న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో 2025 నవంబర్ 23న జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) తాజాగా ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కాబూల్ నుండి ఢిల్లీకి వస్తున్న అరియానా ఆఫ్గన్ ఎయిర్‌లైన్స్ విమానం (ఏఎప్‌జీ311), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సూచించిన రన్‌వే 29ఎల్ కు బదులుగా పొరపాటున రన్‌వే 29ఆర్‌పై ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో మరొక విమానం అదే రన్‌వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఏఏఐబీ.. విమానంలోని పైలట్-ఇన్-కమాండ్, ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరికీ చెల్లుబాటు అయ్యే లైసెన్సులు, మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే విధుల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కూడా అర్హతలు కలిగి ఉన్నారని పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలోని నావిగేషన్ వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ల్యాండింగ్‌కు కేవలం నాలుగు నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 'ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్' (ఐఎల్‌ఎస్)సిగ్నల్ కోల్పోయామని, వాతావరణం సరిగా లేకపోవడంతో రెండు సమాంతర రన్‌వేల మధ్య తేడాను గుర్తించలేక పొరపాటు పడ్డామని విమాన సిబ్బంది విచారణలో వెల్లడించారు.
ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలోని రన్‌వే 29ఎల్, 29ఆర్ మధ్య కేవలం 360 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. డీజీసీఏ (డీజీఏసీ) నిబంధనల ప్రకారం వీటిని ఒకేసారి ల్యాండింగ్ కోసం వాడకూడదు. ఘటన సమయంలో రన్‌వే 29ఆర్ పై ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతుండగా, అఫ్గాన్ విమానం అదేచోట ల్యాండ్ అయింది. ఆ సమయంలో ఆ రన్‌వేకు సంబంధించిన అప్రోచ్ లైట్లు, ఐఎల్ఎస్ వ్యవస్థలు కూడా ఆపివేసి ఉన్నాయి. విచారణలో భాగంగా డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్)ను స్వాధీనం చేసుకున్నప్పటికీ, విమానం తదుపరి ప్రయాణం సాగించడంతో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లోని పాత డేటా పోయిందని అధికారులు గుర్తించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఏఏఐబీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కీలక భద్రతా సిఫార్సులను చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని ఏటీసీ టవర్లలో వీడియో, ఆడియో రికార్డింగ్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. కంట్రోలర్లు విధుల్లో ఉన్నప్పుడు వారి సంభాషణలు, కదలికలను రికార్డ్ చేయడం వల్ల ప్రమాదాల విచారణలో ఖచ్చితత్వం పెరుగుతుందని ఏఏఐబీ అభిప్రాయపడింది. అయితే ఈ రికార్డింగులను కేవలం విచారణ అవసరాల కోసమే తప్ప, సిబ్బందిని ఇబ్బందిపెట్టడానికి వాడకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నది.
ఇది కూడా చదవండి: పూణే: రోబో శునకాలతో ఓట్ల వేట.. భారీ కానుకల వెల్లువ


