పీహెచ్‌డీ అడ్మిషన్లకు అర్హత పొందే ‘సెట్’ పరీక్ష నిర్వహణలోనూ చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం
గతంలో 2024 ఏప్రిల్‌లో చివరిసారిగా సెట్ నిర్వహణ
దేశవ్యాప్తంగా నెట్‌ను క్రమంగాతప్పకుండా నిర్వహిస్తున్న వైనం
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. పీహెచ్‌డీ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లకు నిర్వహించే ఏపీ సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్) నిర్వహించడంలేదు. దేశవ్యాప్తంగా నెట్‌ను క్రమంగా తప్పకుండా నిర్వహిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం నేటికీ దాని ఊసే లేకుండా పోయింది.
తిరోగమనంలో విద్యారంగం
చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యారంగం తిరోగమన దిశలో పయనిస్తోంది. ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి 2025–26 విద్యా సంవత్సరంలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యార్థు జీవితాలతో చెలగాటం ఆడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహణ విషయంలోనూ అదే తీరును అవలంభిస్తుండటంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వం నోటిఫికేషన్‌ను తాత్సారం చేయడంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు ఏపీ సెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి, అలాగే డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్), నెట్ (నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్) ఇందులో ఏదో ఒకటి, లేదా పీహెచ్‌డీ చేసిన వారు అర్హులు.
ఏపీ సెట్‌కు పీజీ పూర్తి చేసిన వారు, లేదా పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు. ఏటా వేలాది మంది రాసే ఈ పరీక్షల్లో అప్పుడే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లో ఉద్యోగాలు చేస్తూ ఏపీ సెట్‌కు పోటీపడే అభ్యర్థులు కూడా ఉంటున్నారు.
చివరిసారిగా గతేడాది ఏప్రిల్‌లో..
ఏపీ సెట్‌ను గతేడాది ఏప్రిల్ నెలలో నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సెట్‌ను నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటిదాకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సెట్ నిర్వహించకపోవడంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇంటర్నల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నెట్, సెట్ అర్హత సాధించిన వారికి నేరుగా ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా పీహెడీ అడ్మిషన్ కల్పించే వెసులుబాటు కల్పించారు.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నూతన రీసెర్చ్ ప్రాజెక్ట్‌ల ఊసే లేకుండా పోయింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద గతంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్ట్‌లు వచ్చేవి. ప్రస్తుతం రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు లేక డిపార్ట్‌మెంట్లు బోసిపోయాయి. కొత్త ప్రాజెక్ట్‌లు వస్తే వాటి కింద అడ్మిషన్లు కల్పించి పీహెచ్‌డీ డిగ్రీ అందించవచ్చు. వర్సిటీకి బోధన, పరిశోధన, సామాజిక బాధ్యత ముఖ్యమైన విధి. బోధించడానికి ఇక్కడ ప్రొఫెసర్లు లేరు. పరిశోధనకు కొత్త ప్రాజెక్ట్‌లు లేవు.
గతంలో బోటనీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, పాలిమర్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో అద్భుతమైన రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు నిర్వహించిన ఘనత ఉంది. బోటనీలో 32 వేల స్పెసిమెన్లు భద్రపరిచారు. వాటిలో ఇది వరకు ఉన్న ప్రాజెక్ట్‌లు మినహా ఏడాదిన్నరలో ఒక్క రీసెర్చ్ ప్రాజెక్ట్ రాలేదు.
రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు కావాలని దరఖాస్తు చేసినా.. డిల్లీ స్థాయికి వెళ్లి ప్రాజెక్ట్‌లు తెచ్చేంత చొరవ ఎవరూ తీసుకోవడం లేదు. రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు, పేటెంట్లతో తమకేం సంబంధం లేనట్లు వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
డిసెంబర్‌లోనే యూజీసీ నెట్
రాష్ట్రంలో సెట్ తరహాలోనే యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్)ను నిర్వహిస్తోంది. యూజీసీ ఏడాదిలో రెండు దఫాలు, జూన్, డిసెంబర్‌లో క్రమం తప్పకుండా చేపడుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. యూజీసీ నెట్‌ను దేశవ్యాప్తంగా ఏటా 5 నుంచి 7 లక్షల మంది అభ్యర్థులు రాస్తారు.


