నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు బాబు పాకులాట
2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన
ఎయిర్ పోర్టు కోసం అన్ని అనుమతులు సాధించింది వైఎస్ జగన్
2023 మే 3న నిర్మాణ పనులకు శంకుస్థాపన.. జూన్ 2026 నాటికి నిర్మాణ లక్ష్యం
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
మహారాణిపేట: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. సోమవారం మద్దిల పాలెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో చంద్రబాబు కంట్రిబ్యూషన్ ఏమీలేదని విమర్శించారు. టీడీపీ నేతలు సిగ్గు లేకుండా భోగాపురం క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీకి పాల్పడడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేశారన్నారు.
భూసేకరణ, అనుమతులు, ఆర్థిక వనరులు లేకుండా ఏ రకంగా నిర్మాణం చేద్దామని అప్పట్లో బాబు శంకుస్థాపన చేశారో తెలీదని విమర్శించారు. 2019లో వైఎస్ జగన్ హయాంలోనే ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణతోపాటు అన్ని అనుమతులు సాధించిన తర్వాతే 2023 మే 3న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. అదేరోజు జూన్ 2026 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. అందులో భాగమే ఆదివారం జరిగిన విమాన ల్యాండింగ్ ట్రయల్ రన్ అని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ఇదే జగన్ విజన్‌కి తార్కాణమన్నారు.
నిర్వాసితులకూ వైఎస్సార్‌సీపీ హయాంలో న్యాయం చేస్తూ.. నాలుగు గ్రామాల ప్రజలకు పరిహారం, మౌలిక సదుపాయల కల్పన కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రెండుచోట్ల కాలనీలు నిరి్మంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతోపాటు ఎయిర్‌పోర్టు విషయంలో కట్ పేస్ట్ వీడియోలతో జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రీల్స్ రామ్మోహన్‌ను పంపిస్తే ఆయనేమో తన ఘనతగా తాను సాధించినట్లుగా ఫీలవుతున్నారని విమర్శించారు. విజయవాడ విమానాశ్రయాన్ని ఏళ్లతరబడి కడుతున్నారని, మరి దానిని రామ్మోహన్‌నాయుడు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తమ పేరు పెట్టుకోవడం వారికి అలవాటు అని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.
కుప్పంలో ఎయిర్ పోర్టు మాటేమిటి?
‘అమరావతిలో కొత్తగా ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ నిరి్మస్తామని బాబు అంటున్నారు. ఇంకా వింటే పోర్టు కూడా కడతామని చెబుతారు. మీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్ స్ట్రిప్‌కి సంబంధించి 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. అది ప్రారంభమైందా? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోడ్ కనెక్టివిటీ ఉండాలని వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి హాజరైన కేంద్రమంత్రి గడ్కరీని ఒప్పించి ప్రకటన చేయించాం. ఈ ఘనత జగన్‌కే దక్కుతుంది. భోగాపురం విమానాశ్రయానికి ఆరులేన్ల జాతీయ రహదారి ఏమైపోయింది.
బాబు అధికారంలోకి రాగానే మెట్రో, పోర్టు, ఎయిర్‌పోర్టు అని చెప్పడం పరిపాటిగా మారింది. విశాఖ మెట్రో గురించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫీజుబులిటీ రిపోర్ట్ లేదు, మరోసారి పంపించాలని చెప్పింది. దీన్నే చంద్రబాబు 2029 ఎన్నికల వరకు తిప్పి.. ఎన్నికల ముందు టెంకాయ కొడతారు. అమరావతిలో మాత్రం ఆవకాయ్ అంటారు. ఏ ప్రాజెక్టుకైనా ముందు టెంకాయ్ నాదే అనడం బాబు అలవాటు. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ్.. ఆంధ్రాకు అప్పులు, చంద్రబాబు గొప్పలు తప్ప ఇంతకుమించి ఈ రెండేళ్లలో సాధించిందేమీ లేదు’ అని అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.
విజన్ అంటే జగన్.. భజన అంటే బాబు
‘విజన్ అంటే జగన్, భజన అంటే చంద్రబాబు అన్న విషయం ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. పబ్లిసిటీ తప్ప మరోకటి లేదు. ఏ చానెల్ పెట్టినా బాబుకు జాకీర్ హుస్సేన్‌ని మించి తబలా కొట్టేవాళ్లు తయారు అయ్యారు. ఇంత డప్పు కొట్టినా.. రాష్ట్రం మాత్రం అప్పులపాలైంది. రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ రోజు జగన్‌కి ఇచ్చిన మాట ప్రకారం జీఎమ్మార్ సంస్థ ఈ ప్రాంత ప్రజల ఆశలను నిజం చేసింది. ఆ సంస్థకు ధన్యవాదాలు’ అని అమర్‌నాథ్ పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు.


