న్యూఢిల్లీ: నకిలీ, డూప్లికేట్ పాస్‌పోర్ట్‌ల తయారీకి అడ్డుకట్టవేయడంతోపాటు అదనపు ఫీచర్లు జోడిస్తూ అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటి జారీని వేగవంతం చేసింది. ఇప్పటికే 80 లక్షల ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ పూర్తయిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
పాత పాస్‌పోర్ట్‌లు 2035 ఏడాది దాకా లేదంటే వాటి ఎక్స్‌పయిరీ తేదీ ఉన్నంత వరకు మనుగడలో ఉంటాయని పేర్కొంది. కరెన్సీ నోట్లపై అత్యంత సూక్ష్మంగా ముద్రించే అక్షరాలు, అత్యంత పల్చటి ఆకృతులు, థ్రెడ్ తరహాలో పాస్‌పోర్ట్ పేజీలను అధునాతన భద్రతా ప్రమాణాలతో తయారుచేసినట్లు భారత విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది. దేశ, విదేశాల్లోని పౌరుల కోసం పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(పీఎస్‌పీ వీ.2.0), గ్లోబల్ పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(జీపీఎస్‌పీ వీ.2.0), ఇ–పాస్‌పోర్ట్‌లు తీసుకురాబోతున్నట్లు విదేశాంగ శాఖ గతంలోనే ప్రకటించడం విదితమే.
చిప్, యాంటెన్నాలతో పాస్‌పోర్ట్
కొత్త పాస్‌పోర్ట్ పేజీల పరంగా, ఎల్రక్టానిక్ అంశాల పరంగా అధునాతమైంది. పాస్‌పోర్ట్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ) చిప్‌తోపాటు సూక్ష్మస్థాయి యాంటెన్నాను అమర్చారు. ఇవి ఆ పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తి సంబంధించిన డేటాను తనలో ఇముర్చుకుంటాయి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల ప్రమాణాలకు అనుగుణణంగా ఈ ఫీచర్లను జోడించారు. డేటా పేజీలో పోస్‌పార్ట్ ఉన్న వ్యక్తికి సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. దీంతో దీనిని ఫోర్జరీచేయడం అసాధ్యం.


