరినీ సంప్రదించింది. ఆ ఐపాడ్‌లను తిరిగి ఇవ్వాలని లేదా వాస్తవ ధరకు సరిపోయేలా మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని కోరింది. దీనిపై డిస్కౌంట్ ఇస్తామని, లేదా ఐపాడ్ తిరిగి ఇచ్చేస్తే వారు చెల్లించిన మొత్తం వెనక్కి ఇచ్చి అసౌకర్యానికి పరిహారంగా 20 యూరోల (సుమారు రూ .2,050) వోచర్ కూడా ఇస్తామని వేడుకుంటోంది.


